అమెరికాలో బిజీగా గడిపిన ప్రధాని
న్యూఢిల్లీ: ఈ నెల 23 నుంచి 25వరకు మూడురోజులపాటు(65 గంటలు) అమెరికాలో గడిపిన ప్రధాని మోడీ 20 సమావేశాల్లో పాల్గొన్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. అంతేగాక అమెరికా బయలుదేరిన దగ్గరి నుంచి తిరుగు ప్రయాణంలోనూ విమానాల్లోనే ప్రధాని అధికారులతో నాలుగు సుదీర్ఘ సమావేశాలు నిర్వహించారు. వెళ్లేటపుడు రెండు, వచ్చేటపుడు రెండు సమావేశాలు నిర్వహించినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 23న అమెరికా చేరుకున్న ప్రధాని ఆ దేశంలోని ప్రముఖ కంపెనీల సిఇఒలతో అదేరోజు ఓ సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌తో మరో భేటీలో పాల్గొన్నారు. జపాన్ ప్రధాని యోషిహిడేసుగాతో, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌తో వేర్వేరుగా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ నెల 24న అధ్యక్షుడు జోబైడెన్‌తో ద్వైపాక్షిక సంబంధాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అదేరోజు క్వాడ్ దేశాధినేతలతో సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని తన విదేశీ పర్యటనలోనూ తీరిక లేకుండా గడిపారని ఈ వివరాలు వెల్లడిస్తున్నాయి.