బెంగాల్ తొలి ఎన్నికల సభలో విసుర్లు
హల్దియా : ప్రజలకు మమత నుంచి మమత కరువు అయిందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు మోడీ ఆదివారం ఇక్కడ తొలి బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ విధానాలను తిప్పికొట్టారు. కేంద్ర పథకాలను బెంగాల్‌లో అమలు చేయకుండా మమత అడ్డుకుంటున్నారని, ప్రజలు ఆమె నుంచి మమతానురాగాలు ఆశిస్తూ ఉంటే ఆమె ఈ విధంగా మమత లేకుండా క్రూరత్వం ప్రదర్శిసున్నారని స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, పాలన గాడితప్పిందని విమర్శించారు.గత 10 సంవత్సరాలలో ఇక్కడి అధికార పక్షం అనేకానేక తప్పిదాలకు పాల్పడిందని, ఇవి పూర్తిగా పరాకాష్టకు చేరాయని, దీనితో ఈసారి ప్రజలు ఈ పార్టీని అధికారం నుంచి పంపించాలని సంకల్పించారని అన్నారు.
రాష్ట్రంలో అంతకు ముందటి వామపక్ష ప్రభుత్వపు దుర్నితికర పాలన టిఎంసి ప్రభుత్వంగా తిరిగి అవతరించిందని, దీనితో బెంగాలీలు ఏళ్ల తరబడి సతమతం అవుతూ వస్తున్నారని, ఇక ఈ పీడకలలు పోతాయనితెలిపారు. మమత బెనర్జీకి భారత్ మాతా కీజై అనే నినాదాలతో కోపం వస్తుంది కానీ, దేశ ప్రతిష్టను మంటగలిపే కుట్రలకు దిగే వారిని ఏమి అనబోరని విమర్శించారు. ప్రజలు వారి హక్కులను డిమాండ్ చేస్తే ఆమె కన్నెర్ర చేస్తారని, దేశంపై కారాలు మిరియాలు నూరేవారి పట్ల ఉదాసీనత పాటిస్తారని వ్యాఖ్యానించారు. పలు విధాలుగా భారతీయతకు ప్రతీకాత్మకమైన యోగా ఇక్కడి టీ ప్రతిష్టను పాడుచేసే కుట్రలు జరుగుతూ ఉన్నాయని, అయితే వీటికి వ్యతిరేకంగా దీదీ ఎప్పుడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు.
కుట్రదారులను తిప్పికొట్టే శక్తిని సంతరించుకుని దేశం తగు విధంగా సమాధానం ఇస్తుందని తెలిపారు. టిఎంసి రాజకీయాలను నేరమయం చేసిందని, అవినీతిని వ్యవస్థాగతంగా మార్చిందని మోడీ ఆరోపించారు. పోలీసు అధికార యంత్రాంగాన్ని రాజకీయమయం చేసి తప్పుదోవ పట్టిస్తోందన్నారు. ప్రజలు ఇటువంటి స్థితితో విసిగివేసారి పొయ్యారని, ఈసారి ఎన్నికలలో ప్రజలు అధికార మార్పు కోసం ఓటేస్తారని, బెంగాల్‌లో తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం అని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు.