Wednesday, January 22, 2025

ఎన్నికల లబ్ధి కోసం మతపరమైన చీలికకు మోడీ యత్నాలు

- Advertisement -
- Advertisement -

ఎన్నికల లబ్ధి కోసం మతపరమైన చీలికకు మోడీ యత్నాలు
కాంగ్రెస్ ఆరోపణ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం రాజస్థాన్‌లో ఒక ఎన్నికల సభలో ప్రసంగిస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఎన్నికల్లో లబ్ధి కోసం దేశంలో మతపరమైన చీలికను సృష్టించడానికి ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ సోమవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ మోడీ చేసిన వ్యాఖ్యలు ప్రధానమంత్రి పదవికి తగనివని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో లేని విషయాలను ప్రధాని ఉటంకిస్తున్నారని ఆయన ఆరోపించారు.

తమ పార్టీ మేనిఫెస్టో గురించి తనకు జ్ఞానాన్ని ప్రసాదించడానికి అపాయింట్‌మెంట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధానిని కోరారని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల సంపదను ముస్లింలకు పంచి పెడుతుందని రాజస్థాన్ సభలో మోడీ ఆరోపించారు. దేశ వనరులపై మొదటి హక్కు మైనారిటీలకే ఉంటుందంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నట్లు కూడా మోడీ చెప్పారు.

ప్రజల సంపదను చొరబాటుదారులకు, అధిక సంతానం ఉన్న వారికి పంపిణీ చేయాలని కాంగ్రెస్ ఆలోచిస్తుందంటూ కూడా రాజస్థాన్‌లోని బన్సారాలో ప్రసంగిస్తూ మోడీ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థులతోసహా కాంగ్రెస్ నాయకులు అందరూ పార్టీ మేనిఫెస్టోను ప్రధాని మోదీకి పంపుతారని వేణుగోపాల్ ప్రకటించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రసంగాన్ని కూడా మోడీ వక్రీకరించారని ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News