Sunday, November 24, 2024

డ్రోన్ దాడులతో కేంద్రం అప్రమత్తం

- Advertisement -
- Advertisement -

Modi chairs high-level meet with Rajnath Singh, Ajit Doval

సైన్యానికి ఆధునిక సాంకేతికతను
శీఘ్రగతిన అందించడంపై సమాలోచనలు
భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే వ్యూహం
ప్రధాని అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం
పాల్గొన్న రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌షా, అజిత్‌దోవల్

న్యూఢిల్లీ: జమ్మూలోని వైమానిక స్థావరంలో డ్రోన్ల దాడితో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంగళవారం ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, హోంమంత్రి అమిత్‌షాతోపాటు జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఎ) అజిత్‌దోవల్ పాల్గొన్నారు. డ్రోన్ల దాడి నేపథ్యంలో సైన్యానికి ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తేవడంపై సమావేశంలో దృష్టి సారించినట్టు తెలుస్తోంది. భవిష్యత్‌లో ఎదురు కానున్న సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలా సాంకేతిక వనరులను సమకూర్చుకోవడంపై సమాలోచనలు సాగిస్తున్నారు.

మూడు రోజుల క్రితం(ఆదివారం) జమ్మూలోని స్థావరంలో రెండు డ్రోన్లు బాంబులు జారవిడిచిన సంఘటనతో ఇప్పటికే పాకిస్థాన్ సరిహద్దుల్లో భద్రతను పటిష్టం చేశారు. జమ్మూకాశ్మీర్‌లో సైన్యాన్ని అప్రమత్తం చేశారు. జమ్మూలో మంగళవారం కూడా డ్రోన్లు సంచరించినట్టు వార్తలొచ్చాయి. అయితే, సైన్యం దీనిపై అధికారికంగా స్పందించలేదు. సోమవారం కలూచాక్త్న్‌చ్రాక్ సైనిక స్థావరంవైపు రెండు డ్రోన్లు రాగా, శీఘ్ర స్పందన దళం కాల్పులు జరపడంతో అవి పారిపోయాయని సైన్యం ఇప్పటికే వెల్లడించింది. ఈ ఘటనతో భద్రతాదళాలు అత్యంత అప్రమత్తమయ్యాయని, ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నదని ఆర్మీ పిఆర్‌ఒ లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు. వరుస సంఘటనలతో ఉగ్రవాదులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్నట్టు అర్థమవుతోంది.

గతంలో డ్రోన్ల ద్వారా సరిహద్దుల్లోని ఉగ్రవాదులకు ఆయుధాలు, మందుగుండును చేరవేసిన ఘటనలను సైన్యం గుర్తించింది. తాజా సంఘటనలో వాణిజ్య డ్రోన్లతో నేరుగా దాడులు జరపడం కొత్త అనుభవం. ఈ సంఘటనతో ఉగ్రవాదుల నుంచి సరికొత్త ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. డ్రోన్ దాడులకు దీటుగా జవాబిచ్చేందుకు జమ్మూకాశ్మీర్‌లోని సైనిక దళాలకు ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చేందుకు వేగవంతమైన చర్యలకు కేంద్రం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. జమ్మూ సంఘటనలపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ స్పందించింది. పాక్ కేంద్రంగా ఉగ్రవాదులు జరుపుతున్న డ్రోన్ దాడుల్ని తిప్పి కొట్టేందుకు సమగ్ర విధానాన్ని అనుసరించాలని కాంగ్రెస్ సూచించింది. ప్రధాని మోడీ హెడ్‌లైన్స్ వార్తల కోసం ఆరాటపడకుండా నిపుణుల వ్యూహాత్మక సలహాలకనుగుణంగా చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News