రాహుల్ గాంధీ వ్యంగ్యబాణాలు
న్యూఢిల్లీ: కొవిడ్-19 మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహార శైలిపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. వ్యాక్సిన్లు, ఆక్సిజన్, మందులతోసహా ప్రధాని మోడీ కనిపించడం లేదని, సెంట్రల్ విస్టా ప్రాజెక్టు, ప్రధాని మోడీ ఫోటోలు మాత్రమే మిగిలాయని రాహుల్ ధ్వజమెత్తారు.
ట్విట్టర్ వేదికగా చేసుకుని గురువారం రాహుల్ గాంధీ ప్రధానిపై ఆరోపణాస్త్రాలు సంధించారు. దేశ పౌరుల పట్ల కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించిందని, కరోనా వైరస్ కల్లోలాన్ని సృష్టిస్తున్న ఈ సమయంలో ప్రజలంతా బాధితులకు అండగా సంఘటితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. వ్యాక్సిన్లు, ఆక్సిజన్, మందులతోపాటు ప్రధాని కూడా కనిపించడం లేదు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు, మందులపై జిఎస్టి, అక్కడక్కడ ప్రధాని ఫోటోలు మాత్రమే కనపడుతున్నాయి అంటూ రాహుల్ హిందీలో ట్వీట్ చేశారు.
దేశం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితులలో ప్రజలకు మనం ఇస్తున్నామా లేక వారి నుంచి తీసుకుంటున్నామా, వారికి సహాయపడుతున్నామా లేదా హాని చేస్తున్నామా అని ప్రభుత్వం తనను ప్రశ్నించుకోవలసి ఉంటుందని రాహుల్ మరో ట్వీట్లో వ్యాఖ్యానించారు. అయితే, భారత ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకుని పారిపోతోందని, ఈ క్లిష్ట సమయంలో ప్రజలంతా చేతులుకలిపి బాధితులకు అండగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు.