Saturday, November 23, 2024

జన వికాసానికి సున్నా

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: నిర్మలా సీతారామన్ ఎన్నికల బడ్జెట్ ఎప్పటి మాదిరిగానే జనాభాలో అత్యధిక శాతంగా వున్న అతి పరిమిత ఆదాయాల సాధారణ ప్రజల వికాసానికి కేటాయింపులు అంతంత మాత్రంగానే వున్నాయి. వారి ఆరోగ్య, విద్య వికాసాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. కొన్ని కీలక పథకాలకు గతం కంటే నిధులను తగ్గించివేశారు. అదే సమయంలో కార్పొరేట్ రంగాన్ని సంతృప్తి పరడానికి పాటుపడ్డారు. ఆరోగ్య రంగానికి నిధుల కేటాయింపును కేవలం 12 % పెంచారు. గత ఏడాది బడ్జెట్‌లో ఈ పెంపు 16 శాతం. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అమలయ్యే జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమానికి ఈ బడ్జెట్‌లో కేటాయించిన రూ. 29,085 కోట్లు గత ఏడాది కేటాయించిన రూ. 28,974 కోట్ల కంటే స్వల్ప మాత్రమే ఎక్కువ. దాదాపు 50 కోట్ల మందికి ఉచితంగా (ఒక్కొక్కరికి రూ. 5 లక్షల మేరకు) ఆసుపత్రి సేవలందించడానికి ఉద్దేశించిన ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన పథకానికి గత ఏడాది బడ్జెట్‌లో రూ. 6,412 కోట్లు కేటాయించగా, దానిని స్వల్పంగా పెంచి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ. 7,200 కోట్లకు పరిమితం చేశారు. అలాగే విద్యా రంగానికి కేటాయింపును కేవలం 8% మాత్రమే పెంచారు.

ఈ రంగంలో కీలకమైన సర్వశిక్షా అభియాన్ కార్యక్రమానికి గత ఏడాది కేటాయించింది రూ. 37,383 కోట్లు కాగా, ఈ ఏడాది రూ. 30 కోట్లు మాత్రమే అదనంగా విదిలించారు. వ్యవసాయ రంగం పరిస్థితి ఈ బడ్జెట్‌లో మరింత దారుణంగా వుంది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రగల్భాలు పలికిన ప్రధాని మోడీ ప్రభుత్వం అందులో ఘోరంగా విఫలమైంది. ఈ రంగం వృద్ధిలో తాబేలును తలపిస్తున్నప్పటికీ దానికి ఇవ్వవలసినంత మద్దతును ఇవ్వకుండా ఎండబెట్టడంలో తనకు సాటిలేరని ప్రధాని మోడీ ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో చాటుకున్నది. ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి రైతును బాధిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఈ ధరలు 200% పెరిగాయి. పర్యవసానంగా దేశంలో ఎరువులు, క్రిమిసంహారక మందులు వంటి వ్యవసాయ పరికరాల ధరలు మిన్నంటాయి. ఆహార ధరలు కూడా మండుతున్నాయి.

ఒకవైపు రైతును ఇంకొక వైపు వినియోగదార్లను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై వుంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆహారం, ఎరువులకు సబ్సిడీలను విశేషంగా పెంచవలసి వుండగా రెండింటి పైనా ఈ బడ్జెట్‌లో వేటు వేశారు. ఆహార సబ్సిడీ గత ఏడాది బడ్జెట్‌లో రూ. 2.87 లక్షల కోట్లు కాగా, ఈ బడ్జెట్‌లో అది రూ. 1.97 లక్షల కోట్లకు తగ్గిపోయింది. అలాగే ఎరువుల సబ్సిడీలు రూ. 2.25 లక్షల కోట్ల నుంచి రూ. 1.75 లక్షల కోట్లకు పతనమై భారీ కోతకు గురయ్యాయి. ఎరువుల సబ్సిడీలు ఘోరంగా తగ్గిపోడం వల్ల వ్యవసాయం మరింత ఖరీదైనది అయిపోతుంది. చిన్న, సన్నకారు రైతులు అత్యధిక శాతంగా వున్న మన దేశంలో ఇది వ్యవసాయదారులపై పిడుగుపాటు వంటి పరిణామమే. ఎరువులు, సాగు రసాయనాల ధరలు పెరిగినప్పుడు మద్దతు ధరలను కూడా పెంచితే రైతుకి కొంత ఊరట కలుగుతుంది. కాని మన దేశంలో మద్దతు ధరలు రైతుకు గిట్టుబాటుగా వుండడం లేదు.

ఈ విషయం రైతు ఆత్మహత్యల అద్దంలో స్పష్టంగా చూడవచ్చు. బ్యాంకుల నుంచి చిన్న రైతులకు రుణాలు తగినంతగా అందకపోడం, రైతుబంధు వంటి పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నగదు సాయాన్ని వారి అప్పుల కింద బ్యాంకులు జమ చేసుకోడం జరుగుతోంది. దీని వల్ల రైతులు ప్రైవేటు రుణగ్రస్థులవుతున్నారు. 2020లో కొవిడ్ నేపథ్యంలో ప్రారంభించిన ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద పేదలకు ఇస్తూ వచ్చిన 5 కిలోల ఉచిత ఆహార ధాన్యాల పథకానికి స్వస్తి చెప్పి వారి నోటి వద్ద కూడును హరించారు. ఇలా అన్ని రకాలుగా కేంద్రం పని కట్టుకొని అణచివేస్తున్న ఆ పేదలే దేశ వస్తు, సేవల పన్ను ఆదాయంలో 60% పైగా సమకూరుస్తున్నారని ఆక్స్‌ఫామ్ నివేదిక చాటింది. 2014లో అధికారంలోకి రాక ముందు ఎన్నికల ప్రచార సభల్లో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మాటను ప్రధాని మోడీ మరచిపోయారు. కార్పొరేట్లకు కస్టమ్స్ డ్యూటీని ఈ బడ్జెట్‌లో భారీగా తగ్గించారు. అదానీ గ్రూపు ఉత్పత్తి చేస్తున్న లిథియం బ్యాటరీలు వంటి వాటికి రాయితీలు కల్పించారు. దేశీయ ఉత్పత్తుల ఎగుమతులు పెరగడం లేదు గనుక వాటికి దేశీయ మార్కెట్‌లో గిరాకీ పెంచడం కోసం మూలధనం వ్యయం కింద రూ. 10 లక్షల కోట్లు కేటాయించారు. మౌలిక సదుపాయాల కల్పన కింద పెట్టే ఈ వ్యయం పేదలకు కలిగించే మేలు కంటే కార్పొరేట్ కాంట్రాక్టు కంపెనీలకే అధికంగా డబ్బు చేస్తుంది. రైల్వేకు భారీగా రూ. 2 లక్షల కోట్లకుపైగా కేటాయించిన నిధులు కూడా ఆ రంగాన్ని స్వాధీనం చేసుకొంటున్న ప్రైవేటు పెట్టుబడికే పెద్ద పీట వేస్తాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News