న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ షోల్జ్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సహా పలు దేశాల నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. జి20 సదస్సు నేపథ్యంలో ఆయన దక్షిణ కొరియా ప్రెసిడెంట్ యూన్ సుక్ యోల్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యాబ్ ఎర్డోగన్, ఆఫ్రికా యూనియన్ అధ్యక్షుడు అజాలి అసౌమానితో కూడా చర్చలు జరిపారు. షోల్జ్‌తో భేటీ అనంతరం ప్రధాని తన అభిప్రాయాలతో జి20 సదస్సును సుసంపన్నం చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.
అంతేకాకుండా స్వచ్ఛ ఇంధనం, ఇన్నోవేషన్, మెరుగైన భూగోళం కోసం భారత్, జర్మనీలు ఎలా కృషి చేయగలవనే దానిపైనా తాము చర్చించినట్లు మోడీ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల మధ్య కొత్త అనుబంధం కోసం సదస్సులో నేతలు విజయవంతంగా కృషి చేశారని షోల్జ్ పేర్కొన్నారు. కాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌తో జరిగిన విందు సమావేశం గురించి ప్రధాని ప్రస్తావిస్తూ తాము అనేక అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ‘అధ్యక్షుడు మేక్రాన్ తో చాలా ఫలవంతమైన విందు సమావేశం జరిగిం ది. మేము అనేక అంశాలను చర్చించడంతో పాటు భారత్‌ఫ్రాన్స్ సంబంధాలు పురోగతిలో కొత్త ఎత్తులకు చేరుకునేలా చూడాలని నిర్ణయించాం’ అని మోడీ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. అసౌమానితో జరిగిన సమావేశం గురించి ప్రస్తావిస్తూ తాము ఎంతో ఫలప్రదమైన చర్చ జరిపామని పేర్కొన్నారు. కాగా, కెనడా ప్రధాని ట్రూడోతో జరిగిన సమావేశంలో భారత్ కెనడా సంబంధాలకు సంబంధించి పూర్తిస్థాయిలో చర్చలు జరిపినట్లు ప్రధాని తెలిపారు.
కాగా కెనడాలో ఖలిస్థానీ నిరసనలపై తాము చర్చించుకున్నట్లు అనంతరం సమావేశం అనంతరం విలేఖరులతో మాట్లాడిన ట్రూడో చెప్పారు. ‘కెనడా ఎప్పుడూ భావ వ్యక్తీకరణ, స్వేచ్ఛాయుత నిరసన స్వేచ్ఛ హక్కులను కాపాడుతుంది. ఇది మాకు చాలా ముఖ్యం. అదే సమయంలో హింసను నిరోధించడానికి, విద్వేషానికి వ్యతిరేకంగా చర్యలూ తీసుకుంటుంది’ అని చెప్పారు. కాగా భారత్, రష్యా మధ్య వాణిజ్య, మౌలిక సదుపాయాల సంబంధాలను ఎలా పటిష్ఠం చేయలనే దానిపై తాను, ఎర్డోగన్ చర్చించినట్లు మరో పోస్టులో ప్రధాని మోడీ తెలిపారు. కాగా భారత్ తమకు గొప్ప వాణిజ్య భాగస్వామి అని, ఇరు దేశాల మధ్య సహకారానికి ఉన్న అవకాశాలను మరింతగా సద్వినియోగం చేసుకుంటామని ఎర్డోగన్ చెప్పారు.