Monday, December 23, 2024

దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం కెసిఆర్‌ది: మోడీ ఆరోపణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలోనే అత్యంత అవినీతి పాలనగా తెలంగాణలో బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఆయన అభివర్ణించారు. శనివారం వరంగల్‌లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అంనతరం ప్రధాని మోడీ ప్రసంగిస్తూ కెసిఆర్ ప్రభుత్వం అత్యంత అవినీతిమయ ప్రభుత్వాన్ని, దీని అవినీతి ఢిల్లీ దాకా కూడా విస్తరించిందని ఆరోపించారు. ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణాన్ని ప్రధాని ప్రస్తావిస్తూ గతంలో రాష్ట్రాల మధ్య అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరేవని, కాని ఇప్పుడు ఈ రెండు ప్రభుత్వాలు కలసికట్టుగా అవినీతికి పాల్పడ్డాయని మోడీ ఆరోపించారు.

ఈ ఏడాది చివరిలో రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో భారీ పెట్టుబడులు సమకూర్చిందని ప్రధాని చెప్పారు. అయితే బిఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం మోడీని, కేంద్రాన్ని తిట్టడం, వారసత్వ పాలనను సుస్థిరం చేసుకోవడం, తెలంగాణ ఆర్థికాభివృద్ధిని నాశనం చేయడం, అవినీతిలో రాష్ట్రాన్ని ముంచెత్తడం మాత్రమే చేసిందని ఆయన ఆరోపించారు.

బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలను పక్కన పెట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాభీష్టాలకు విరుద్ధంగా పనిచేసిన చరిత్ర ఈ రెండు పార్టీలకు ఉందని ఆయన అన్నారు. వారసత్వ పార్టీల మూలాలు అవినీతిలోనే ఉన్నాయని, వారసత్వ కాంగ్రెస్ పార్టీఅవినీతిని యావద్దేశం చూసిందని, ఇప్పుడు ఇఆర్‌ఎస్ అవినీతిని యావత్ తెలంగాణ చూస్తోందని ఆయన ఆరోపించారు. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ తెలంగాణ ప్రజలకు ప్రమాదకర పార్టీలని ఆయన హెచ్చరించారు.

టిఎస్పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసును ప్రస్తావిస్తూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం తెలంగాణలోని నిరుద్యోగ యువత ఆశగా ఎదురుచూస్తుంటే తమ నాయకుల జేబులను నింపడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలను వాడుకుంటోందని మోడీ ఆరోపించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News