వాటిని కూకటి వేళ్లతో పెకలించాలి
యువతకు ప్రధాని మోడీ పిలుపు
న్యూఢిల్లీ: వారసత్వ రాజకీయాలే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువని, వీటిని పూర్తిగా పెకలించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. మంగళవారం జాతీయ యువ పార్లమెంటు ముగింపు సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ, యువత రాజకీయాల్లోకి రానంత వరకు వారసత్వ రాజకీయాలు కొనసాగుతాయని అభిప్రాయపడ్డారు. అయితే ఇంటిపేరుతో ఎన్నికల్లో గెలుస్తున్న వారి భవిష్యత్తు మాత్రం క్రమంగా తగ్గుముఖం పడుతోందన్నారు.‘ ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువైన కుటుంబ రాజకీయాల వ్యవస్థ ఇంకా కొనసాగుతోంది. ఇలాంటి వారికి దేశమే తొలి ప్రాధాన్యం కాదు. కేవలం తమ కుటుంబాలను రక్షించుకోవడం కోసమే ఇలాంటి వారు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. దేశం ముందున్న అతి పెద్ద సవాళ్లలో ఈ రుగ్మత ఒకటి. వీటికి చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది’ అని ప్రధాని అన్నారు.
అందుకే సామాన్య యువకులు కూడా పార్లమెంటులో అడుగుపెట్టాలని యువతకు సూచించారు. కేవలం నిజాయితీతో రాజకీయాల్లో అడుగుపెట్టిన వారు మాత్రమే ప్రజల సంక్షేమం కోసం పాటుపడతారని, అలాంటి వారు మాత్రమే రాజకీయాల్లో కొనసాగుతారని మోడీ అభిప్రాయపడ్డారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలనుంచి యువత పాఠాలు నేర్చుకోవాలని, అదే సమయంలో శారీరక, మానసిక దృఢత్వం అవసరమని వివేకానందుడు చెప్పిన మాటలను ప్రధాని గుర్తు చేశారు. వివేకానందుడు చూపిన మార్గం మన ముందుందన్న మోడీ.. యువతకు ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నామని వెల్లడించారు.