Monday, December 23, 2024

వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే నా వ్యాఖ్యల వక్రీకరణ: ఉదయనిధి

- Advertisement -
- Advertisement -

చెన్నై: సనాతన ధర్మాంపై తాను చేసిన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలకు తమిళనాడు మంత్రి, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ గురువారం ఘాటుగా స్పందించారు. తన వ్యాఖ్యలను కాషాయ పార్టీ నాయకులు వక్రీకరిస్తున్నారని ఆయన తెలిపారు. తనపై నమోదవుతున్న కేసులను చట్టపరంగానే ఎదుర్కొంటానని ఆయన స్పష్టం చేశారు. మనిపూర్ హింసాకాండపై ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పలేక ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ యాత్ర చేస్తున్నారని ఉదయనిధి ఎద్దేవా చేశారు.

గత తొమ్మిదేళ్లలో చేసిన ఏ ఒక్క వాగ్దానాన్ని బిజెపి ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని, తమ సంక్షేమం కోసం ఏం చేశారంటూ కేంద్రంలోని ఫాసిస్టు ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీస్తున్నారని ఆయన చెప్పారు. తమ వైఫల్యాలను కప్పిపుచుకోవడానికే బిజెపి నాయకులు సనాతన ధర్మంపై తాను చేసిన ప్రకటనను వక్రీకరిస్తున్నారని ఆయన తెలిపారు. తప్పుడు వార్తలను ఆధారం చేసుకుని తనపై చర్యలు తీసుకోవాలని కేంద్ర అమిత్ షా, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిమాండ్ చేయడం ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు.

ద్రవిడ ఉద్యమ దిగ్గజం, డిఎంకె వ్యవస్థాపకుడు సిఎన్ అన్నాదురై రాజకీయ వారసులలో తాను కూడా ఒకడినని, తాము ఏ మతానికి శత్రువులం కామని అందరికీ తెలుసునని ఆయన చెప్పారు. ప్రజలను సమానత్వం వైపు నడిపించి వారిలో సోదరభావాన్ని మతం పెంపొందిస్తే తాను కూడా ఆధ్యాత్మికవాదినేనని, అదే మతం కులాల పేరిట విడదీసి, అంటరానితనాన్ని, బానిసత్వాన్ని బోధిస్తే మతాన్ని వ్యతిరేకించే వారిలో తానే అందరికన్నా ముందుంటానన్న అన్నాదురై వ్యాఖ్యలను ఉదయనిధి ఈ సందర్భంగా గుర్తు చేశారు. మనుషులంతా ఒక్కటేనని బోధించే అన్ని మతాలను డిఎంకె సమానంగా గౌరవిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఇవేవీ అర్థం చేసుకోకుండా ప్రధాని నరంద్రే మోడీ, ఆయన అనుచరులు రానున్న లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోలేక ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గత తొమ్మిదేళ్లలో మోడీ ప్రజలకు చేసిందేమిటని ఆయన ప్రశ్నించారు. నోట్లను రద్దు చేయడం, గుడిసెలు కనిపించకుండా గోడలు కట్టడం, కొత్త పార్లమెంట్ భవనం నిర్మించి ధర్మదండాన్ని ప్రతిష్టించడం, దేశం పేరు మార్చడంపై ఎత్తుగడలు వేయడం, దేశ సరిహద్దుల్లో నిలబడి తెల్లజెండా ఊపడం తప్ప మోడీ చేసిందేమిటంటూ ఉదయనిధి దుయ్యబట్టారు.

మణిపూర్ హింసాకాండపై ప్రశ్నలు ఎదుర్కోలేక తన మిత్రుడు అదానీతో కలసి ప్రపంచ యాత్ర చేస్తున్నారంటూ ప్రధాని మోడీపై ఆయన ఆరోపణలు గుప్పించారు. ప్రజల అమాయకత్వమే వారి నాటకీయ రాజకీయాలకు పెట్టుబడిగా మారాయంటూ ఉదయనిధి ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News