Monday, December 23, 2024

లా కమిషన్‌ది బిజెపి అజెండా

- Advertisement -
- Advertisement -

ఏకరూప పౌర స్మృతి అంటే ఎలా ఉంటుందో కేంద్ర ప్రభుత్వం ఒక ముసాయిదా చట్టాన్ని రూపొందించి ఎలాంటి మార్పులు చేసేదీ జనంలో చర్చకు పెడితే దాని గురించి ఉన్న అనేక అపోహలు తొలుగుతాయి. ఏమైనా సరే వెంటనే అమలు జరపాలని కోరుతున్న మోడీ సర్కార్ గత తొమ్మిది సంవత్సరాలుగా అలాంటిదేమీ తీసుకురాలేదు. రూపు రేఖలు లేని ఒక ప్రతిపాదన మీద అభిప్రాయాలు చెప్పమంటే ఏమి చెబుతారు? గతంలో చెప్పిన అభిప్రాయాలకు కాలదోషం పట్టిందని వర్తమాన లా కమిషన్ ఏ ప్రాతిపదికన నిర్ధారించింది. అసలది ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ తప్ప రాజ్యాంగబద్ధమైనది కాదు. ప్రభుత్వం దాని ద్వారా అభిప్రాయ సేకరణ జరపమని కోరింది గాని రాజ్యాంగ ఆదేశం లేదు. ఏకరూప పౌర స్మృతిని ముస్లింలు లేదా ఏ మతం వారైనా ఎలాంటి హేతుబద్ధత లేకుండా గుడ్డిగా తిరస్కరించనవసరం లేదు, భిన్నఅభిప్రాయం వెల్లడించవచ్చు, ముసాయిదాను ముందుపెడితే వివరణలు కోరవచ్చు.

ఆదేశిక సూత్రాల్లో అనేక అంశాలు ఉన్నప్పటికీ మిగతా వాటిని అమలు జరపకుండా ఏకరూప పౌర స్మృతి మీద బిజెపి కేంద్రీకరణ అన్నది ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారని, ఆ మతానికి చెందిన వారితో పాటు ఇతర మతాల వారు, మతం, కుల పట్టింపులు లేనివారు కూడా బలంగా నమ్ముతున్నారు. దాన్ని ఏకాభిప్రాయంతో సాధించాల్సి ఉందని అంబేడ్కర్‌తో సహా మెజారిటీ భావించిన కారణంగానే ఆదేశిక సూత్రాల్లో చేర్చారు. దళితులు, గిరిజనులకు రిజర్వేషన్లు పది సంవత్సరాలు చాలని నాడు భావించారు.ఆ లక్ష్యం నెరవేర లేదు గనుక పొడిగిస్తూ వస్తున్నారు. తరువాత ఒబిసిలకూ వర్తింపచేశారు.
పౌర స్మృతి మీద ఇప్పటికీ ఏకాభిప్రాయ పరిస్థితి ఉందా అంటే లేదు. అసలు హిందువులందరూ దానితో ఏకీభవిస్తారా అన్నది ప్రశ్న. కర్ణాటకలో ఎక్కువగా ఉన్న లింగాయతుల తమను ప్రత్యేక మతానికి చెందిన వారిగా పరిగణించాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

శైవులు, వైష్ణవు లు వారిలో కులాల వారీ భిన్న ఆచారాలు, ఇలా ఎన్నో విభిన్నతలు ఉన్నాయి. వాటన్నింటిలో బిజెపి లేదా కేంద్ర ప్రభుత్వం వేలు బెట్టాలని, ఫలానా పద్ధతి పాటించాలని ఆదేశించాలని చూస్తున్నదా? అందుకే ముసాయిదా చట్టాన్ని ముందుపెడితే ఇలాంటి అనుమానాలకు తెరపడుతుంది లేదా కొత్త అంశాలు ముందుకు రావచ్చు. ఆర్టికల్ 370ని రద్దు చేస్తే అదేదో ముస్లింలకు సంబంధించిందని అనేక మంది భావించి మద్దతు ఇచ్చారు. రాముడి గుడి కడతామంటే సరే అన్నారు. వ్యక్తిగత అంశాల్లో తమ దాకా వస్తే అలాగే ఉంటారా? ఒక కులానికి చెందిన వారు మరో కులం, మతానికి చెందిన వారిని వివాహం చేసుకోకూడదని తీర్మానాలు చేస్తున్న పంచాయత్‌లు సాగుతూనే ఉన్నాయి. ఎవరికి వారు తమ కులాన్ని, మతాన్ని పవిత్రంగా మార్చాలని చూస్తున్నారు.

అలాంటి స్థితిలో అందరూ సమానమే, ఒకటే అనే భావనను అంగీకరిస్తాయా? గోవాలో ఏకరూప పౌర స్మృతి అమలు జరుపుతున్నపుడు ఇతర చోట్ల ఎందుకు అమలు జరపకూడదు అని కొందరు వాదిస్తున్నారు. పోర్చుగీసు పాలనలో ఉన్న గోవా 1961లో దేశంలో విలీనమైంది. అప్పటి వరకు అక్కడ అమల్లో ఉన్న పౌర స్మృతిని మార్చి కొత్త విధానాన్ని వర్తింపచేయాల్సిన అగత్యం తలెత్తలేదు. దాన్నే వర్తింపచేసేందుకు నాడు కేంద్రం అంగీకరించింది, ఎవ రూ అభ్యంతర పెట్టలేదు. అలాంటి చట్టాన్ని మిగతా దేశంలో అమలు జరపవద్దని ఎవరూఅనటం లేదు.బలవంతంగా రుద్దటం గాక అనుమానాలను తీర్చి అమలు జరపాలని చెబుతున్నారు. అందుకు అనువైన వాతావరణం లేదు గనుక తొందరపడవద్దంటున్నారు. మిగిలిన ఆదేశిక సూత్రాలు అమలు జరిపిన తరువాత దీన్ని కూడా చేపట్టవచ్చు. గోవాలో ఉన్న చట్టం ప్రకారం వివాహమైన వెంటనే ఏ మతం వారికైనా భర్త ఆస్తిలో భార్యకు సగం వాటా మీద హక్కు దఖలు పడుతుంది. దేశంలో దాన్ని అమలు చేస్తే ఇప్పుడున్న హిందూ అవిభక్త కుటుంబం, దానితో పాటే ఆ పేరుతో పొందుతున్న పన్ను రాయి రద్దవుతుంది. దీన్ని దేశంలోని హిందువులందరూ సమ్మతిస్తారా?

ఉత్తరాదిన సప్తపది హోమం చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణ చేస్తేనే వివాహం జరిగినట్లు, దక్షిణాదిన అదే హిందువుల్లో ఎవరైనా పాటించవచ్చు తప్ప విధి కాదు, లేదు. ఇలాంటి అనేక తేడాలు ఉన్నప్పుడు ఏకరూప చట్టం ఎలా ఉంటుందో ఎవరిని ఎలా ప్రభావితం చేస్తుందో, ఎలా స్పందిస్తారో తెలియదు. పంజాబ్‌లో వారసత్వ హక్కులు హిందువులకు ఒక విధంగా సిక్కులకు మరొక విధంగా ఉన్నాయి. ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఆ మతానికి చెందిన పురుషులు నలుగురిని వివాహం చేసుకోవచ్చు, ఆ మేరకు వివాహాలు చేసుకుంటూ హిందువులు మెజారిటీగా ఉన్న దేశాన్ని ముస్లిం మెజారిటీగా మార్చేందుకు కుట్ర పన్నుతున్నారంటూ కాషాయ దళాలు నిరంతరం చేస్తున్న గోబెల్స్ ప్రచారం తెలిసిందే. నిషేధం ఉన్నప్పటికీ ముస్లింలలో కంటే హిందువులు, ఇతరుల్లోనే ఎక్కువగా బహు భార్యాత్వం ఉందని గతంలో జరిపిన విశ్లేషణలో తేలింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2005 06 ప్రకారం హిందువుల్లో 1.9, ముస్లింలలో 2.9, ఇతరుల్లో 2.9 శాతం ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉన్నారు. అదే 2019 20 సర్వే ప్రకారం 1.3, 1.9, 1.6 శాతాలకు తగ్గారు. తగ్గుదల అందరిలోనూ ఉంది. అందువలన ముస్లింలు పని గట్టుకొని ఎక్కువ మందిని వివాహమాడి పిల్లలను కని దేశాన్ని ఆక్రమిస్తున్నారనే ప్రచారం వాస్తవం కాదు. విద్యలేని వారు, పేదలు, చిన్న వయసు లోనే వివాహాలు చేసుకున్న వారిలో ఈ దురాచారం ఎక్కువగా ఉన్నట్లు కూడా అధికారిక సర్వే వెల్లడించింది.

కులాలవారీగా చూసినపుడు తాజా సర్వే ప్రకారం గిరిజనుల్లో 2.4, ఎస్‌సి 1.5, ఒబిసి 1.3, ఇతరుల్లో 1.2 శాతం చొప్పున, మతాలవారీ హిందూ 1.3, ముస్లిం 1.9, క్రైస్తవులు 2.1, బౌద్ధులు 1.3, సిక్కులు 0.5, ఇతరులు 2.5 శాతం మంది ఉన్నారు. ముస్లింలకు మినహా ఇతరుల్లో ఒకరి కంటే ఎక్కువ మందిని కలిగి ఉండటం నిషేధం. దేశంలో జరిపిన నేషనల్ శాంపుల్ సర్వే ప్రకారం ఒబిసిలు 40.94, దళితులు 19.59, గిరిజనులు 8.63 శాతం ఉన్నారు. వీరిలో అనేక కులాలు, ఉపకులాలు ఆచారాలు, సాంప్రదాయాలన్నీ ఒకటే కాదు, వీరందరూ హిందువులే, ఎంతో భిన్నత్వం కలిగిన వారందరికీ ఒకే పౌరస్మృతిని అమలు జరిపే ముందు వీరిలో ఉన్న అనుమానాలను తొలగించాలా లేదా? దానికి మార్గం నమూనా చట్టం జనం ముందు పెట్టటమే.

ప్రస్తుతం వివిధ మతాల వ్యక్తిగత చట్టాల ప్రకారం ఒకే అంశంపై ఏకీభావం లేదు. ఎవరి భాష్యాలు వారు చెబుతున్నారు. జనంలో అనేక అనుమానాలు, గందరగోళం ఉంది. ఏకరూప పౌరస్మృతిని బిజెపి బలవంతంగా రుద్దాలనుకుంటే ప్రస్తుతం దానికి అడ్డులేదు. పార్లమెంటులో దానికి గుడ్డిగా మద్దతు ఇచ్చే పార్టీలు ఉన్నందున అదేమీ పెద్ద అంశం కాదు. దాన్ని ఒక ఎన్నికల ప్రచార అస్త్రంగా, ముస్లింల మీద విద్వేషాలు, వ్యతిరేకతను రెచ్చగొట్టి మెజారిటీ ఓటు బ్యాంకు సృష్టికి, సంతు ష్టీకరణకు పూనుకుంది.దీనికి ఇస్లాం లేదా దేశంలోని ముస్లింలు వ్యతిరేకమనే ప్రచారం చేస్తున్నారు. దీనిలో వాస్తవం వక్రీకరణ రెండూ ఉన్నాయి. ముస్లిం మతశక్తులు గుడ్డిగా సంస్కరణలను వ్యతిరేకిస్తున్నాయి తప్ప సామాన్య ముస్లింలందరూ అలా లేరు. అదే విధంగా హిందూత్వ పేరుతో వీరంగం వేస్తున్న వారు ముస్లింల పట్ల గుడ్డి ద్వేషాన్ని వెళ్లగక్కుతుంటే మొత్తం హిందువులందరూ అలా లేరు. ఏ మతమైనా వర్తమానానికి అనుగుణంగా మారకపోతే మౌఢ్యంపెరుగుతుంది. ఉన్న మతాల్లో హిందూ అని చెబుతున్న అనేక సామ్యాలున్న శైవ, వైష్ణవ ఇతర వివిధ మతాలు వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నందున అనేక సంస్కరణలు చోటు చేసుకున్నాయి. లేకపోతే జనం మతాలను పక్కన పెట్టేస్తారు. అమెరికా వెళ్లి హిందూ మత గొప్పతనం గురించి ప్రసంగించిన స్వామివివేకానందుడి గురించి గొప్పగా చెబుతారు. సముద్రయానం చేశాడనే కారణంగా తిరిగి వచ్చిన తరువాత అదే హిందూ మతం వివేకానంద దేవాలయ ప్రవేశాన్ని అడ్డుకుంది.

ఇటీవలి కాలంలో ఆ మూఢ నమ్మకాన్ని సవరించుకొని పరిహారంగా కొన్ని క్రతువులు చేస్తే చాలని సరిపుచ్చుతున్నారు. ఎందుకంటే అనేక మంది స్వామీజీలు విదేశాల సందర్శన సరదాను అణచుకోలేకపోయారు. మడిని గట్టున పెట్టి వెళ్లారు. సముద్రం దాటిన వారు కులాన్ని కోల్పోతారని శాస్త్రాల్లో రాసి ఉంది మరి. ఎవరైనా కులం పోగొట్టుకున్నవారు ఉన్నారా? లేకపోగా విదేశాల్లో కూడా కుల గజ్జిని వ్యాపింప చేస్తున్నారు. దేశ పరువును గంగలో కలుపుతున్నారు. ఉన్న మతాలలో తాజాది ఇస్లాం గనుక ఆ మతం మీద ముల్లా “అగ్రహారికుల” ప్రభావం ఎక్కువగా ఉంది. వివాహం, విడాకులు, ఆస్తి హక్కులు, సంరక్షణ, దత్తత వంటి అంశాలు ఎంతో సున్నితమైనవి గనుక వాటిని సమానత్వ ప్రాతిపదికన, లింగవివక్ష లేకుండా ఎలా చట్టాన్ని రూపొందించాలన్నది పెద్ద ఎత్తున చర్చ జరగాలి. అన్ని మతాలూ మహిళను చిన్నచూపు చూసేవే, అణచేందుకు చూసేవే. అందువలన వారికి అనుకూలమైన ఏ చట్టం రూపొందాలన్నా చట్ట సభల్లో వారికి హక్కుగా ప్రవేశించే హక్కు కల్పించటం ముందుగా జరగాలి. అప్పుడే పితృస్వామిక సమాజ పెత్తనాన్ని చట్టబద్ధంగా కూడా అడ్డుగోగలరు. అనుమానాలను తొలగిస్తూ, విశ్వాసాన్ని పాదుకొల్పుతూ తేవాల్సిన ఏకరూప పౌరస్మృతిని బిజెపి కోరుకుంటున్నట్లుగా ఏకపక్షంగా రుద్దకూడదు.

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News