Saturday, January 11, 2025

అమెరికా మెప్పుకోసం మోడీపాట్లు

- Advertisement -
- Advertisement -

అమెరికన్ మీడియా ఆ మాటకొస్తే ఏ దేశ వాణిజ్య పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల ముసుగులో ఉన్న సంస్థలైనా తమ పాలకవర్గ ప్రయోజనాలకు అనుగుణంగా ఎవరినైనా తెగడాల్సి వస్తే చీల్చి చెండాడుతాయి. పొగడాల్సి వస్తే వెంపలి చెట్టుకు నిచ్చెనలు వేసుకొని ఎక్కే వారిని కూడా ఆజానుబాహువులుగా వర్ణిస్తాయి.2022 సెప్టెంబరు 15,16 తేదీల్లో ఉజ్బెకిస్తాన్‌లోని సామరకండ్ పట్టణంలో జరిగిన షాంఘై సహకార సంస్థ(ఎస్‌సిఓ) 2022 వార్షిక సమావేశాల్లో మన ప్రధాని నరేంద్రమోడీరష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ విడిగా భేటీ అయ్యారు.

Modi meets President Joe Biden

సదరు భేటీలో ‘నేటి యుగం యుద్ద యుగం కాదు, దీని గురించి నేను మీతో ఫోన్లో మాట్లాడినపుడు చెప్పాను’ అని ప్రధాని నరేంద్రమోడీ సామరకండ్‌లో పుతిన్‌తో చేప్పినట్లు మోడీ యంత్రాంగం వెల్లడించింది. దీన్ని తీసుకొని ఉక్రెయిన్‌పై పోరుకు ఇది సమయం కాదని మోడీ చెప్పినట్లుగా, ఇలా చెప్పటానికి ఎంతో ధైర్యం కావాలని అమెరికా మీడియా పతాక శీర్షికలతో టాంటాం వేసింది. అమెరికా వెంట నడిచే ఐరోపా పత్రికల్లోనూ ఇదే జరిగింది. కొన్ని శీర్షికలు ఇలా ఉన్నాయి. ‘ఉక్రెయిన్ మీద యుద్దంపై పుతిన్‌కు చివాట్లు పెట్టిన మోడీ’ వాషింగ్టన్ పోస్టు, ‘ఇది యుద్ధాలకు తగిన సమయం కాదంటూ పుతిన్‌కు చెప్పిన భారత నేత’ న్యూయార్క్ టైవ్‌‌సు. రష్యా దురాక్రమణ ప్రభావాల గురించి ప్రపంచమంతటా ఉన్న ఆందోళనకు ప్రతిస్పందనను మీరు చైనా, భారత్‌నుంచి వింటున్నారని అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ విలేకర్లతో అన్నాడు.

‘మీ ఆందోళన గురించి నాకు తెలుసు, సాధ్యమైన మేరకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముగించాలనే కోరుకుంటున్నాం, కానీ జెలెనెస్కీ సిద్దం కావటం లేదని’ మోడీకి పుతిన్ బదులిచ్చినట్లుగా వార్తలొచ్చాయి. టర్కీ మధ్యవర్తిత్వంలో ప్రారంభమైన చర్చలను అమెరికా, బ్రిటన్ అడ్డం గొట్టి తామిచ్చే అస్త్రాలతో పుతిన్ సేనలను ఓడించవచ్చని జెలెనెస్కీని వెనక్కు రప్పించిన సంగతి తెలిసిందే.

ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభమైన తొలి రోజుల్లో అమెరికా అధినేత జో బైడెన్ ప్రధాని నరేంద్రమోడీకి ఫోన్ చేసి రష్యా నుంచి చమురు కొనుగోలు పెంచటం భారత ప్రయోజనం కోసం కాదని చెప్పాడు. తరువాత అమెరికా ఉప భద్రతా సలహాదారు దలీప్ సింగ్ మాట్లాడుతూ రష్యాకు వ్యతిరేకంగా విధించిన ఆంక్షలను విఫలం చేసేందుకు భారత్ చురుకుగా ప్రయత్నిస్తే పర్యవసానాలను అనుభవించాల్సి ఉంటుందని బెదిరించిన సంగతి తెలిసిందే. దీని మీద దేశాధినేతగా నరేంద్రమోడీ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని రుద్దింది పశ్చిమ దేశాలు, ముఖ్యంగా అమెరికా అన్నది నరేంద్రమోడీకి తెలియని అంశం కాదు, ఆ కారణంగా తన ప్రభుత్వంజనాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులూ ఎరిగినప్పటికీ పశ్చిమ దేశాల వైఖరిని మిత్రధోరణిలో కూడా ఇంతవరకు తప్పు పట్టలేదు. కాశ్మీరు సమస్యలో తనను మధ్యవర్తిత్వం వహించమని నరేంద్రమోడీ కోరినట్లు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించినపుడు కూడా మోడీ స్పందించలేదు. అంతర్జాతీయ రాజకీయాల్లో మన దేశం చైనా మీద కత్తిగట్టి అమెరికాతో ఉండటం అమెరికా మీడియాకు సంతోషమే. ఆ వైఖరితో ఉన్నా కొన్ని సందర్భాల్లో మోడీని ఏకిపారవేసింది. మరికొన్ని సార్లు ఆకాశానికి ఎత్తింది.

“ అవాక్కయ్యేలా దుస్సాహస నిర్ణయాలు, విపత్కర ఫలితాలనిస్తున్న ప్రజారోగ్య విధానం, నివారించదగిన మరణాలు, కరోనా నరకం, లెక్కలు వేసుకుంటున్న పరిస్థితి ” భారత్‌లో కరోనా నివారణ వైఫల్యంపై అమెరికా, ఐరోపా, ఇతర ప్రపంచ పత్రికల్లో వచ్చిన కొన్ని శీర్షికలివి.తమ నేత మోడీ మీద బురదజల్లే రాతలు తప్ప వాస్తవాలు కాదని బిజెపి వారు ఆరోపించిన సంగతి తెలిసిందే. వివిధ రాష్ట్రాల్లో కరోనా మరణాలను దాచిపెట్టిన తీరు, బాధ్యత లేకుండా కుంభమేళా వంటి వాటిని అనుమతించటం, పెద్ద ఎత్తున ఎన్నికల సభలు, కరోనా మీద విజయం సాధించామని ప్రకటించటం, మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతులు రాజధానిలో ప్రవేశించకుండా రోడ్ల మీద మేకులు కొట్టించటం, వారి మీద తప్పుడు ప్రచారం వంటి అనేక అంశాల మీద అంతర్జాతీయ మీడియాలో విమర్శలతో కూడిన సంపాదకీయాలు, విశ్లేషణలు వెలువడ్డాయి. వాటిని ఖండించాలని ప్రపంచంలోని భారత దౌత్యవేత్తలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

విమర్శలు ప్రభుత్వ తీరు తెన్నులను బట్టి వచ్చాయి తప్ప ఊరికే రాలేదు. ప్రధాని మోడీ మితిమీరిన విశ్వాసం అని గార్డియన్, భారత్‌ను రక్షించటానికంటే నరేంద్రమోడీ పేరును కాపాడేందుకు బాధ్యతా రహిత చ్యలకు పాల్పడినట్లు వాషింగ్టన్ పోస్టు, మహావిపత్తు పట్ల తాపీగా మోడీ ఉన్నారని ఎకానమిస్టు, ముందుచూపు లేమి, దురహంకారం, వాక్శూరత్వంతో మోడీ వ్యవహరించినట్లు లీమాండే, జాతీయోన్మాదాన్ని రెచ్చగొట్టేందుకు మహమ్మారికి సంబంధం కలిపినట్లు గ్లోబల్ టైవ్‌‌సు, జయధ్వాన ధ్యాసలో పడి తప్పుగా అర్ధం చేసుకోవటం తరువాత స్పందన లేకుండా ఉన్నట్లు కతార్ ట్రిబ్యూన్, ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లేక రోగులు విలవిల్లాడుతుంటే పార్లమెంటు భవన పధకానికి ప్రాధాన్యన ఇచ్చిన అహంకారి, సిగ్గులేని వాక్శూరుడు మోడీ అని, గాంధీ, నెహ్రూ మాదిరి పేరు తెచ్చుకోవాలని చూస్తున్నారని డైలీ మెయిల్ వంటి పత్రికలు విమర్శించాయి.

పశ్చిమ దేశాల మీడియా ఏమిరాసిందనే దాని కంటే మన మీడియా రాయాల్సినవాటిని రాయటం లేదని, సంపాదక పేజీల్లో రాసిన వాటిని భారతీయులు చదవరనే విమర్శలు కూడా ఉన్నాయి. అధికారంలో ఎవరున్నా వారి మీద సునిశిత విమర్శ లు చేసే ధోరణి పశ్చిమ దేశాల్లో ఉంది, అదే సమయంలో వారిని కాపాడేందుకు కూడా చూస్తాయి. మన దేశంలో మొదటిదాన్ని వదలి రెండోదానికే ప్రాధాన్యత ఇవ్వటంతో జనం సంపాదక పేజీలను భజన సరకుగా చూస్తున్నారు. అందుకే చదవటం లేదు.
మన దేశంలో 2016నవంబరులో ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు పెద్ద ప్రహసనమని వివేచనా శక్తి ఉన్నవారందరికీ తెలిసిందే. కొండను తవ్వి ఎలుకను కాదు కదా దాని గొద్దెను కూడా పట్టలేదు. నల్లధనం వెలుపలికి రాకపోగా అది పూర్తిగా లెక్కల్లోని ధనంగా చెలామణిలోకి వచ్చింది.

అవినీతి గురించి చెప్పనవసరం లేదు. విధిలేక మాట మార్చి ధనం మొత్తం లెక్కలోకి రావటమే గొప్ప ఘనతగా మోడీ భక్తులు భజన చేశారు. జనం ఎన్ని ఇబ్బందులు పడిందీ వారికి పట్టలేదు. ఏం రాస్తే ఏం మాట్లాడితే ఎటుబోయి ఎటువస్తుందో, ఏం జరుగుతుందో మనకెందుకు లెమ్మని మన మీడియా సంస్థలు వైఫల్యం లేదా విజయం గురించి చెప్పకుండా అదియును సూనృతమే ఇదియును సూనృతమే అన్నట్లుగా ఉన్నాయి. నోట్ల రద్దు జరిగిన 50 రోజుల తరువాత దేశం బంగారం మాదిరి వెలిగిపోతుందని నరేంద్రమోడీ ఒక సభలో చెప్పారు. జనధన్ బాంకు ఖాతాల్లో ఎవరైనా వచ్చి రెండున్నర లక్షలు డిపాజిట్ చేసి ఆరునెలల తరువాత మాకు రెండు లక్షలు ఇచ్చి మిగతావి మీరు తీసుకోండి అని చెబితే అలా చేయవద్దు అని కూడా సెలవిచ్చారు. తన చర్య ఉగ్రవాదుల నడుం విరిచేస్తుందని అక్రమార్కులను అంతం చేస్తుందన్నారు.ఇంకా ఎన్నో చెప్పారనుకోండి.

ఇంతకీ జరిగిందేమిటి ? అసలు ఎంత కరెన్సీ తిరిగి వచ్చిందో, ఎంత నల్లధనం వెలికి వచ్చిందో ప్రకటించిన వారే లేరు. ఏమిటి అని అడిగితే ఇంకా లెక్కతేలలేదని చెప్పారు. నోట్లను లెక్కించుకోలేని అసమర్ధ స్థితిలో ఉన్నట్లు అంగీకరించారు. రెండు సంవత్సరాల తరువాత 2018లో 201718 సంవత్సర వార్షిక నివేదికలో లెక్కింపు పూర్తైనట్లు ఆర్‌బిఐ పేర్కొన్నది. 2016 నవంబరు ఎనిమిదిన 500, 1000 పెద్ద నోట్లు రద్దు చేసే నాటికి దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ విలువ రు.17.74 లక్షల కోట్లు. రద్దుచేసిన నోట్ల విలువ రు.15.41లక్షల కోట్లు, బాంకులకు తిరిగి వచ్చిన నోట్ల విలువ రు. 15.31లక్షల కోట్లు, రాని సొమ్ము కేవలం రు.10,720 కోట్లు మాత్రమే. అంటే నల్లధనం విలువ ఇది. తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకోవటం తెలియని మామూలు జనాలెందరో తరువాత గొల్లుమన్నారు. ఇక రద్దు చేసిన వాటి బదులు కొత్త 500, 2,000 నోట్లు అచ్చేసేందుకు ప్రభుత్వానికి లేదా ఆర్‌బిఐకి ఐన ఖర్చు రు.12,927 కోట్లు, జనం ఇబ్బందులు, కొత్త నోట్ల కోసం వరసల్లో నిలిచి పోగొట్టుకున్న పనిదినాలు, వేతనాల నష్టం లెక్కించిన వారెవరూ లేరు. దాన్ని పక్కన పెడితే ప్రభుత్వానికి అయిన జిడ్డు ఆముదం ఖర్చు రు. 2,207 కోట్లు. ఎవడబ్బ సొమ్మని ఇలా చేసినట్లు ?

ఈ మతిమాలిన పనిని ఐఎంఎఫ్, ఐరోపా సమాఖ్య, ప్రపంచబాంక్, ఇతర అనేక సంస్థలు, అమెరికా పత్రికలు పెద్ద ఎత్తున పొగిడాయి. ప్రపంచబాంక్ అధిపతి మరొక అడుగు ముందుకు వేసి తాను మోడీ అభిమానిని అన్నాడు. ఎంతో పెద్ద మొత్తంలో నగదును బాంకుల్లో జమ చేశారని ఫోర్బ్స్ పత్రిక, ఎంతో తెలివైన పని అని పేర్కొన్న ఇద్దరు నిపుణుల మాటలను న్యూయార్క్ టైవ్‌‌సు పత్రిక ఉటంకించింది. విత్త నిపుణులు ఇదెంతో ధ్యైవంతం, దేశాన్ని మార్చి వేస్తుందని సెలవిచ్చారు. కొన్ని పత్రికలు భారత్‌లో 400 బిలియన్ డాలర్లమేర నల్లధనం ఉందని అదంతా వెలుపలికి వస్తుందని నమ్మబలికారు. ఆ వార్తలను తెలుసుకొని బహుశా నరేంద్రమోడీ కూడా నిజమే అని భ్రమించి ఉంటారు.

షాంఘై సహకార సంస్థ సమావేశాల్లో పుతిన్‌తో మాట్లాడుతూ నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలకు అమెరికా, ఇతర పశ్చిమ దేశాల మీడియా ప్రశంసలు కురిపించటంలో ఆశ్చ్యం లేదు. తమ శిబిరం లో ఉంటారనుకున్న మోడీ తటస్థంగా ఉంటారని పశ్చిమ దేశాలు ఊహించలేదు. ఆగ్రహించినా, రెచ్చగొట్టినా, బెదిరించినా, బ్రతిమాలినా ఇప్పటివరకు అదే వైఖరితో ఉన్నారు. నిజానికి పుతిన్‌తో నరేంద్రమోడీ మాట్లాడిన మాటలు శత్రుపూరితం కాదు, అలా మాట్లాడే స్థితిలో కూడా లేరు. అమెరికా శిబిరంలో చేరితే మనకు రష్యా నుంచి వస్తున్న చౌక చమురు వెంటనే ఆగిపోతుంది. అంబానీకి లాభం తగ్గుతుంది. మన మిలిటరీకి అవసరమైన సాయుధ సంపత్తి, విడిభాగాలు, ఎస్400 వంటి కీలక రక్షణ వ్యవస్థలు నిలిచిపోతాయి. ఇప్పుడున్న వాటిని పూర్తిగా పక్కన పెట్టి అమెరికా అస్త్రాలతో మన మిలిటరీని నిర్వహించాలంటే మన జుట్టును దాని చేతికి అందించటమే కాదు, అంత సొమ్ము మన దగ్గర లేదు. అం దువలన ఒక పెద్దమనిషి కోరుకున్నట్లుగానే ఉన్నాయి.

ఆ మాత్రం కూడా ఇంతవరకు మోడీ నోట వెలువడనందున చూశారా ఇన్ని నెలల తరువాత పుతిన్ వైఖరిని నరేంద్రమోడీ కూడా తప్పు పట్టారు మనం చేస్తున్నది సరైనదే అని తమ జనాన్ని, తమ మద్దతుదార్లను సంతుష్టీకరించేందుకు అమెరికా చేసిన కసరత్తు అది. ఎవరు ఏమి చెప్పినా షాంఘై సహకార సంస్థలో ఉన్న మెజారిటీ దేశాలు అమెరికా బాధితులే. ఆ సంస్థలో చేరిన నరేంద్రమోడీ, చైనాను పక్కాగా వ్యతిరేకిస్తున్న చతుష్టయ(క్వాడ్) కూటమిలో చురుకుగా ఉన్నారు. అందువలన తటస్థ వైఖరితో రష్యాను మంచి చేసుకున్నట్లుగానే ఆగ్రహిస్తున్న అమెరికా, ఇతర పశ్చిమ దేశాల మిత్రులను సంతృప్తిపరచేందుకు కూడా మోడీ ఆ మాట చెప్పి ఉండవచ్చు కదా!

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News