Wednesday, January 22, 2025

జలగల్లా పెట్రో ధరలు

- Advertisement -
- Advertisement -

Modi failing to control prices:KTR

సబ్‌కా సాథ్ వికాస్ కాదు.. సబ్‌కా సత్తేనాశ్

కేంద్రానికి రాసిన లేఖలో మండిపడిన మంత్రి కెటిఆర్

బిజెపి వారివన్నీ అబద్ధాలే అంతా
ప్రగతి అని చెబుతున్నా మోడీ పాలనలో
నిజానికి అంతా సర్వనాశనమే ధరల
అదుపులో విఫలమవుతున్న మోడీ
ప్రభుత్వం అందుకు చెబుతున్న
కారణాలన్నీ అసత్యాలే దేశ ఆర్థిక
వ్యవస్థను నడిపే శక్తి బిజెపికి లేదు
పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని భారీగా
పెంచారు కేంద్రం వసూలు చేస్తున్న
సెస్‌ల నుంచి దక్కుతున్నది
గుండు సున్నానే గెలిపించిన ప్రజలకు
మోడీ గిఫ్ట్ పెట్రో ధరల పెంపే
అబద్ధాలను వల్లె బిజెపి నేతల
నాలుకలు

మన తెలంగాణ/హైదరాబాద్ : సబ్ కా సాథ్… సబ్ కా వికాస్ అని గప్పాలు చెప్పుకుంటున్న ప్రధాని నరేంద్రమోడీ పాలనలో సబ్ కా సత్తేనాశ్ అయిందని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ విమర్శించారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా, తగ్గినా వాటి రేట్లను పెంచడమే కేంద్రం పెట్టుకుందని మండిపడ్డారు. ఒక విధంగా చెప్పాలంటే పెంచడమే పరిపాలన అన్నట్లుగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవహిస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక్కో కుటుం బం నుంచి లక్ష రూపాయల మేర పెట్రో పన్నును కేంద్రం దోచుకుంటోందని ఆయన ఆరోపించారు. ప్రతిది దేశం కోసం….ధర్మం కోసం అని పేర్కొనే బిజెపి నేతలు, ఈ పెట్రో దోపిడి కూడా దేశం కోసం..ధర్మం కోసమేనా? అని ఆయన నిలదీశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం కెటిఆర్ లేఖాస్త్రాన్ని సంధించారు. ప్రతి రోజూ ప్రజల రక్తం పీల్చేలా పెంచుతున్న పెట్రో ధరల పెంపును నిరసిస్తూ కేంద్రానికి ఈ బహిరంగ లేఖ రాయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

వారివన్ని శుద్ధ అబద్దాలే….
కేంద్రంపై తాను ఇలా విమర్శించడానికి అడ్డూ అదుపు లేకుండా రోజువారీగా పెరుగుతున్న పెట్రో రేట్లు, ఆకాశాన్ని దాటి అంతరిక్షానికి చేరుకుంటున్న నిత్యావసరాల ధరలే కారణమని కెటిఆర్ కేంద్రానికి రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. అంతా ప్రగతి అని చెప్పుకునే మోడీ పాలనలో నిజానికి అంత సర్వనాశమే అయిందన్నారు. ధరలను అదుపు చేయడం చేతగాని మోడీ ప్రభుత్వం అందుకు కారణాలుగా చెపుతున్న అంశాలన్నీ శుద్ధ అబద్దాలేనని మంత్రి కెటిఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ముడి చమురు సరఫరాలో తలెత్తుతున్న ఇబ్బందులను కొన్నిరోజుల పాటు ముడి చమురు ధరల పెరుగుదల అని…… మరోసారి రష్యా ఉక్రేయిన్ యుద్ధం అని బిజెపి నేతలు కహానీలు చెబుతున్నారని విమర్శించారు. కాని ఇదంతా నిజం కాదన్నారు. అమెరికా, కెనడా, యుకె, జర్మనీ, ఫ్రాన్స్‌లో కూడా ధరలు పెరుగుతున్నాయని చెపుతున్న కేంద్రమంత్రులు అక్కడ లీటర్ పెట్రోల్ రేట్ మనకంటే తక్కువే అన్న విషయాన్ని కావాలనే దాస్తున్నారని మండిపడ్డారు. పక్కనున్న దాయాది దేశాలతో పాటు అర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలోనూ ఇప్పటికి అత్యంత చవక ధరకే పెట్రో ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

చమురు ధరలు తగ్గినా…. వాటి రేట్లు పెరుగుతున్నాయ్
2014లో బిజెపి ప్రభుత్వం గద్దెనెక్కిన నాటికి అంతర్జాతీయంగా ఉన్న ముడిచమురు ధర సుమారు 105 డాలర్లు. ఆ తర్వాత వివిధ కారణాల వలన ఒకానొక దశలో సుమారు 40 డాలర్ల దిగువకు ముడిచమురు ధరలు తగ్గినా దేశంలో మాత్రం పెట్రో ధరలను బిజెపి ప్రభుత్వం పెంచుతూనే ఉందన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలంటే కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వానికి కనికరం లేదనడానికి కరోనా సంక్షోభం కాలంలో పెంచిన ఎక్సైజ్ సుంకమే సాక్ష్యమని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు. కరోనా సంక్షోభంలో బ్యారెల్ ముడిచమురు ధర 20 డాలర్ల కంటే తక్కువకు పడిపోయిందన్నారు. 2014లో సుమారు రూ.70.51లుగా పెట్రోల్ ధరను, రు.53.78 గా ఉన్న డీజిల్ ధరను క్రమంగా పెంచుతూ ప్రస్తుతం రూ.118.19లకు పెట్రోల్‌ను, డీజిల్ ను రూ. 104.62 కు పెంచిందని విమర్శించారు.. అంతర్జాతీయంగా ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధర 106 డాలర్లుగా ఉందన్నారు. 2014లో క్రూడ్ ఆయిల్‌కు ఎంత ధర ఉందో ఇప్పుడు కూడా అంతే ఉందన్నారు.

దేశ ఆర్ధిక వ్యవస్థను నడిపే శక్తి బిజెపికి లేదు
దేశ ఆర్ధిక వ్యవస్థను నడిపే సత్తా బిజెపికి లేదని కెటిఆర్ ఆరోపించారు. వారి అసమర్థ విధానాలే ప్రస్తుత దేశంలోని ఈ దుస్థితికి ప్రధాన కారణమన్నారు. సంపదను సృష్టించే తెలివి లేక, చేతిలో ఉన్న అధికారంతో విపరీతంగా పన్నులు పెంచుతూ దాన్నే సుపరిపాలనగా భావిస్తున్న భావదారిద్య్రంలో కేంద్రంలోని బిజెపి పెద్దలు ఉన్నారని ధ్వజమెత్తారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా దేశంలో ఉన్న 26 కోట్ల కుటుంబాలపై ఏడున్నర సంవత్సరాలుగా రూ.26.51 లక్షల కోట్ల పెట్రో పన్నును వేసిన పనికిమాలిన ప్రభుత్వం బిజెపిదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే సగటున ఒక్క కుటుంబం నుంచి లక్ష రూపాయలను దౌర్జన్యంగా పెట్రో ధరల పెంపు పేరుతో మోడీ ప్రభుత్వం లూఠీ చేస్తోందన్నారు.

అంతర్జాతీయంగా చవక ధరలకు పెట్రో ఉత్పత్తులను కొని అధిక ధరలకు దేశ ప్రజలకు అమ్ముకుంటున్న దళారి ప్రభుత్వం నరేంద్రమోడి సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వమన్నారు. బహిరంగంగా తాను చేస్తున్న దోపిడిని రాష్ట్ర ప్రభుత్వాలపైకి నెట్టి చేతులు దులుపుకుంటున్న బట్టేబాజ్ సర్కార్ కేంద్రంలో ఉందని వ్యాఖ్యానించారు.

పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని భారీగా పెంచింది
పెట్రోల్‌పై భారీగా కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని పెంచడం వల్ల వాటి ధరలకు రెక్కలు వచ్చాయని కెటిఆర్ అన్నారు. వాస్తవానికి 2014లో పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ రూ. 9.48గా ఉండేదని….మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత దానిని రూ.32.98కి పెంచారన్నారు. గతేడాది కాస్త తగ్గించి దాన్ని రూ.27.90 చేశారన్నారు. పెట్రోల్ ధరలో ఎక్సైజ్ డ్యూటీ పేరుతో కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న దాంట్లో అన్ని రాష్ట్రాలతో పంచుకునేది బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ మాత్రమేనని అన్నారు. ఇప్పుడున్న పెట్రో ధరలో బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ ఒక రూపాయి 40 పైసలు మాత్రమేనని కెటిఆర్ పేర్కొన్నారు. ఇందులో నుంచి 41 శాతాన్ని అంటే అక్షరాల 57 పైసలను కేంద్రం, అన్ని రాష్ట్రాలకు పంచుతోందన్నారు. ఇందులో తెలంగాణ వాటా 2.133 శాతమన్నారు. అంటే లీటరుకు 0.01 పైసలు. కానీ 28 రూపాయల ఎక్సైజ్ డ్యూటీ ముక్కుపిండి వసూలు చేస్తున్న మోడీ సర్కార్, అందులో నుంచి ఆఠాణా మాత్రమే రాష్ట్రాలకు ఇస్తోందన్నారు.రోడ్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్టర్ డెవలప్‌మెంట్ కోసం 18 రూపాయలు, వ్యవసాయ, మౌలిక వసతులు అభివృద్ధి పేరిట రెండున్నర రూపాయలు, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ పేరిట పదకొండు రూపాయలను… ఇలా ప్రతి దానికి ఒక్కో పేరు చెప్పి దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అత్యంత భారీగా రూ. 30లకు పైగా సెస్సులను పెట్రో ధరల పేరుతో మోడీ సర్కార్ వసూలు చేస్తోందన్నారు.

రాష్ట్రాలకు దక్కుతున్నది గుండు సున్నానే
కేంద్రం వసూలు చేస్తున్న సెస్‌ల నుంచి రాష్ట్రాలకు దక్కుతున్నది గుండు సున్నానే అని మంత్రి కెటిఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి దాదాపు పెట్రో ధరలను రెట్టింపు చేసినా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 2015 నుండి ఇప్పటిదాకా వ్యాట్ టాక్స్ ఒక్క నయాపైసా కూడా పెంచలేదన్న సంగతిని ప్రజలంతా గమనించాలని కోరుతున్నానని అన్నారు. పెట్రో ధరల పేరిట పట్టపగలు ప్రజల జేబులను దోచుకుంటున్న పార్టీ బిజెపి అన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. అందుకే అచ్చేదిన్ కాదు అందర్నీ ముంచే దిన్ అనుకుంటున్నారన్నారు.

ఎన్నికలు ముగియగానే పన్నుల వడ్డింపులు
పెట్రో ధరల పెంపును ఒక రాజకీయ అంశంగా వాడుకుంటున్న బిజెపి ఎన్నికల తర్వాత అత్యంత కర్కశంగా వరుసగా పెట్రో ధరలను పెంచుకుంటూ పోవడాన్ని అలవాటుగా మార్చుకుందని విమర్శించారు. 2017 గుజరాత్ ఎన్నికలు, 2019 సాధారణ ఎన్నికలు, 2020లో 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా కొన్ని వారాలు, నెలలపాటు పెట్రో ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచలేదన్నారు. కాని ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచి దాదాపు ప్రతీ రోజూ పెట్రో ధరల్ని మోడీ సర్కార్ పెంచుకుంటూ పోతున్నదన్నారు. గత పదిహేను రోజుల్లో 13 సార్లు పెట్రోల్ ధరలను పెంచిందన్నారు.

గెలిపించిన ప్రజలు మోడీ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్
నాలుగు రాష్ట్రాల్లో బిజెపిని గెలిపించిన పాపానికి ప్రజలకు మోడీ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదే (పెట్రోల్ ధరల పెంపు) అని కెటిఆర్ ఎద్దేవా చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం తనకు చేతకాని పాలనను పక్కనపెట్టి కేవలం పెట్రో ధరలను పెంచడాన్నే అలవాటుగా మార్చుకుందంటే అతిశయోక్తి కాదన్నారు. పెట్రో ధరలు ఎందుకు పెరుగుతున్నాయని అడిగిన ప్రతిసారి అదరకుండా, బెదరకుండా అబద్దాన్ని చెప్పే దొంగ నేర్పు ప్రస్తుత కేంద్ర మోడీ సర్కార్ కు పుష్కలంగా ఉందన్నారు. అందుకే తాజా ధరల పెరుగుదలకు రష్యా, ఉక్రేయిన్ సంక్షోభాన్ని సాకుగా కేంద్ర మంత్రులు చూపిస్తున్నారు. లోక్ సభలో పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రి రామేశ్వర్ తేలి చేసిన ప్రకటన ప్రకారం రష్యా నుంచి కేవలం ఒక్క శాతం కన్నా తక్కువ క్రూడాయిల్ ను మనం దిగుమతి చేసుకుంటున్నామన్నారు. ఇరాక్, సౌదీ అరేబియా, యుఎఇ, నైజీరియా, అమెరికా నుంచే మనం అత్యధికంగా పెట్రో ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటున్నామన్నారు. రష్యా, ఉక్రేయిన్ యుద్ధంతో ఈ దేశాల నుంచి మనకు పెట్రో ఉత్పత్తులు రావడంలో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. కాని రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఒక్కశాతాన్ని చూపించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం బిజెపి నాయకులు చేస్తున్నారన్నారు.

నాలుకలు కూడా సిగ్గుపడుతున్నాయి
పదే పదే అబద్దాలను వల్లె వేసీ..వేసీ.. బిజెపి నాయకుల నోట్లోని నాలుకలు కూడా సిగ్గుపడుతున్నాయని కెటిఆర్ అన్నారు. మానవత్వం అస్సలు లేని ప్రభుత్వం దేశ ప్రజల నెత్తి మీద తిష్ట వేసుకుని కూర్చుందన్నారు. కరోనా సంక్షోభాన్ని అత్యంత్య దారుణంగా మార్చిన మోడీ సర్కార్, ఆ టైంలో పంపిణీ చేసిన ఆహార ధాన్యాలు, వ్యాక్సిన్ల ఖర్చును పెట్రోల్ ధరలతో వసూలు చేసుకుంటామని సిగ్గులేకుండా ప్రకటించిందన్నారు. ప్రభుత్వ పరిపాలన అంటే ప్రజలపై భారీగా పన్నులు వసూలు చేయడమే అన్న స్ఫూర్తితోనే నరేంద్ర మోడీ సర్కార్ పనిచేస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. ప్రజలను దోపిడి చేయడమే లక్ష్యంగా కేంద్రంలోని బిజెపి సర్కారు ప్రధానమంత్రి పెట్రో పన్ను యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందనిపిస్తుంది. సమర్థ విధానాలు, నిర్ణయాలతో సంపదను సృష్టించి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ.. సృష్టించిన సంపదను ప్రజలకు పంపిణీ చేయాలి కానీ కేవలం పన్నుల పేరిట ప్రజలను పీల్చిపిప్పి చేయడమే పరిపాలనగా భావిస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు సాగనంపే రోజు దగ్గర పడిందన్నారు. పెట్రో ధరల బాదుడు ఆపకపోతే.. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించడం ఖాయమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News