Monday, December 23, 2024

దక్షిణాదిపై హిందీ భాషను రుద్దే మోడీ సర్కారు కుట్రలను అంగీకరించం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి

హైదరాబాద్ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వ తీరు హిట్లర్‌ను మించిన నియంతృత్వ పోకడల వైపు వెళ్తోందని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి విమర్శించారు. దేశంపై ఉత్తరాది ఆధిపత్యాన్ని మరింత పెంచేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. దేశంపై హిందీ భాషను రుద్దేందుకు చాపకింద నీరులాగ ప్రయత్నాలు చేస్తోందని ఈ విషయం పార్లమెంట్ సాక్షిగా స్పష్టమైందని మండిపడ్డారు. పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ బిల్లులే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం అన్నారు. వీటి పేర్లను భారతీయ న్యాయ సంహిత, నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సక్ష్యగా పేర్కొంటూ కేంద్రం లోక్ సభలో బిల్లులు ప్రవేశపెట్టిందని వై సతీష్ రెడ్డి గుర్తు చేశారు.

ఇది ముమ్మాటికీ దేశం మీద, మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల మీద హిందీ భాషను రుద్దేందుకు చేస్తున్న ప్రయత్నమేనన్నారు. ఇప్పుడు న్యాయశాఖలో మొదలై మెల్లిగా ఒక్కో విభాగం పేర్లు హిందీలోకి మారుస్తూ.. ఆ తర్వాత అధికారిక కార్యకలాపాలన్నీ హిందీలోనే జరగాలంటూ ఉత్తర్వులిచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. ఇటీవలే ఢిల్లీలో జరిగిన అధికారభాష పార్లమెంటరీ కమిటీ 38 వ సమావేశంలోనూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా దీనికి మద్దతిచ్చేలా మాట్లాడారన్నారు. హిందీ భాషకు ఆమోదం తక్కువగా ఉన్నా అందరూ అంగీకరించాలని అమిత్ షా చెప్పారని, అన్ని రాష్ట్రాలు తమప్రాంతీయ భాషలతో పాటు హిందీని స్వాగతించాలంటూ ఆయన మాట్లాడారని గుర్తు చేశారు. ఇది హిందీయేతర రాష్ట్రాలను లొంగదీసుకునే ప్రయత్నం తప్ప మరొకటి కాదని సతీష్ రెడ్డి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అంగీకరించేది లేదన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన, అందరూ సులభంగా మాట్లాడగలిగిన అలాగే చదవగలిగి రాయగలిగిన భాషలో అధికారిక కార్యకలాపాలు ఉండాలని నిపుణులు చెబుతున్నారని, కానీ మోడీ ప్రభుత్వం మాత్రం.. అవేవీ పట్టించుకోకుండా హిందీ భాషను దక్షిణాది రాష్ట్రాలపై రుద్ది తమ ఆదిపత్యాన్ని చూపించుకోవాలని ప్రయత్నం చేస్తోందని సతీష్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ ఫెడరల్ స్పూర్తిని దెబ్బతీస్తూ.. రాష్ట్రాల అస్తిత్వాన్ని, స్థానిక భాషల గొప్పదనాన్ని అణచివేయాలనేది కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కారు కుట్రగా కనిపిస్తోందన్నారు. హిందీని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తే 1965 నాటి హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని మరోసారి చవిచూడాల్సి వస్తుందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News