సివిల్ సర్వీస్ అధికారులకు ప్రధాని హితవు
న్యూఢిల్లీ: నిర్ణయాలు తీసుకునే విషయంలో దేశం మొదటిదిగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ సివిల్ సర్వీస్ అధికారులకు సూచించారు. అంతేకాదు, దేశ సమైక్యత, సమగ్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, చివరికి స్థానిక స్థాయిలో తీసుకునే నిర్ణయాలు సైతం ఇదే గీటురాయి ఆధారంగా ఉండాలని ఆయన సూచించారు. ఇటీవలి కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో మత ఘర్షణలకు సంబంధించిన సంఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో గురువారం 15వ సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ప్రధాని సివిల్ అధికారులనుద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రతి నిర్ణయం కూడా దేశ సమైక్యత, సమగ్రతను బలోపేతం చేసేవిధంగా బేరీజు వేసుకోవాలని కూడా ఆయన అన్నారు. తన స్వభావం రాజనీతి కాదని, జననీతి అని కూడా ప్రధాని అన్నారు.
2047లో జరుపుకోబోయే స్వాతంత్య్ర దినోత్సవ శతాబ్ది వేడుకలకు ముందున్న 25 సంవత్సరాల కాలం అత్యంత కీలకమైనదని ప్రధాని అంటూ, ఈ వేడుకలు కేవలం రొటీన్‌గానో లేదా పొగడ్తల పర్వంగానో ఉండకూడదని కూడా తన 50 నిమిషాల ప్రసంగంలో ప్రధాని అన్నారు. దేశ ప్రజాస్వామిక వ్యవస్థలో మనం మూడు ప్రధాన అంశాలకు కట్టుబడి ఉండాలని, సామాన్య ప్రజల జీవితాల్లో మార్పు తేవడం, దాన్ని వారు ఫీల్ అయ్యేలా చూడడం, ప్రభుత్వంతో జరిపే వ్యవహారాల్లో, ప్రయోజనాలు, సేవలు పొందడంలో సామాన్యులు ఇబ్బంది పడకుండా ఉండడంఅనేవి ఈ మూడు అని మోడీ అన్నారు.ఈ సంకల్సం పూర్తి అయ్యేలా చూడడం మనందరి లక్షంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.