Monday, January 20, 2025

కుటుంబ పార్టీలు దేశాన్ని దోచుకున్నాయి: మోడీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో బిజెపికి మద్దతు పెరుగుతోందని కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌కు తగ్గుతుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయని, బిజెపికి 400పైగా సీట్లు రావడం ఖాయమని, బిజెపికి ఓటు వేయాలని తెలుగులో ప్రధాని మోడీ చెప్పారు. జగిత్యాలలో జరిగిన బిజెపి విజయసంకల్ప సభలో మోడీ ప్రసంగించారు.
తెలంగాణలో బిజెపిని ఎంతగా గెలిపిస్తారో అంతగా తాను బలోపేతం అవుతానని, తెలంగాణలో బిజెపికి అధికారమిస్తే మరింతగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. పసుపు రైతుల కోసం పసుపు బోర్డు తీసుకొచ్చామని, తెలంగాణలో లక్ష కోట్ల విలువైన ధాన్యం కొన్నామని పేర్కొన్నారు.

గత మూడు రోజుల్లో తాను తెలంగాణకు రావడం ఇది రెండోసారి అని, తెలంగాణ కోసం రూ. వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, తెలంగాణలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇటీవల శ్రీకారం చుట్టామన్నారు. తెలంగాణ నలుమూలల నుంచి బిజెపికి మద్దతు పెరుగుతోందన్నారు. మాల్కాజ్‌గిరిలో బిజెపి ర్యాలీలో ప్రజలు భారీగా పాల్గొని మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. శక్తి రూపంలో మహిళలు తనని ఆశీర్వదించేందుకు వచ్చారని, ఇది తన భాగ్యమని, శక్తిస్వరూపులైన ప్రతి మాత, సోదరి, కుమార్తెల కోసం పూజారిగా ఉన్నానని, శక్తిస్వరూపులైన మహిళల రక్షణ కోసం తాను ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నానని మోడీ స్పష్టం చేశారు. తాను భారతమాత పూజారిని అని పేర్కొన్నారు.

ఆంగ్లేయులు, రజాకార్లతో పోరాడిన నేల ఇది అని ప్రశంసించారు. కాంగ్రెస్ తెలంగాణ ఆశలను నాశనం చేసిందని, తెలంగాణ ప్రజలను బిఆర్‌ఎస్ దోచుకొని ద్రోహం చేసిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణను తమ ఎటిఎంలాగా మార్చుకుందని, తెలంగాణ డబ్బు ఇప్పుడు ఢిల్లీ చేరుతోందని దుయ్యబట్టారు. ఒక దోపిడీదారు… మరో దోపిడీదారుపై పోరాటం చేయలేదని ప్రజలకు తెలుసునన్నారు. బిఆర్‌ఎస్ దోపిడీపై కాంగ్రెస్ మౌనం వహిస్తోందని దుయ్యబట్టారు. కాళేశ్వరం దోపిడీని కాంగ్రెస్ ప్రశ్నించడం మానేసి, బిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్ కాపాడుతోందని మోడీ ధ్వజమెత్తారు.

కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు బిజెపి, మోడీని విమర్శించడం పనిగా పెట్టుకున్నాయని పేర్కొన్నారు. తెలంగాణను దోచుకున్న వారిని తాము విడిచిపెట్టేది లేదు అని, కుటుంబ పార్టీలు దేశాన్ని దోచుకునేందుకు రాజకీయాలు చేస్తున్నాయని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఏ దోపిడీని పరిశీలించినా దాని వెనుక కుటుంబ పార్టీలే ఉన్నాయని, 2 జి స్పెక్ట్రమ్ కేసులో డిఎంకె పేరు బయటకు వచ్చిందని, అది కుటుంబ పార్టీ అని, నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పేరు బయటకు వచ్చిందని, అది కుటుంబ పార్టీ అని, ఇప్పుడు ఆ జాబితాలో కుటుంబ పార్టీ బిఆర్‌ఎస్ చేరిందని ధ్వజమెత్తారు. కుటుంబ పార్టీ అయిన బిఆర్‌ఎస్ కాళేశ్వరంలో అవినీతి చేసిందని, ఢిల్లీ మధ్యం విషయంలోనూ బిఆర్‌ఎస్ అవినీతికి పాల్పడిందని ఆయన చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News