ప్రధాని మోడీ ఆరోపణ
పురూలియ(పశ్చిమ బెంగాల్): పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సందర్భంగా గిరిజన జంగల్‌మహల్ ప్రాంతంలోని పురూలియాలో గురువారం నాడు ఒక ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ మమతా బెనర్జీ అనుసరిస్తున్న బుజ్జగింపు రాజకీయ విధానాల వల్ల రాష్ట్రంలోకి చొరబాట్లు పెరిగిపోతున్నాయని ఆయన ఆరోపించారు. దళితులు, వెనుకబడిన వర్గాలు, ఆదివాసీలను సొంత మనుషులుగా అధికార టిఎంసి ఎన్నడూ పరిగణించలేదని, వారి నుంచి దోపిడీ చేయడమే ఆ పార్టీ లక్షమని ఆయన అన్నారు.
అజ్ఞాత మావోయిస్టులకు మమత ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తోందని కూడా ఆయన ఆరోపించారు. మే 2వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగిన నాడు రాష్ట్రంలో మమతా బెనర్జీ ఆట ముగిసి అభివృద్ధి మొదలవుతుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఒక వర్గం వారిని మమత ప్రభుత్వం బుజ్జగిస్తోందని ఆయన పదేపదే ఆరోపించారు. సైన్యం తిరుగుబాటుకు కుట్ర పన్నుతోందని ఆరోపించింది ఎవరో, పుల్వామా దాడి, బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్ సందర్భంగా ఎవరి పక్షాన నిలబడ్డారో బెంగాల్ ప్రజలు మరచిపోలేదని ఆయన మమతా బెనర్జీపై ఆరోపణలు గుప్పించారు. కొవిడ్ కారణంగా లాక్‌డౌన్ విధించిన కాలంలో కూడా టిఎంసి ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలను టిఎంసి ప్రభుత్వం అమలు చేయడం చేయడం లేదని ఆయన చెప్పారు. లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బు జమ చేసే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్(డిబిటి) పథకాన్ని తాము నమ్ముతామని, కాని టిఎంసి ప్రభుత్వం మాత్రం ట్రాన్స్‌ఫర్ మై కమిషన్(కమీషన్ బదిలీ)ని నమ్ముతోందని ఆయన ఎద్దేవా చేశారు.