Tuesday, November 5, 2024

ఉపాధి హామీ రద్దుకు కేంద్రం కుట్ర

- Advertisement -
- Advertisement -

కేంద్ర వైఖరికి నిరసనగా జాతీయ స్థాయిలో రాష్ట్రాల సమిష్టి పోరాటం
బడ్జెట్‌లో ఉపాధి హామీకి 75 వేల కోట్ల కోత
తెలంగాణకు ఇప్పటికే రూ.800 కోట్ల మేర నష్టం
కూలీల పనిముట్లకు కోతలే
ఇక ఉపాధి హామీలో కేవలం 20 పనులే
వ్యవసాయానికి అనుసంధానం అడిగినా స్పందన లేదు
తెలంగాణ, కేరళ రాష్ట్రాల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎం బి రాజేష్

మనతెలంగాణ/ హైదరాబాద్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, కేరళ గ్రామీణాభివృద్ధి మంత్రి ఎంబి రాజేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధిహామీ పథకంపై కేంద్ర వైఖరికి నిరసనగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ‘ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు – సవాళ్లు ’అనే అంశం పై హైదరాబాద్ రవీంద్రభారతిలో మంగళవారం సెమినార్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ కొంతకాలంగా కేంద్రం ఉపాధి హామీ పథకంలో కఠిన నిబంధనలు విధిస్తూ ఈజిఎస్ అమలులో దేశంలోనే ముందు వరుసలో ఉన్న తెలంగాణ, కేరళ రాష్ట్రాలపై కక్షపూరితంగా ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఆరోపించారు. ఈజిఎస్ అమలులో ఇప్పటి వరకు దేశంలోనే తెలంగాణ, కేరళ రాష్ట్రాలు ప్రథమస్థానంలో ఉన్నాయని, కక్షపూరితంగా ఈ రాష్ట్రాలను కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఆరోపించారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై కక్ష కట్టి ఆరు నెలలుగా ఉపాధి హామీ పథకాన్ని ఆ రాష్ట్రంలో నిలిపివేశారని, బిజెపి అధికారంలో లేని రాష్ట్రాలు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, పంజాబ్ లో ఇప్పటికే పర్యవేక్షణ బృందాల పేరిట వేధింపులు మొదలు పెట్టిందని దుయ్యబట్టారు.

పూడిక తీత ఎక్కువ తీయొద్దని..

తెలంగాణలో 2014 నుంచి 2018 వరకు కేవలం మూడు బృందాలను పంపిస్తే, ఈ ఏడాది 18 బృందాలను పంపించి లేని తప్పులను ఎత్తి చూపి, పేదల నోట్లో మట్టి కొట్టాలని చూస్తుందని మంత్రి దయాకర్‌రావు ఆరోపించారు. ఈజిఎస్ ద్వారా రాష్ట్రాలు ప్రజలకు ఉపయోగ పడే పనులు చేస్తుంటే అభ్యంతరాలు వ్యక్తం చేయాడం శోచనీయమని వెల్లడించారు. ఉపాధి హామీ పథకం (పూడిక తీత) మొదలైనప్పటి నుంచి చెరువుల్లో కేవలం పూడిక తీత తీస్తున్నారు. కానీ, ఇన్నేండ్ల తర్వాత పూడిక తీత ఎక్కువ తీయొద్దని చెబుతున్నారు. హరితహారంలో మొక్కలు నాటి కంచె ఏర్పాటు చేయడంలో మల్టీ లేయర్లలో మొక్కలు పెడితే, ఎందుకు పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్రంలో రైతు కల్లాలు కడితే, అది అనుమతి లేని పని అంటున్నారు కానీ, తీర ప్రాంత రాష్ట్రాల్లో చేపలు, రొయ్యలు ఎండ బెట్టుకోవడానికి అనుమతిస్తున్నారు. కాళేశ్వరం, నీటి పారుదల ప్రాజెక్టులత్లో పెద్ద ఎత్తున్న పంటలు పండిస్తున్నాం. ఆ పంటలను ఆరబెట్టుకోవడానికి రైతులకు కల్లాలు కడితే వద్దంటున్నారు. రైతు వేదికలు ఎందుకు కట్టారని అంటోందని ఆరోపించారు.తెలంగాణ వచ్చాక శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాం. సిసి రోడ్లు, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు, హరితహారం వంటి ఎన్నో ప్రజలకు ప్రయోజనకరమైన పనులు చేపట్టాం.

ఉపాధిలో 20 పనులకు మించి చేపడితే బ్లాక్‌లిస్టులో పెడుతోంది…

గ్రామాల్లో 20 పనులకు మించి ఎంపిక చేయవద్దంటోంది. అంతకంటే ఎక్కువ పనులు చేపడితే బ్లాక్ లిస్టులో పెడుతోందని మంత్రి దయాకర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో పేద కూలీలకు గడ్డపార, తట్ట మొదలైన పనిముట్లు ఇచ్చే వాళ్లం..ఈ సౌకర్యాలకు కేంద్రం కోత పెట్టింది.75వేల కోట్ల రూపాయలను కేంద్ర బడ్జెట్‌లో తగ్గించారు. దీంతో రాష్ట్రానికి 800 కోట్ల వరకు నష్టం ఏర్పడిందన్నారు. ఉపాధి పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయమంటే చేయడం లేదు. ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లిన స్పందన లేదు. ఉపాధి హామీపై కేంద్ర వైఖరికి నిరసనగా జాతీయ స్థాయిలో రాష్ట్రాల సమష్టి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. ఈ సదస్సులో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సిపిఎం జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వ్యవసాయ కార్మిక సంఘాల బాధ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, కార్మికులు, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News