Wednesday, January 22, 2025

దృష్టి మరల్చేందుకే ‘సనాతన రగడ’.. చట్టపరంగా ఎదుర్కొంటా : ఉదయనిధి

- Advertisement -
- Advertisement -

చెన్నై : ‘సనాతన ధర్మం’ పై తాను చేసిన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరిస్తోందని డిఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఈ విషయంలో తనపై నమోదైన అన్ని కేసులను చట్టబద్ధంగా ఎదుర్కొంటానని తెలిపారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. బీజేపీ శ్రేణుల నుంచి తీవ్ర స్థాయిలో ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఈ తరుణంలో ఆయన స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మోడీని ఉదయనిధి విమర్శించారు. ఆయనను‘ ప్రపంచ యాత్రికుడు ’ అంటూ ఎద్దేవా చేశారు. మణిపూర్‌లో జరుగుతున్న హింసపై ప్రశ్నలను ఎదుర్కోవడానికి భయపడుతున్నారని, వ్యాఖ్యానించారు. ‘ గత తొమ్మిదేళ్లుగా మీరు (బీజేపీ) ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదు. ప్రజాసంక్షేమానికి మీరు ఏం చేశారన్నదే ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎదురవుతున్న ప్రశ్న. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలు నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు. దీన్ని వారు తమని తాము రక్షించుకోవడానికి ఆయుధంగా వాడుకొంటున్నారు” అని ఉదయనిధి అన్నారు.

“ గౌరవప్రదమైన పదవుల్లో ఉండి ఇలా అపవాదులు మోపుతున్నందుకు నేనే మీపై కేసులు పెట్టాలి. కానీ మీ మనుగడ కొనసాగడానికి ఇదే ఆధారమని నాకు తెలుసు. బతుకుదెరువుకు మీకు మరో మార్గం తెలియదు. అందుకే మీపై కేసులు పెట్టొద్దని నిర్ణయించుకున్నా. మేం డీఎంకే వ్యవస్థాపకుడు, ద్రవిడ దిగ్గజం అన్నాదురై రాజీకీయ వారసులం. మేం ఏ మతానికీ వ్యతిరేకం కాదని అందరికీ తెలుసు” అని ఉదయనిధి అన్నారు. “ ఏ మతమైనా ప్రజలను సమానత్వం వైపు నడిపిస్తూ …సౌభ్రాతృత్వాన్ని బోధించినట్లైతే , నేనూ ఆధ్యాత్మిక వాదినే. ఒకవేళ ఏదైనా మతం కులాల పేరిట ప్రజలను విభజిస్తూ, అంటరానితనం, బానిసత్వాన్ని బోధిస్తే, అలాంటి మతాన్ని వ్యతిరేకించేవారిలో నేను ముందుంటాను” అని గతంలో అన్నాదురై అన్నట్టు ఉదయనిధి ఈ సందర్భంగా తెలిపారు.

అందరూ సమానత్వంతో జన్మించారని బోధించే అన్ని మతాలను డీఎంకే గౌరవిస్తుందని పేర్కొన్నారు. బీజేపీ వీటిని అర్థం చేసుకోకుండా …. కేవలం బురద జల్లే ప్రయత్నాల్లో మాత్రమే ఉందని ఉదయనిధి అన్నారు. మోడీ, ఆయన బృందం పూర్తిగా ఈ కార్యక్రమాల్లోనే నిమగ్నమైందని విమర్శించారు. తమిళనాడులో డీఎంకే తరహాలో … కేంద్రంలో బీజేపీ ఒక్క ప్రగతిశీల పథకమైనా ప్రవేశ పెట్టిందా ? అని ప్రశ్నించారు. మణిపూర్ హింస వంటి అంశాల నుంచి దేశ ప్రజల దృష్టిని మళ్లించేందుకే మోడీ, ఆయన బృందం , తన వ్యాఖ్యల్ని ఆయుధంగా మలుచుకుంటోందన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News