Friday, January 3, 2025

కుటుంబ పార్టీలు దోచుకోవడానికి ఏమైనా లైసెన్స్ ఉందా?: మోడీ

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిరంతరం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. సంగారెడ్డిలో జరిగిన బిజెపి విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. నిన్న ఆదిలాబాద్ నుంచి రూ.56 వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించామని, ఇవాళ సంగారెడ్డి నుంచి రూ.7 వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించామని తెలియజేశారు. రాష్ట్రాల అభివృద్ధే దేశ అభివృద్ధిగా తాను నమ్ముతున్నానని, బేగంపేటలో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు చేశామని, దేశంలోనే తొలి సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ కేందం ఇది అని, దీని ద్వారా హైదరాబాద్, తెలంగాణకు మంచి గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు. ఏవియేషన్ కేంద్రం, స్టార్టప్‌లు, నైపుణ్య శిక్షణకు వేదికగా హైదరాబాద్ నిలుస్తుందని ప్రశంసించారు. పదేళ్లలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపుగా మారాయని, ప్రస్తుతం భారత్ ప్రపంచానికి ఆశాకిరణంలా మారిందని, భారత్‌ను ప్రపంచంలో సరికొత్త శిఖరాలకు చేర్చాలని పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాల్లో తెలుగు ప్రజలు కీలకభూమిక పోషిస్తున్నారని మోడీ ప్రశంసించారు.

ప్రజల ఆశీర్వాదాలు వృథా కానివ్వను అని, ఇది మోడీ గ్యారంటీ అని, మోడీ ఏదైతే చెబుతాడో అదే చేసి చూపుతాడని స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఆర్టికల్ 370 రద్దు హామీ అమలు చేశామని, అయోధ్య రామ మందిరం నిర్మించి తీరామని,  ప్రపంచ గర్వించే రీతిలో అయోధ్యలో రాముడి ప్రతిష్టాపన జరిగిందని కొనియాడారు. అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంగా తీర్చిదిద్దడమే మరో గ్యారంటీ అని అన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కుటుంబ పార్టీలు పాలించడంతో వాళ్లే బాగుపడ్డారని విమర్శలు గుప్పించారు. కుటుంబ పార్టీలు దేశాన్ని దోచుకోవడానికి ఏమైనా లైసెన్స్ ఉందా? అని మోడీ ప్రశ్నించారు. వారసత్వ రాజకీయాలను తాము వ్యతిరేకిస్తున్నామని, కుటుంబ పార్టీల వల్ల ప్రతిభ ఉన్నవారికి అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిని బయటపెడుతున్నాననే అక్కసుతో కాంగ్రెస్ తమపై విమర్శలు చేస్తుందని, కుటుంబ పాలన సాగించే వారిలో అభద్రతా భావం ఎక్కువగా కనిపిస్తుందని ధ్వజమెత్తారు. కుటుంబ రాజకీయాలతో యువతకు అవకాశాలు దొరకడంలేదని విమర్శలు గుప్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News