మనదని కాదు గానీ, ప్రజాస్వామ్య గొప్పదనం గురించి అనేక మంది ఎంతో అందంగా చెప్పారు. దీన్ని మేడిపండుతో పోల్చిన వారు కూడా ఉన్నారు. ఎవరి అనుభవం, భావం వారిది. అన్నింటినీ పరిగణనలోకి తీసుకుందాం. ప్రజాస్వామ్య పుట్టిల్లు బ్రిటన్ అని చెబుతారు గానీ నిజమైన ప్రజాస్వామ్యం మన దేశంలోనే ఉందని చెప్పేవారి గురించీ తెలిసిందే. బిబిసి ప్రసారం చేసిన ఒక డాక్యుమెంటరీలో పేర్కొన్న అంశాలు “ప్రేరేపిత ఆరోపణల పత్రం” అని 302 మంది ప్రముఖులు ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా శనివారం నాడు అందమైన, పొందికైన పదజాలంతో ఒక ప్రకటన చేశారు. దానిలో మాజీ జడ్జీల నుంచి మాజీ పౌర, ఇతర ప్రముఖులు, సగం మంది మాజీ సైనిక అధికారులు ఉన్నారు. ఆ చిత్రంలో పేర్కొన్న అంశాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, దాన్నసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మన విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందవ్‌ు బాగ్చీ చెప్పిన మాటలు ఇంకా గింగురు మంటుండగానే వీరు రంగంలోకి దిగారంటే డాక్యుమెంటరీ ఎంత సెగ పుట్టించిందో అర్ధం చేసుకోవచ్చు.
మన పెద్దలు ప్రజాస్వామ్య గొప్పదనంతో పాటు దానికి పొంచి ఉండే ముప్పును గురించి కూడా హెచ్చరించారు.
అదేమిటంటే సదరు చిత్రాన్ని ఎవరూ చూడకుండా తొలగించాలని యు ట్యూబును పంచుకోనివ్వకుండా చూడాలని ట్విటర్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన వార్త కూడా శనివారం నాడే జనాలకు తెలిసింది. సదరు బిబిసి డాక్యుమెంటరీలో చెప్పిన దాన్ని అంగీకరించటమా, తిరస్కరించటమా అన్నదాన్ని పక్కనపెడితే అసలు దానిలో ఏం చెప్పారు, ఏం చూపారు అన్న ఆసక్తిని ఈ రెండు పరిణామాలూ తెగ పెంచేశాయి. నిషేధం తీరు తెన్నులలోనూ, నరేంద్ర మోడీ ఏలుబడి గురించి చర్చ జరుగుతుంది. గీత దాటొద్దు అన్న మాటను సీత పాటించి ఉంటే అసలు రామాయణం, పాండవులు కోరినట్లుగా ఐదూళ్లిచ్చి ఉంటే మహాభారతమే ఉండేది కాదనట్లుగా చూడొద్దు అంటే చూడాలనే కిక్కే వేరు ! నిషేధించిన పుస్తకాలను, సినిమాలను మనం లేదా పూర్వీకులు చూడకుండా ఉన్నారా? దేశంలోకి రావద్దని నిషేధిస్తే రాకుండా ఉన్న దేశం ఏదైనా ఉందా? మన ప్రజాస్వామిక వ్యవస్థలో జనానికి అందుబాటులో లేకుండా చేసినప్పటికీ, ప్రపంచ మంతటినీ చూడకుండా ఆపలేరు కదా! నేను గాంధీని ఎందుకు చంపాను అన్న గాడ్సే ప్రకటనను పుస్తకాలుగా అచ్చు వేసి అనధికారికంగా పంచుతున్న వారికి ఇది తెలియదా!
గుజరాత్ మారణకాండకు సంబంధించి బిబిసి డాక్యుమెంటరీ బిబిసి సైట్‌లో తప్ప వాటిని షేర్ చేసే ఇతర వెబ్‌సైట్లలో మాత్రమే అది కనిపించదు. దానిపై ఉన్న 50 ట్వీట్లను తొలగించాలని ట్విటర్‌ను కోరింది. తొలగించినట్లు తృణమూల్ కాంగ్రెస్ నేత, ఎంపి డిరెక్ ఓ బ్రియన్ చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు తామాపని చేసినట్లు ట్విటర్ తనకు తెలిపిందని కూడా వెల్లడించారు. సమాచార సాంకేతిక నిబంధనలు 2021 ప్రకారం కేంద్రం తొలగించాలని కోరినందున తాము అనుసరించటం మినహా మరొక మార్గం లేదని ట్విటర్ చెప్పినట్లు కొందరు చెప్పారు. ఇప్పటికే ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకొని దాన్ని సామాజిక మాధ్యమం ద్వారా ఇతరులకు ఎవరికైనా పంపాలన్నా ఇక కుదరదు.
చూడాలని పట్టుదల ఉన్న వారికి వేరే పద్ధతుల్లో దొరుకుతుంది. “భారత తనయ” (ఇండియాస్ డాటర్) పేరుతో గతంలో ప్రసారం చేసిన నిర్భయ చిత్రాన్ని తొలగించాలని 2015లో కేంద్ర ప్రభుత్వం బిబిసికి నోటీసు పంపింది. ఆ మేరకు మన దేశంలో ప్రదర్శన నిలిపివేశారు. తాజా చిత్రంపై అలాంటి నోటీసు ఇచ్చిందీ లేనిదీ తెలియదు. నిర్భయ కేసులో ఉరిశిక్ష పడి జైల్లో ఉన్న నేరగాడు ముకేష్ సింగ్‌ను తగిన అనుమతి లేకుండా బిబిసి ఇంటర్వ్యూ చేసిందని, దాన్ని వాణిజ్యం కోసం ఉపయోగించటం, మహిళల గౌరవాన్ని భంగపరిచినందున ప్రదర్శించవద్దని కోరినా వినకుండా ప్రసారం చేయటంతో తొలగించాలని కేంద్రం కోరింది.
గతంలోనే బతకాలని భారత ముస్లిం లెవరూ కోరుకోవటం లేదని దాన్నుంచి ముందుకు పోవాలని కోరుకుంటున్నారంటూ బిబిసి చిత్రాన్ని ఉటంకిస్తూ అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ తారిఖ్ మన్సూర్ ఒక పత్రికలో రాశారు. దాన్ని తప్పు పట్టాల్సినపనిలేదు గానీ గతాన్ని విస్మరించాలన్న సందేశం ఇవ్వటం పెద్దలకు తగని పని.
గతాన్ని పునరుద్ధరించాలని, ఇస్లాం, ముస్లింలు మన దేశానికి రాకముందు ఉన్న పరిశుద్ధ హిందూత్వ దేశాన్ని పునరుద్ధరించాలని రోజూ ప్రచారం చేస్తుండటం, దానికి పోటీగా కోల్పోయిన తమ పూర్వ పాలనను పునరుద్ధరిస్తామని కొందరు ముస్లిం ఛాందసులు రంగంలోకి దిగటమే కదా విద్వేషాలకు మూలం. శ్వేతేతరులను ఉద్ధరించే బాధ్యత తమదంటూ వారికి వారే ప్రకటించుకున్న శ్వేత జాతీయుల మాదిరే ఇప్పుడు శ్వేత జాతి మీడియా గురించి ఆందోళన చెందాల్సి వస్తున్నదని తారిఖ్ మన్సూర్ చెప్పిందానితో అంగీకరించటానికి కూడా ఇబ్బంది లేదు. హిందూత్వ ఉద్ధారకులమంటూ ఊరేగుతున్నవారి గురించి కూడా పెద్దలు చెబితే బాగుండేది. ఇక బిబిసి డాక్యుమెంటరీ గురించి మోడీ దళాలు చెపుతున్నదానినే పునరుద్ఘాటన చేశారు గనుక వాటి గురించి చెప్పుకోనవసరం లేదు. సదరు అభిప్రాయాలతో అంగీకరించటమా లేదా అన్నది ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిందే.
తారిఖ్ మన్సూర్‌తో సహా అనేక మంది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా బిబిసి ఇలాంటి చిత్రాన్ని తీయటం ఏమిటి, అది సుప్రీంకోర్టుకు అతీతమా అని ప్రశ్నిస్తున్నారు. నిజమే వారికి ఆ హక్కు ఉంది. సుప్రీంకోర్టు గుజరాత్ ఉదంతాల మీద తీర్పు ఇచ్చిన మాట నిజం. ఆ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు ఈ రచయితతో సహా ఎవరూ దురుద్దేశాలను ఆపాదించటం లేదు. తమ ముందుకు వచ్చిన అంశాల ఆధారంగా కోర్టులు తీర్పులు ఇస్తాయి. అంతమాత్రాన వాటి మీద భిన్నాభిప్రాయం వెల్లడించకూడదని ఎక్కడా లేదు. అనేక హత్య కేసులలో నిందితులుగా పేర్కొన్న వారిని కోర్టులు నిర్దోషులని తీర్పు చెప్పాయి. అంత మాత్రాన హత్యలు జరగలేదని, ఎవరో ఒకరు ప్రాణాలు తీయలేదని చెబుతామా? సాక్ష్యాలను సమర్పించాల్సిన పోలీసులు నిందితులతో కుమ్మక్కు కావచ్చు, అసమర్ధంగా దర్యాప్తు చేసి ఉండవచ్చు, ప్రాసిక్యూటర్లు సమర్ధవంతంగా వాదించలేకపోవచ్చు.
కోర్టులు ఇచ్చిన తీర్పులనే తప్పుపట్టకూడదని వాదిస్తే జర్మనీలో హిట్లర్ ఆధ్వర్యంలో జరిగిన మారణకాండలను నాటి జర్మన్ కోర్టులు తప్పు పట్టలేదు. యూదులు, వారి ప్రభావం నుంచి జర్మన్ సమాజాన్ని ప్రక్షాళన చేయాలన్న జనాల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పిన జడ్జీల సంగతి తెలిసిందే. తరువాత అలాంటి వారితో సహా నేరాలకు పాల్పడిన వారిని న్యూరెంబర్గ్ కోర్టులో విచారణ జరిపి శిక్షించిన సంగతి తెలిసిందే.
తమ తీర్పును పరిగణనలోకి తీసుకోకుండా బిబిసి చిత్రాన్ని నిర్మించి తమను ధిక్కరించిందని సుప్రీంకోర్టు భావిస్తే ఆ మేరకు తనంతట తాను ముందుకు పోవచ్చు. గుజరాత్ ఉదంతాల తరువాత కూడా జనం నరేంద్ర మోడీని ఎన్నుకున్నారని, దాన్ని బిబిసి గమనంలోకి తీసుకోవద్దా అని చెబుతున్నారు. ఇదెక్కడి వాదన? 1975లో అత్యవసర పరిస్థితి ప్రకటించి పౌర హక్కులను పక్కన పెట్టిన ఇందిరా గాంధీని తరువాత జరిగిన ఎన్నికల్లో ఓడించిన జనం తిరిగి ఆమెకు పట్టం కట్టారు. అంతమాత్రాన ఎమర్జన్సీని అంగీకరించినట్లా? జర్మనీ, ఇటలీ, తదితర అనేక దేశాల్లో నియంతలనే జనం పదే పదే ఎన్నుకున్నారు అని చెబితే మా నరేంద్ర మోడీని నియంత అంటారా అని ఎవరైనా అడగవచ్చు. మోడీ విధానాలను చూసి ఇదే ప్రజాస్వామ్యం అని అనేక మంది పొగుడుతున్నట్లుగానే వాటిలో నియంతృత్వ పోకడలు ఉన్నట్లు అనేక మంది విమర్శిస్తున్నారు తప్ప నియంత అనలేదు.
భారత్‌లో తమ డాక్యుమెంటరీని ప్రదర్శించాలని ప్రస్తుతం తాము అనుకోవటం లేదని, దాన్ని తీసింది తమ దేశం వారి కోసమని బిబిసి పేర్కొన్నది. దీని నిర్మాణంలో భారత్‌లో ఉన్న సిబ్బంది ఎవరూ భాగస్వాములు కాలేదని కూడా చెప్పింది. రెండవ భాగాన్ని బ్రిటన్‌లోని బిబిసి ఛానల్2 లో జనవరి 24న ప్రసారం చేస్తామని వెల్లడించింది.
ప్రపంచంలో ముఖ్యమైన పరిణామాలన్నింటినీ చూపేందుకు కట్టుబడి ఉన్నామని, భారత్‌లో మెజారిటీ హిందూ, ముస్లిం మైనారిటీల మధ్య ఉన్న ఉద్రిక్తతలు, వాటి మీద భారత ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయాలకు సంబంధించిన అంశాల గురించి భారత్‌లోనూ, ప్రపంచంలోనూ ఉన్న ఆసక్తి కారణంగా వాటి మీద నివేదించేందుకు నిర్మించినట్లు బిబిసి చెప్పింది.
డాక్యుమెంటరీని అడ్డుకోవటం పిరికి చర్య అని కాంగ్రెస్ పేర్కొన్నది. దీన్లో పేర్కొన్న అంశాలు నిజం గాకపోతే మోడీ రాజీనామా చేయాలని వత్తిడి తెచ్చినట్లు, రాజధర్మం పాటించాలని హితవు చెప్పినట్లు అప్పుడే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బ్రిటన్లో అంతర్గతంగా స్పందన కలిగించింది. బ్రిటన్‌లోని భారత మితవాద స్నేహితుల సంస్థ ( కన్సర్వేటివ్ ఫ్రండ్స్ ఆఫ్ ఇండియా ) మాజీ సహ అధ్యక్షుడు, ప్రభువుల సభ (పార్లమెంటు ఎగువ సభ) సభ్యుడు రామీ రాంగర్ బిబిసి అధిపతి టివ్‌ు డేవీకి ఒక నిరసన లేఖ రాశాడు. ఈ చెత్త వెనుక పాకిస్తానీ మూలాలున్న మీ సిబ్బంది ఉన్నదీ లేనిదీ స్పష్టం చేయాలని కోరాడు.
ఎవరిని సంతుష్టీకరించేందుకు ఇలాంటి లేఖలు అన్నది ప్రశ్న. బ్రిటీష్ హిందువులు ముస్లింల మధ్య ఈ చిత్రం మానిన గాయాలను రేపిందని, తానెంతో దిగులుపడ్డానని దానిలో పేర్కొన్నాడు. గుజరాత్ మారణకాండలో అత్యాచారానికి గురై, హత్యాకాండలో బంధువులను కోల్పోయిన బిల్కిస్ బానో కేసులు జైలు శిక్ష అనుభవిస్తున్న నేరగాండ్లు సంస్కార వంతులైన బ్రాహ్మలు అని కితాబిచ్చి శిక్షను పూర్తిగా అమలు జరపకుండా గుజరాత్ ప్రభుత్వం విడిచిపెట్టిన ఉదంతం, దాన్ని సుప్రీంకోర్టు సమర్ధించిన తీరు కొత్త భయాలను ముందుకు తెచ్చిన అంశం ఆ పెద్ద మనిషి దృష్టికి రాలేదా లేక నిద్ర నటిస్తున్నాడా?
ఎం కోటేశ్వరరావు
8331013288