Monday, December 23, 2024

రాష్ట్రాలకు బోడిగుండు!

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: రాష్ట్రాల అధికారాలను హరించడంలో అందెవేసిన చేయి అనిపించుకొన్న ప్రధాని మోడీ ప్రభుత్వం అటువంటి మరో దురాక్రమణకు సిద్ధపడుతున్నది. పరిపాలన బండికి ఇరుసుల్లాంటి ఐఎఎస్ అధికార్ల బదిలీలపై గుత్తాధిపత్యాన్ని నెలకొల్పుకోవాలని పావులు కదుపుతున్నది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తమయ్యే స్థాయికి తన గుత్తాధిపత్యాన్ని పెంచుకోవాలని చూస్తున్నది. ఆయా రాష్ట్రాలు స్వతంత్రంగా తమ పరిపాలనను సాగించడానికి వీలులేని స్థితిని సృష్టించాలని కేంద్రం కుట్ర పన్నుతున్నట్టున్నది. ఐఎఎస్‌ల బదిలీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించాలన్న నిబంధనను సవరించి కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోదలచినట్టు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల విభాగం గత జూన్‌లో రాష్ట్రాలకు లేఖ రాసింది. ఇందుకోసం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు రూల్స్‌లోని 6వ నిబంధనను సవరించదలచామని స్పష్టం చేసింది. 1954 ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ రూల్స్‌లోని 6 వ నిబంధన ప్రకారం ఒక రాష్ట్రంలోని ఒక ఐఎఎస్ అధికారిని కేంద్ర సర్వీసుకి లేదా వేరొక రాష్ట్రానికి డెప్యుటేషన్ పై బదిలీ చేయదలచినపుడు ఆ రాష్ట్రం సమ్మతిని తీసుకోవాలి. కేంద్రం ఇప్పుడీ నిబంధనను సవరించి రాష్ట్రాల ఇష్టానిష్టాలతో సంబంధం లేకుండా తన ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి పూర్తి స్వేచ్ఛను పొందాలని నిర్ణయించుకొన్నది.

కేంద్రంలో, రాష్ట్రాల్లో ఒకే పార్టీ ప్రభుత్వాలున్న చోట ఇది నడుస్తుంది గాని వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు బొత్తిగా కుదరదు. గత ఏడాది ప్రధాని నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్ వెళ్లి యాస్ తుపానుపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో బాటు ప్రధాన కార్యదర్శి ఆలాపన బందోపాధ్యాయ కూడా ఆ సమావేశానికి హాజరు కాలేదు. అందుకుగాను ఆ వెంటనే ఆయనను కేంద్రానికి బదిలీ చేశారు. కాని ముఖ్యమంత్రి మమత ఆయనను వెళ్లనివ్వలేదు. ఇందుకు ఆలాపన బందోపాధ్యాయ ఇప్పటికీ కేసు ఎదుర్కొంటున్నారు. అధికారులు అమల్లో గల నిబంధనల ప్రకారం నడచుకొంటారేగాని రాజకీయంగా వ్యవహరించలేరు. ముఖ్యమంత్రి ఆధీనంలో గల ఆలాపన బందోపాధ్యాయ ఆమె చెప్పినట్టు నడచుకొన్నందుకు ఆయనపై కేంద్రంలోని బిజెపి పాలకులు కక్ష గట్టి కేసు బనాయించారు. పశ్చిమ బెంగాల్ అనుభవంతో ప్రధాని మోడీ, -అమిత్ షా ల ప్రభుత్వం ధిక్కారముల్ సైతునా అంటూ ఐఎఎస్ ల బదిలీలపై ఎదురులేని అధికారాలను తనకు తనకు తాను కట్టబెట్టుకోదలచింది. తాను తీసుకురాదలచుకొన్న మార్పు రాష్ట్రాలకు ఇష్టం లేకపోయినా దానిని అమలుచేసే నిరంకుశాధికారాలు దానికున్నాయి.

ఇప్పటివరకు కేంద్రాన్ని పాలించిన ప్రభుత్వాలు రాష్ట్రాల సమ్మతితో ఐఎఎస్ అధికారులను ఉన్న చోటి నుంచి కదిలించి తమ ఆధీనంలోకి రప్పించుకోవాలన్న నిబంధనకు ఎటువంటి హాని తలపెట్టలేదంటే పరిపాలనలో రాష్ట్రాలకుండవలసిన స్వేచ్ఛను కబళించరాదనే సదుద్దేశంతోనూ, సమాఖ్య స్ఫూర్తితోనేనన్నది గమనించవలసిన విషయం. మోడీ ప్రభుత్వానికి అటువంటి మర్యాదలు బొత్తిగా లేవు. భారత రాజ్యాంగ నిర్మాతలు అధికారాలు పంచినప్పుడు కేంద్రానికి ఎదురు లేని స్థితిని కల్పించిన మాట వాస్తవం. దేశ రక్షణకు సంబంధించి గురుతర బాధ్యతలున్న కేంద్రానిదే పైచేయిగా ఉండాలని భావించారు. అదే సమయంలో రాజ్యాంగం 7వ షెడ్యూలు ద్వారా అధికారాలను కేంద్ర, రాష్ట్రాల జాబితాలుగాను, ఉమ్మడి జాబితాగాను విభజించి, కేంద్రానికి విశేషాధికారాలు కూడా కట్టబెట్టారు. ఆ విధంగా రాష్ట్రాల అధికారాలను మన్నించవలసిన బాధ్యతను కేంద్రంపై ఉంచారు. అందుచేత మన పాలన వ్యవస్థ ఫెడరల్ అనిపించేదే (క్వాసి ) గాని, ఫెడరల్ కాదు. దీనిని ఉపయోగించుకొని ప్రధాని మోడీ ప్రభుత్వం రాష్ట్రాల అధికారాలను సమూలంగా కబళించే దుస్సాహసానికి ఒడిగడుతున్నది. సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, అసోం, బెంగాల్ ల సరిహద్దుల లోపల 15 నుంచి 50 కి.మీ వరకు భద్రత దళాల ఆధీనంలో ఉంచబోవడం, రాష్ట్రాల జాబితాలోని వ్యవసాయంపై మూడు కొత్త చట్టాలను తీసుకు రావడం, విద్యా విధానాన్ని ఏకపక్షంగా మార్చడం వంటి జబర్దస్తీ చర్యలకు పాల్పడింది.

సరిహద్దుల లోపల కొంత భాగాన్ని భద్రతా దళాల (బిఎస్‌ఎఫ్) కు అప్పగించబోడాన్ని ప్రతిపక్షపాలిత రాష్ట్రాలైన పంజాబ్, బెంగాల్‌లు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఐఎఎస్‌ల బదిలీల నిబంధనలను కేంద్రం తనకు అనుకూలంగా మార్చుకోదలచడాన్ని పశ్చిమ బెంగాల్, కేరళ, మహారాష్ట్ర సహా ఆరు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. కేంద్రం నిర్ణయం సహకార సమాఖ్య వ్యవస్థకు విరుద్ధమని మమతా బెనర్జీ విమర్శించారు. రాష్ట్రాలకు బోడి గుండు గీసే దుశ్చర్యలను మానుకొంటేనే కేంద్రానికి మర్యాద దక్కుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News