Saturday, December 21, 2024

నై కిసాన్

- Advertisement -
- Advertisement -

covid 19 second wave in india

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం నాడు ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్ మీద జాతీయ స్థాయి రైతు ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలు గమనించదగినవి. ప్రధాని మోడీ ఎంతో మక్కువతో పార్లమెంటులో తమ పార్టీకున్న మెజారిటీ చేత ఆమోదింప జేయించుకొన్న మూడు కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు సాటిలేని ఉక్కు సంకల్పంతో ఆందోళన జరిపి ఆయనలో ఓటమి భయం గూడుకట్టుకొనేలా చేసిన ఉద్యమం ఘనత తెలిసిందే. ఆ విధంగా ప్రధాని మెడ మీద కత్తిపెట్టి వాటిని రద్దు చేయించుకొన్న తమ మీద కక్షతోనే ఈ బడ్జెట్‌లో వ్యవసాయానికి కేటాయింపులలో భారీ కోతలు పెట్టారని రైతు ఉద్యమ ప్రధాన, ప్రముఖ నాయకులు భావిస్తున్నారంటే దానిని తేలికగా కొట్టిపారేయలేము. మూడు కొత్త వ్యవసాయ చట్టాల అంతు చూసిన రైతులపై కేంద్ర ప్రభుత్వం పగ తీర్చుకొన్నదని ‘స్వరాజ్ ఇండియా’ అధ్యక్షులు యోగేంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు ప్రతి బడ్జెట్ లో రైతులకు కేటాయింపులు లేకపోయినా వారి గురించి బ్రహ్మాండమైన ప్రస్తావనలుండేవని ఈసారి అవి ఏమీ లేవని ఆయన అన్నారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రధాని మోడీ రైతులపై అత్యంత అసంతృప్తిని పెంచుకొన్నారని, పూర్వపు బడ్జెట్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంపైన, వారిని మెచ్చుకొంటూ పెద్ద పెద్ద పద్యాలుండేవన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని 2016లో చేసిన వాగ్దానం ప్రస్తావన గాని, ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన వంటి పథకాలపై అభిప్రాయ ప్రకటన గాని బడ్జెట్‌లో లేకపోడాన్ని యోగేంద్ర పేర్కొన్నారు.

2022-23 కేంద్ర బడ్జెట్‌లో రైతులకు కేటాయింపులు గాని, వారికి సంబంధించిన ప్రకటన గాని, వారితో చర్చల ఊసుగాని లేవన్నారు. ఉత్తరప్రదేశ్‌లో భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు, ఢిల్లీ సరిహద్దుల్లో సాగిన చరిత్రాత్మక రైతు ఉద్యమ సారథుల్లో ఒకరు రాకేష్ టికాయత్ కూడా బడ్జెట్ తీరుపై విరుచుకుపడ్డారు. సీతారామన్ తాజా బడ్జెట్‌లో అత్యధిక గ్రామీణ జనాభాకు ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలకు కేటాయింపులను అతి తక్కువగా 2% పెంచారు. కాని 2021-22 బడ్జెట్‌తో పోల్చుకుంటే ఈసారి మొత్తం బడ్జెట్‌లో వ్యవసాయానికి కేటాయింపులు 4.26 శాతం నుంచి 3.84 శాతానికి పడిపోయింది. వరి, గోధుమ సేకరణకు అధిక నిధులు కేటాయించినప్పటికీ మిగతా పంటల సేకరణకు ఎటువంటి కేటాయింపు లేదు. అలాగే రైతులకు పిఎం కిసాన్ చెల్లింపుల మొత్తాన్ని పెంచలేదు. పిఎం ఆశా పథకం చెల్లింపులకు కేటాయింపును రూ. 400 నుంచి రూ. 1 కోటికి తెగ్గోశారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పంపిణీలను కూడా తగ్గించేసినట్టు రైతులు భావిస్తున్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్‌లను ప్రవేశపెట్టడమనే యోచన ఏ విధంగా రైతులకు ఉపయోగ పడుతుందనేది కీలక ప్రశ్న.

అందులోనూ అత్యధికంగా పేద మధ్య తరగతి రైతులే ఉన్న దేశంలో డ్రోన్లను ఉపయోగించి ఎరువులు, పురుగు మందులు చల్లుకొనే వారెందరుంటారు? అంతేకాదు, వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం గ్రామీణ భారతంలో చెప్పనలవికాని విషాదాన్ని కుమ్మరిస్తుంది. పంటలమీద ఎరువులు, పురుగు మందులు ఇతర రసాయనాలు చల్లే పిచికారీ పనికి ఇప్పుడు వ్యవసాయ కార్మికులను వినియోగిస్తున్నారు. డ్రోన్‌ల ప్రవేశంతో వారి ఉపాధి తీవ్రంగా దెబ్బ తింటుంది. జై జవాన్, జై కిసాన్ అన్నది మన చిరకాల నినాదం. దేశ రక్షణకు సైనికులు ఎంత ముఖ్యమో, ప్రజల తిండికి, దేశ ఆహార భద్రతకు రైతు అంతటి అత్యవసరమనే దృష్టితో మాజీ ప్రధాని కీ.శే. లాల్ బహదూర్ శాస్త్రి ఈ నినాదాన్ని ఇచ్చారు. జాతి నిత్యం దీనిని స్మరిస్తూనే ఉంటుంది. కాని జై కిసాన్ నినాదం స్థానంలో మోడీ ప్రభుత్వం జై కార్పొరేట్ రంగం, జై అదానీ, జై అంబానీ అనే నినాదాలను ప్రవేశపెట్టింది. కేవలం ఆ మూడు కొత్త వ్యవసాయ చట్టాల సందర్భంలోనే కాకుండా, మోడీ ప్రభుత్వం శాసన రూపం ఇవ్వదలచుకొన్న నూతన విద్యుత్ బిల్లులో కూడా రైతును బలహీనపరచి ఆ స్థానంలో కార్పొరేట్ శక్తులను విశేషంగా బలిపించే కుట్ర బహిర్గతమైంది.

మార్కెటింగ్ వ్యవస్థ, మద్దతు ధరల విధానం వంటి వ్యవసాయ రంగంలోని రైతు రక్షణలన్నిటికీ స్వస్తి చెప్పి, ఆ రంగాన్ని కార్పొరేట్ పారిశ్రామిక యజమానుల గుప్పెట్లో పెట్టాలన్న దుష్ట సంకల్పాన్ని ప్రధాని మోడీ ప్రభుత్వం విడనాడుకోలేదని తాజా కేంద్ర బడ్జెట్‌లో సాగు రంగంపైన, వ్యవసాయదారులపైన ఆది చూపిన కక్షపూరిత వైఖరి స్పష్టం చేస్తున్నది. ఇది రైతు లోకం పట్టుదలను, ఆగ్రహాన్ని మరింత పెంచి కేంద్రంపై వారి నిరసనను పదునుదేలిస్తుంది. దేశంలోని బిజెపియేతర రాజకీయ పక్షాలన్నీ రైతు ఉద్యమాన్ని సమర్ధించిన తీరు కళ్లారా చూశాము. మెజారిటీ ప్రజల చేత మతోన్మాద భంగు తాగించి, పరమత ద్వేష విషం నింపి వారి ఓటును కాజేసి ప్రజావ్యతిరేక కార్పొరేట్ అనుకూల అజెండాను అమలు పరవచ్చుననే ధీమా యెల్లకాలం పని చేయదని బిజెపి పాలకులు గుర్తించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News