జీ-20 సదస్సు.. పర్యావరణ సదస్సులో ఫెయిల్
గుజరాత్ ఎన్నికల కోసమే తెరపైకి కామన్ సివిల్ కోడ్ –
ఈసీ చర్యలు అభ్యంతరకరం
మీడియాతో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు
గవర్నర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్ర : విజయ రాఘవన్
ప్లాన్ ప్రకారం రెచ్చగొడుతున్న బీజేపీ : తమ్మినేని
మన తెలంగాణ/హైదరాబాద్ : ఇటీవల ఇండోనేషియా రాజధాని బాలిలో నిర్వహించిన జీ-20 సదస్సులో భారత్ అద్భుత విజయాలు సాధించిందంటూ ప్రధాని మోడీతో పాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్పుకుంటున్నారని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు వ్యాఖ్యానించారు. అయితే జీ-20 సదస్సుతో పాటు అంతర్జాతీయ పర్యావరణ సదస్సులోనూ ఆయన మనదేశానికి అనుకూలంగా ఫలితాలు తీసుకు రావటంలో విఫలమయ్యారని విమర్శించారు. సంపన్న దేశాలు వడ్డీ రేట్లను పెంచుకుంటూ పోవటమనేది మనకు ప్రతికూలంగా మారిందని వాపోయారు. వాటిని తట్టుకోవాలంటే మనం వడ్డీ రేట్లనన్నా పెంచాలి, లేదంటే సంక్షేమ పథకాలకు కత్తెరైనా వేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జీ-20 సదస్సు ద్వారా సంపన్న దేశాలు తమ వడ్డీ రేట్లను తగ్గించుకునేలా వాటిపై ఒత్తిడి తేవటంలో మోడీ విఫలమయ్యారని విమర్శించారు.
పర్యావరణ పరిరక్షణ కోసం పరిశ్రమలను నియంత్రించి, కాలుష్యాన్ని తగ్గించే బాధ్యత సంపన్న దేశాలపైన్నే ఉందని అన్నారు. ఈ విషయంలో కూడా ఆయా దేశాలపై మోడీ ఒత్తిడి తీసుకు రాలేకపోయారని తెలిపారు. భారతీయ మూలాలున్న రిషీ సునాక్ ఇంగ్లాండ్‌కు ప్రధాని అయినప్పటికీ వలసదారుల పట్ల ఆయన వైఖరిలో ఎలాంటి మార్పూ ఉండబోదని స్పష్టం చేశారు. ఇంతకుముందున్న దానికి భిన్నమైన వైఖరిని తీసుకోలేరని వివరించారు. రెండు రోజులపాటు కొనసాగే సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు శుక్రవారం హైదరాబాద్‌లోని ఎంబి భవన్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు ఎ. విజయ రాఘవన్, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి రాఘవులు మాట్లాడారు. త్వరలో ఎన్నికలు నిర్వహించనున్న గుజరాత్‌లో అభివృద్ధి నినాదం పక్కకు పోయిందని ఆయన తెలిపారు.
దాని స్థానంలో కామన్ సివిల్ కోడ్ (ఉమ్మడి పౌరసత్వం), సంక్షేమ పథకాలను ఉచితాలుగా ప్రచారం చేయటమనేది ముందుకొచ్చాయని వివరించారు. వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు… సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తాయి..? అందుకు సంబంధించి ఎలాంటి వాగ్దానాలు ఇస్తున్నాయి..? వాటికి నిధులెక్కడి నుంచి వస్తాయంటూ ఎన్నికల సంఘం (ఈసీ) కూడా ప్రశ్నించటం శోచనీయమని అన్నారు. దాని చర్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని విమర్శించారు. పాలక పార్టీ (బీజేపీ) మాటల ద్వారానే ఇసికి ఇలాంటి ఆలోచనలొస్తున్నాయని తెలిపారు.
ఇలాంటి చర్యలు, విధానాలు ప్రజాస్వామ్యానికి, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. విజయ రాఘవన్ మాట్లాడుతూ… దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు, తద్వారా ప్రభుత్వాలను పడగొట్టేందుకు బిజెపి శతవిధాలా ప్రయత్నిస్తున్న వైనాన్ని వివరించారు. అలాంటి పప్పులుడకని చోట గవర్నర్ల వ్యవస్థను ఉపయోగించి ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. అందువల్ల అలాంటి గవర్నర్లను రీకాల్ (వెనక్కు పిలవటం) చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
సిఎం కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన తమ్మినేని
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికలో బిజెపి ఓడటం సంతోషదాయకమని తెలిపారు. ఆ ఉప ఎన్నిక సందర్భంగా సిఎం కెసిఆర్ అనేక ప్రజా సమస్యలపై వినతిపత్రం సమర్పించామన్నారు. వాటిలో పోడు భూముల సమస్య ముఖ్యమైందని తెలిపారు. మూణ్నెల్లలోగా ఆయా భూములకు పట్టాలిస్తామంటూ సిఎం కెసిఆర్ ఇటీవల హామీనివ్వటం పట్ల ఆయన ధన్యవాదాలు తెలిపారు. మునుగోడులో బిజెపి ఓడిపోయినప్పటికీ రాష్ట్రంలో దాని ప్రమాదం పొంచే ఉందని హెచ్చరించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, పొత్తులు, సీట్లకు సంబంధించి ఇప్పటి వరకూ తమ పార్టీలో ఎలాంటి చర్చా జరగలేదని తమ్మినేని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.