న్యూఢిల్లీ: ‘ శిరీషా జీ ..ఈ కరోనా దశలో మీరు దేశానికి ఎనలేని సేవలు అందిస్తున్నారు. మీలాంటి మహిళలు మరెందరో ముందుకు వచ్చి కరోనా మహమ్మారిపై పోరులో ముందుకు సాగుతున్నారు. కరోనా అంతానికి ఊతం అందిస్తున్నారు. మీరు దేశంలోని ఘననీయపు నారీశక్తికి నిజమైన ఉదాహరణ’ అని ప్రధాని మోడీ తమ మన్ కీ బాత్‌లో లోకోరైలు పైలెట్ శిరీషను అభినందించారు. జార్ఖండ్‌లోని జంషేడ్‌పూర్ నుంచి బెంగళూరుకు వైద్య అవసరాల ఆక్సిజన్‌ను తీసుకువచ్చే ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ అందరూ మహిళలతో నడుస్తోంది. ఈ రైలు సారథి అయిన శిరీష గజనీతో ప్రధాని ఫోన్‌లో మాట్లాడుతూ దేశంలోని తల్లులు సోదరిలు ఇప్పుడు మరింత గర్వంగా తలెత్తుకునేందుకు ఇటువంటి ఘట్టం మరో ఉదాహరణ అవుతుందన్నారు. మొత్తం మహిళలతో ఈ రైలు ఆక్సిజన్ లోడ్‌తో వెళ్లుతోంది. దూర ప్రాంతాలలోని కరోనా రోగుల ప్రాణాలను నిలిపివేసేందుకు వీరు చేస్తున్న సేవలు వెలలేనివని కితాబు ఇచ్చారు. శిరీషతో కొద్ది సేపు ప్రధాని మాట్లాడారు. దేశ ప్రజలు అంతా గర్వించేవిధంగా సేవలు అందిస్తున్నారమ్మా అని ప్రశంసించారు. లోకో పైలెట్‌గా మారాలనే తపన ఇందుకు స్ఫూర్తి ఎవరు? అని ప్రధాని ప్రశ్నించగా, తన తల్లిదండ్రులే అని శిరీష జవాబు ఇచ్చింది.