Friday, November 22, 2024

ఎస్‌పి హయాంలో యుపి అంతటా ‘అవినీతి అత్తర్’ చల్లారు

- Advertisement -
- Advertisement -

Modi described Samajwadi Party, as 'fragrance of corruption'

ఇప్పుడు వారి నోళ్లకు తాళాలు పడ్డాయి: ప్రధాని మోడీ

లక్నో: సమాజ్‌వాదీ పార్టీనుద్దేశిస్తూ ప్రధాని మోడీ ‘అవినీతి సుగంధం’గా అభివర్ణించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో 2017లో బిజెపి అధికారం చేపట్టడానికి ముందు సమాజ్‌వాదీపార్టీ(ఎస్‌పి) ఆ రాష్ట్రమంతటా అవినీతి అత్తర్ వెదజల్లిందని ప్రధాని ఎద్దేవా చేశారు. మంగళవారం కాన్పూర్‌లో 9 కిలోమీటర్ల మెట్రోలైన్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. ఇటీవల జిఎస్‌టి నిఘా బృందాలు సుగంధ ద్రవ్యాల వ్యాపారి పీయూష్‌జైన్‌కు చెందిన కాన్పూర్,కనౌజ్‌ల్లోని ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించాయి. ఈ సోదాల్లో ఇప్పటివరకు రూ.257 కోట్ల నగదు (ఇందులో రూ.194.45 కోట్లు అక్రమ నగదు), 25కిలోల బంగారం,250 కిలోల వెండి, రూ.6 కోట్ల విలువైన గంధంచెక్కల నూనెను జప్తు చేసినట్టు జిఎస్‌టి అధికారులు తెలిపారు. పీయూష్‌జైన్‌కు ఎస్‌పితో లింక్‌లున్నాయని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వారి నోళ్లకు తాళాలు పడ్డాయంటూ ఎస్‌పి నేతలనుద్దేశించి ప్రధాని అన్నారు. అక్రమ నగదును తమ ఖాతాలో వేసుకునేందుకు ముందుకు రాలేకపోతున్నారంటూ విమర్శించారు.

తమ (బిజెపి) ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ హయాంలో జరిగిన అభివృద్ధి ప్రాజెక్టులన్నీ వారి హయాంలోనే(ఎస్‌పి హయాం..201217) చేపట్టామంటూ చెబుతున్నారని ఎస్‌పి అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్‌నుద్దేశిస్తూ ప్రధాని విమర్శలు గుప్పించారు. ఇప్పుడు నోట్ల కట్టల్ని వెలికితీసిన ఘనత కూడా తమదే అంటారేమో అంటూ ఎద్దేవా చేశారు. దేశమంతా చూసింది పర్వతమంత నోట్ల కట్టల్ని.. ఇది వారు సాధించిందే, ఇదే వారి వాస్తవ రూపం అంటూ ప్రధాని విమర్శించారు. ఇప్పటికే జైన్‌ను అరెస్ట్ చేసి జ్యుడిషియల్‌కస్టడీకి పంపారు. అయితే, ఎస్‌పినుద్దేశిస్తూ బిజెపి నేతలు చేస్తున్న విమర్శలు గురి తప్పుతున్నాయని కొందరు విశ్లేషిస్తున్నారు. అందుకు కారణం ఎస్‌పికి చెందిన ఎంఎల్‌సి పుష్పరాజ్‌జైన్ గత నెల రెండోవారంలో 22 రకాల అత్తర్లతో తయారైన సెంట్‌ను ‘పర్‌ఫ్యూమ్ ఆఫ్ సోషలిజం’ పేరుతో విడుదల చేశారు. ఆ కార్యక్రమానికి అఖిలేశ్ కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పుష్పరాజ్, పీయూష్ కనౌజ్‌లోని ఒకే ప్రాంతంలో ఉంటారు. వీరి మధ్య ఎలాంటి సంబంధాలున్నాయన్నది తెలియాలి. పీయూష్‌కు రాజకీయాలతో సంబంధాలు లేవన్న వాదన వినిపిస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News