న్యూఢిల్లీ: అమెరికా పర్యటనలో ప్రధాని మోడీకి అమెరికా ప్రభుత్వం అప్పగించిన భారతీయ కళాఖండాలు, ప్రాచీన వస్తువులు మొత్తం 157 స్వదేశానికి తిరిగి రానున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. వీటిలో సగం 71 సాంస్కృతిక కళాఖండాలు కాగా, మిగతా సగం హిందూమతానికి సంబంధించిన చిత్రాలు 60, బౌద్ధమతానికి చెందిన 16, జైను మతానికి చెందినవి 9 ఉన్నాయని శనివారం అధికారిక ప్రకటన పేర్కొంది. ఈమేరకు కళాఖండాలను అమెరికా తిరిగి అప్పగించడంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ఇవి చాలావరకు 11 నుంచి 14 వ శతాబ్దాలకు చెందినవే . క్రీస్తు పూర్వం 2 వేల సంవత్సరాల నాటివి, క్రీస్తుశకం రెండో శతాబ్దం నాటి టెర్రకోట శిల్పాలు, కూడా ఉన్నాయి. కంచు ప్రతిమల్లో లక్ష్మీ నారాయణ, బుద్ధ, విష్ణు, శివ, పార్వతి 24 జైన తీర్ధాంకరుల ప్రతిమలు ఉన్నాయి. 1976 నుంచి 2013 వరకు వివిధ దేశాల నుంచి 13 కళా ఖండాలు మాత్రమే స్వదేశానికి చేరుకోగా, మోడీ అధికారం లోకి వచ్చిన తరువాత 2014 నుంచి 2021 మద్యకాలంలో 200 ప్రాచీన కళాఖండాలు స్వదేశానికి తిరిగి వచ్చాయని అధికారిక ప్రకటన వివరించింది.