Thursday, January 23, 2025

రైతాంగాన్ని నిలువున మోసగించిన మోడీ సర్కారు

- Advertisement -
- Advertisement -

మేనిఫెస్టో అమలులో బిజెపి మోసం

మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయరంగాన్ని దెబ్బతీసే చర్యలు చేపడుతూ ప్రధాని మోడీ ప్రభుత్వం రైతాంగాన్ని నిలువునా మోసగించిందని తెలంగాణ రైతుసంఘం కార్యదర్శి మాడ్ శోభన్ ఆరోపించారు. గత మేనిఫెస్టో అమలులో బిజెపి మోసం చేసిందని ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని రైతులకు విజ్ణప్తి చేవారు. పియం ఫసల్ బీమా అమలు లేక 8 రాష్ట్రాలు ఉపసంహరణ చేశాయని , అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, చత్తీస్గడ్, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కెయం) పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన బిల్లులను ఆమోదించకపోవడం శోచనీయం అన్నారు. యంఎస్పి శాస్త్రీయంగా చట్టం రూపొందించడం, రైతుల రుణాలు రద్దుచేస్తూ తిరిగి రుణగ్రస్తులు కాకుండా చట్టం రూపొందించడం, కేంద్ర బడ్జెట్లో రైతులకు 4 శాతం వడ్డీ మాఫీ కింద రూ.19,550 కోట్లు కేటాయించినప్పటికీ పేదలకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం వంటివాటిని గుర్తు చేశారు.

కిసాన్ సమ్మాన్ పథకం 14.57 కోట్ల కుటుంబాలకు ఇవ్వాల్సి ఉండగా, 8 కోట్ల కుటుంబాలకే పరిమితం చేశారన్నారు. అందులో 5 ఎకరాలలోపు పేదలకు ఈ పథకాన్ని ఇవ్వడం లేదని, అర్హతగల అందరికీ ఇవ్వాలంటే 75 వేల కోట్లు కావాలని , కానీ పిఎం కిసాన్ కింద 60 వేల కోట్లే కేటాయించారని తెలిపారు. పెన్షన్ రైతులకు కూడా ఇస్తానని ఇంత వరకు అమలు చేయలేదన్నారు. 60 సంవత్సరాలు పైబడిన వారికి పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి ఇవ్వలేదన్నారు. పశు సంపద, మత్స్య సంపదను రూ.10 వేల కోట్లతో అభివృద్ధి చేస్తామని అమలు చేయలేదన్నారు. వ్యవసాయ పరిశోధనల విషయంలో కూడా దేశంలో పరిశోధనలను ఆపివేసి టెక్నాలజీని ఇతర దేశాల నుండి దిగుమతులు చేసుకుంటున్నారని ఆరోపించారు. వ్యవసాయోత్పత్తుల దిగుమతులు – 4 లక్షల కోట్లకు చేరాయని, వ్యవసాయోత్పత్తుల్లో వంటనూనెలు, చక్కెర, పత్తి, పప్పులు, మాంసం, కూరగాయలు, పండ్లు దిగుమతులు చేసుకుంటున్నామని , మన పంటల ఉత్పత్తిని తగ్గించారని ఆరోపించారు.

రైతులు పండించే పంటల ఉత్పాదకతను పెంచడానికి రూ. 25 లక్షల కోట్ల వ్యయం చేయడానికి కేటాయింపులు చేస్తానని హామి ఇచ్చిన ప్రధాని మోడీ ఇంతవరకూ అమలు చేయడం లేదన్నారు.దేశంలో 25 కోట్ల ఎకరాల భూమిని మైక్రో ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్ కిందికి తెస్తానని, ఆ ఇరిగేషన్ ద్వారా క్రిమిసంహారక మందులు, ఎరువులు చల్లడం అనుసంధానం చేస్తానని ప్రకటించి కేంద్ర ప్రభుత్వం వాటిని అమలు చేయలేదన్నారు.మొబైల్ యాప్‌ను ఏర్పాటు చేసి రైతులకు యంత్రాలు, కొనుగోలు అద్దె పద్ధతిపై ఏర్పాటు చేస్తానని చెప్పి ఇంతవరకూ అమలు చేయలేదన్నారు. యువ వ్యవసాయ శాస్త్రవేత్తలచే యాంత్రీకరణ, టెక్నాలజీ, డాటా విశ్లేషణ చేయించి రైతులకు అందజేస్తానని హామీ ఇచ్చి అమలు చేయలేదని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలు నివారిస్తానని ప్రకటించినప్పటికీ ఏటా దేశంలో 13 రాష్ట్రాలలో 10 నుండి 13 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నట్టు తెలంగాణ రైతుసంఘం కార్యదర్శి శోభన్ వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News