ఖమ్మం: అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ వివిధ రాష్ట్రాలలో గవర్నర్లను వాడుకుంటున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. బుధవారం కెసిఆర్ ఆద్వర్యంలో ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ తెలంగాణలో ఉన్న పరిస్థితే ఢిల్లీలో కూడా ఉందని, గవర్నర్ల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోడీ అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
గవర్నర్‌కు పెద్ద బంగళా, ఎయిర్ కండీషన్డ్ కారు, ఐదేళ్ల పాటు సర్వభోగాలు లభిస్తాయని, ఇలాంటి పరిస్థితిలో దేశం ఎలా ప్రగతి సాధిస్తుందని కేజ్రీవాల్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు పథకాన్ని కేజ్రీవాల్ ప్రశంసించారు. ఢిల్లీలో కూడా ఈ పథకాన్ని అమలుచేస్తానని ఆయన వాగ్దానం చేశారు. పరస్పరం కీచులాడుకోవడం మాని అన్ని రాష్టాల ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకుని ఒకరి నుంచి మరొకరు మంచిని నేర్చుకుంటే దేశం బ్రహ్మాండంగా అభివృద్ధి సాధిస్తుందని ఆయన అన్నారు.
కుత్సిత రాజకీయాల కారణంగానే దేశం గడచిన 75 ఏళ్లలో తగినంత అభివృద్ధిని సాధించలేకపోయిందని, కాని మొట్టమొదటిసారి దేశ ప్రగతి గురించి చర్చించేందుకు కొందరు ముఖ్యమంత్రులు, నాయకులు కలసిరావడం ఆశాకిరణమని ఆయన అన్నారు. విద్య, ఆరోగ్యం, పారిశుద్ధం, రాజకీయాల గురించి తాము ఒకరోజంతా చర్చించినట్లు ఆయన తెలిపారు.