Wednesday, November 13, 2024

హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఝార్ఖండ్‌ను లూటీ చేసింది

- Advertisement -
- Advertisement -

అవినీతిపరులను బిజెపి సహించదు
2014 తరువాత ఝార్ఖండ్‌కు అధికంగా నిధులు సరఫరా చేశాం
బొకారోలో ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ

బొకారో : ఝార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ సారథ్యంలోని ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. సోరెన్ ప్రభుత్వ హయాంలో అవినీతి పెచ్చుమీరిపోయిందని మోడీ ఆరోపించారు. ఝార్ఖండ్‌లో అక్రమ గనుల కుంభకోణం గురించి ప్రధాని ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో భారీ మొత్తంలో నగదు స్వాధీనం జరిగినట్లు చెప్పారు. ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం), కాంగ్రెస్ సంకీర్ణం ప్రజలను లూటీ చేసిందని ఆయన ఆరోపించారు. ప్రధాని మోడీ ఝార్ఖండ్ బొకారోలో ఒక ర్యాలీలో ప్రసంగిస్తూ, ‘సోరెన్ ప్రభుత్వం ఝార్ఖండ్‌ను దోచుకుంది. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత ఆ అవినీతిపరులకు కఠినాతికఠిన శిక్ష పడేలా కోర్టులో పోరాడతాం.

మీకు న్యాయంగా దక్కవలసిన డబ్బును మీ ప్రయోజనార్థం, మీ పిల్లల భవిష్యత్తు కోసం వినియోగిస్తాం’ అని చెప్పారు. మోడీ జెఎంఎంను తూర్పారపడుతూ, ‘వారి (జెఎంఎం) నాయకులు ఇసుక తవ్వకం ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. వారి వద్ద నోట్ల గుట్టలు బయటపడ్డాయి. వారికి ఆ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అది మీ నుంచి లూటీ చేసిన డబ్బు కాదా?’ అని అన్నారు. సోనియా గాంధీ, ఆతరువాత ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని పూర్వపు కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ప్రధాని మోడీ విమర్శలు చేశారు. 2004 నుంచి 2014 వరకు దశాబ్దంపైగా ఝార్ఖండ్‌కు రూ. 80 వేల కోట్లు కేటాయించడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తంటాలు పడింది.

కానీ 2014 తరువాత మీ మద్దతుతో మేము గత పది సంవత్సరాల్లో ఝార్ఖండ్‌కు రూ. 3 లక్షల కోట్లు సమకూర్చాం’ అని ప్రధాని మోడీ తెలియజేశారు. రాష్ట్ర ప్రగతికి బిజెపిఎన్‌డిఎ కట్టుబడి ఉన్నట్లు ఆయన పునరుద్ఘాటించారు. ‘మేము ఝార్ఖండ్‌ను సృష్టించాం. మేము తీనిని అభివృద్ధి చేస్తాం. ఈ రాష్ట్రం ఏర్పాటును వ్యతిరేకించినవారు దీని అభివృద్ధి కోసం ఎన్నడూ పాటుపడబోరు’ అని ఆయన అన్నారు.

రాష్ట్రంలో అవినీతిపై కొరడా ఝళిపిస్తామని, ముఖ్యంగా నీట్ ప్రశ్న పత్రాల లీక్, నియామక మాఫియాలను లక్షం పడతామని ప్రధాని చెప్పారు. ‘మాకు ఝార్ఖండ్‌లో మరి ఒక లక్షం ఉంది. జెఎంఎం కాంగ్రెస్ సృష్టించిన, యువత భవితతో ఆటలాడుకున్న పేపర్ లీక్ మాఫియా, నియామక మాఫియా భరతం పడతాం. వారిలో ప్రతి ఒక్కరినీ కనుగొని జైలులో పెడతాం. వారి ప్లాన్లను ధ్వంసం చేస్తాను’ అని మోడీ స్పష్టం చేశారు. ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలుగా ఈ నెల 13, 20 తేదీల్లో నిర్వహించనున్నారు. వోట్లను 23న లెక్కించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News