Wednesday, January 22, 2025

చాటుమాటు ఎమర్జెన్సీ కూడా చేటే!

- Advertisement -
- Advertisement -

భారత ప్రజాస్వామ్యం ఎదుర్కొన్న అతిపెద్ద సవాల్ 21 నెలల పాటు ఇందిరా గాంధీ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ. ఇది జరిగి 50 ఏళ్ళవుతున్నా ఇంకా దాని దుష్ఫలితాలు మనలను వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ సంపాదించుకోవడంలో విఫలమై, మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పరచిన ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి అధికారం చేపట్టినప్పటి నుండి ఎమర్జెన్సీని తరచూ గుర్తు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యతలు తెలియజెప్పడం, దేశం ఎదుర్కొంటున్న గ్రామీణ- వ్యవసాయ రంగాల సంక్షో భం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, నీట్ పరీక్షల నిర్వహణలో భారీ అక్రమాలు వంటి అంశాలపై దృష్టి సారింపకుండా తన ప్రభుత్వానికి ముప్పుగా బలం పెంచుకుంటున్న ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ను ఆత్మరక్షణలో పడేసేందుకు ఎమర్జెన్సీని ఓ ఆయుధంగా వాడుకొంటున్నట్లు కనిపిస్తున్నది.

రాజ్యాంగంపై జరిగిన అతిపెద్ద దాడి ఎమర్జెన్సీ అని, భారత రాజ్యాంగంపై అదో మచ్చలా మిగిలిపోయిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ తెలిపారు. అంతకు రెండు రోజుల ముందు ఇందిరా గాంధీ హయాంలో దేశం లో ఎమర్జెన్సీ విధించి 50 ఏండ్లు అయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు. ఎమర్జెన్సీ విధించినవారికి ఇప్పుడు రాజ్యాంగంపై ప్రేమను వ్యక్తపరిచే హక్కులేదని ధ్వజమెత్తారు. ఆ మరుసటి రోజు లోక్‌సభ స్పీకర్‌గా రెండోసారి బాధ్యతలు చేపట్టగానే ఓం బిర్లా సైతం ఎమర్జెన్సీపై విరుచుకుపడ్డారు. నాటి అత్యవసర పరిస్థితి చరిత్రలోనే ఓ చీకటి అధ్యాయంగా నిలిచిపోతుందని పేర్కొంటూ 1975లో విధించిన ఎమర్జెన్సీ నిర్ణయాన్ని లోక్‌సభ ఖండిస్తోందని చెప్పారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రాణాలు కోల్పోయిన వారి స్మృత్యర్థం రెండు నిమిషాల మౌనాన్ని ఆయన పాటించారు. పైగా, ఎమర్జెన్సీని ప్రస్తావించినందుకు స్పీకర్‌ను ప్రశంసిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఏదేమైనా ఎమర్జెన్సీని సమర్ధించేవారు దేశంలో ఎవ్వరూ లేరన్నది స్పష్టం. ఎమర్జెన్సీని అమలు జరిపిన ఇందిరా గాంధీ స్వయంగా ఆ తర్వాత మరో వెయ్యేళ్ల వరకు దేశంలో ఎమర్జెన్సీ విధించడం సాధ్యం కాదంటూ చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ ఎమర్జెన్సీ మనస్తత్వంతోనే ఉందని ప్రధాని రాజకీయపరమైన విమర్శలు గుప్పించారు. కానీ నేటి పాలనా వ్యవస్థలో దాదాపు అన్ని ప్రభుత్వాలు అటువంటి మనస్తత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. ముఖ్యంగా చట్టసభలు మొక్కుబడిగా మాత్రమే సమావేశాలు జరుపుతున్నాయి. స్వతంత్ర భారత చరిత్రలో సరైన చర్చలు లేకుండా కీలకమైన బిల్లులను ఆమోదింప చేసిన ఘనత 17వ లోక్‌సభకు దక్కుతుంది. 146 మంది ప్రతిపక్ష సభ్యులను గెంటివేసి, ఏకపక్షంగా సమావేశాలు జరిపి ఓం బిర్లా చరిత్ర సృష్టించారు. అటువంటి వారిని రెండోసారి తిరిగి స్పీకర్‌గా ఎన్నుకోవడం ద్వారా అధికార పక్షం ఎమర్జెన్సీ మనస్తత్వాన్ని ప్రదర్శించిందని వెల్లడి అవుతుంది. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఎమర్జెన్సీని ‘చీకటి అధ్యాయం’గా మార్చేది ఏమిటి? అనేక సమాధానాలు బాగా తెలిసినవే అయినప్పటికీ ఈ ప్రశ్నను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి కొత్త పార్లమెంటు తన పదవీకాలాన్ని ప్రారంభించిన సమయంలో యాదృచ్ఛికంగా, రాజకీయపరమైన కారణాలతో ఎమర్జెన్సీని అధికార పక్షం ప్రస్తావిస్తున్నా అటువంటి మనస్తత్వం ప్రజాస్వామ్య దేశాల మనుగడకు ప్రమాదకారిగా గుర్తించాలి.

ఎమర్జెన్సీ సమయంలో ‘ఒక వ్యక్తి చేతిలో ‘అధికారం ఎలా కేంద్రీకృతమైందో గుర్తుచేసే ప్రయత్నం ఓం బిర్లా చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా బిజెపి 400 సీట్లు గెలుచుకుంటే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందని అంటూ ప్రచారం చేసిన ప్రతిపక్షాలు రాజ్యాంగం ప్రతిని చేత పట్టుకొని ఎంపిలుగా ప్రమాణ స్వీకారం చేయడంతో, రాజ్యాంగం పట్ల వారి నిబద్ధతను కొట్టిపారేసే విధంగా బిజెపి ఎమర్జెన్సీని ప్రస్తావనకు తీసుకొచ్చి ఉండవచ్చు. అయితే ఎమర్జెన్సీ పాఠాలను కేవలం కాంగ్రెస్ మాత్రమే కాదు. అన్ని రాజకీయ పార్టీలు నేర్చుకోవాల్సి ఉంది. ముఖ్యంగా రాజకీయ పార్టీలలో నేడు అంతర్గత ప్రజాస్వామ్యం కనిపించడం లేదు. ఒక కుటుంబం లేదా ఒకరిద్దరు వ్యక్తుల చుట్టూ దాదాపు అన్నిరాజకీయ పార్టీలు పని చేస్తున్నాయి. చివరకు పార్లమెంటరీ సంప్రదాయాలను సైతం గాలికి వదిలేస్తున్నారు. ఉదాహరణకు డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించే సంప్రదాయాన్ని కొనసాగించేందుకు బిజెపి విముఖంగా ఉండటంతో మొదటిసారిగా స్పీకర్ పదవికి లాంఛనంగా అయినా ఎన్నిక జరిగింది. స్పీకర్ ఎన్నిక మూజువాణి ఓటుతో జరిగినా, ఓట్ల లెక్కింపు వరకు వెళ్లకపోయినా అధికార, ప్రతిపక్షాల మధ్య పెరుగుతున్న దూరాన్ని వెల్లడిచేసింది.

ప్రధాని నరేంద్ర మోడీ తన మొదటి ఐదేళ్లల్లో ఈ పదవిని తన మిత్రపక్షమైన ఎఐఎడిఎంకేకు కేటాయించగా, రెండో ఐదేళ్లలో అసలు ఎన్నికే జరపలేదు. ఇప్పుడు ప్రతిపక్షాలు పట్టుబడుతున్నా మరో మిత్రపక్షానికి ఇచ్చే ఆలోచనలు చేస్తున్నట్లు వినిపిస్తున్నది.ఈ విధంగా పార్లమెంటరీ సంప్రదాయాలకు తిలోదకాలివ్వడం సైతం ఎమర్జెన్సీ మనస్తత్వాన్ని వెల్లడి చేస్తుంది. మొదటిసారిగా ప్రధాని నోటి వెంట ‘ఏకాభిప్రాయం’ ప్రాతిపదికన పరిపాలన సాగిస్తానని చెప్పడం జరిగింది.అయితే ఆ దిశలో ఆయన ఎటువంటి ప్రయత్నం చేయడంలేదు. కీలక అంశాలపై ప్రతిపక్షాలతోనే కాకుండా చివరకు సొంత పార్టీలో కూడా చర్చలు జరపడంలేదు. అయితే జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగలేదు. అంటే నిర్ణయాలను ఒకరిద్దరు వ్యక్తులు మాత్రమే తీసుకుంటున్నట్లు స్పష్టం అవుతుంది. 400 సీట్లు గెలిపించమని ‘మోడీ గ్యారంటీ’ పేరుతో ఎన్నికలకు వెడితే, ఒక వ్యక్తి పేరుతో ఆ విధమైన మెజారిటీ ఇస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదమని దేశ ప్రజలు భావించారని ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకనే అప్రమత్తంగా వ్యవహరించాలనే అభిప్రాయంతోనే బిజెపికి పూర్తి మెజారిటీ కూడా ఇవ్వలేదు.

రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరచడం, ప్రతిపక్ష నేతలను ‘అవినీతి’ కేసులలో అరెస్ట్ చేయడం, బిజెపికి మద్దతు ప్రకటిస్తే కేసులను అటకెక్కించడం వంటి చర్యలు సైతం ఎమర్జెన్సీ మనస్తత్వాన్ని తెలియచేస్తున్నట్లు ప్రజలు భావించారని ఈ ఫలితాలు వెల్లడి చేస్తున్నాయి. అందుకనే కొత్త లోక్‌సభలో ప్రతిపక్షాలకు తగిన బలాన్ని ఇచ్చారని భావించాల్సి వస్తుంది. అయితే, ప్రజల తీర్పు నుండి అధికారపక్షం ఎటువంటి గుణపాఠం నేర్చుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందు టివి ఛానల్స్ ప్రసారం చేసిన ఎగ్జిట్ పోల్స్ దాదాపు ఒకే విధంగా, ప్రజలను తప్పుదోవ పట్టించే విధం గా ఉండటం గమనార్హం. నేడు ప్రధాన స్రవంతిలో మీడియా స్వతంత్రతను కోల్పోయి, కార్పొరేట్ శక్తుల చేతులలో బందీలైపోయి, అధికార పార్టీల చెప్పుచేతలలో చిక్కుకున్న ఫలితంగా ఈ విధంగా జరిగినదని చాలా మంది భావిస్తున్నారు. నేడు ప్రభుత్వాలలో లోపిస్తున్న పారదర్శకత, జవాబుదారీతనం ప్రధానంగా ఆందోళన కలిగిస్తున్నది. అధికారికంగా ఎమర్జెన్సీ విధించకపోయినా పాలనలో నిరంకుశ పోకడలకు దారితీస్తుంది. ఉదాహరణకు నీట్ పరీక్షలలో పేపర్ లీకేజీ ఓ భారీ వ్యవస్థీకృత కుంభకోణంగా వెల్లడైంది. ముందుగా అసలు ఎటువంటి పొరపాటు జరగలేదని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన కేంద్ర విద్యా మంత్ర ధర్మేంద్ర ప్రధాన్ తర్వాత ఒకటి రెండు చోట్ల జరిగిన పొరపాట్లుగా పేర్కొంటూ చిన్నవిగా చూపే ప్రయత్నం చేశారు. అయితే బలమైన రాజకీయ నేతల అండదండలతోనే పలు రాష్ట్రాల్లో ఒకే విధంగా పరీక్షలను హైజాక్ చేయడంతో పరీక్షా కేంద్రాల ఎంపిక నుండి జరిపిన తీరు అంతా గమనిస్తుంటే ఉన్నత స్థాయిలో జరిగిన్నట్లు స్పష్టం అవుతుంది. అసలు దేశం అంతా ఒకే పన్ను, ఒకే రేషన్, ఒకే ఎన్నిక, ఒకే పరీక్ష.. అంటూ సమాఖ్య వ్యవస్థను బద్దలుచేయడం ద్వారా భారీ స్థాయిలో అక్రమాలు చేసేందుకు అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తున్నట్లు నీట్ పరీక్షల అక్రమాలు స్పష్టం చేస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో పరీక్షలు జరిపేందుకు, పన్నులు వసూలు చేసేందుకు, రేషన్ ఇచ్చేందుకు.. అవసరమైన యంత్రాంగం లేదు. కేవలం ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం ద్వారా వారు మాఫియాగా మారి భారీ స్థాయిలో అక్రమాలు పాల్పడేందుకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఈ రంగాలలో భారీ యంత్రాంగం ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ప్రేక్షకపాత్ర వహించాల్సి వస్తున్నది. సమాఖ్య వ్యవస్థను విచ్ఛిన్నం చేయడం అంటే దేశంలో మాఫియా రాజ్యంకు రాజబాట వేయ డం, ఎమర్జెన్సీ మనస్తత్వానికి ప్రాణం పోయడం, నిరంకుశ పోకడలకు ఆస్కారం కల్పించడంగా గుర్తించాలి. కేవలం రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా స్థానిక సంస్థల నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వరకు అధికారాల విభజన జరిపి, పాల నా బాధ్యతలు సైతం పంచుకొనే విధంగా జరిగిన్నప్పుడే మన ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష అని గ్రహించాలి.

చలసాని నరేంద్ర
9849569050

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News