Wednesday, January 22, 2025

రైతులపై మోడీ ప్రభుత్వం క్రూరమైన అణచివేతకు పాల్పడుతోంది

- Advertisement -
- Advertisement -

సిపిఐ జాతీయ కార్యదర్శి డా. కె. నారాయణ

మన తెలంగాణ/హైదరాబాద్ : తమ పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దులలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై మోడీ ప్రభుత్వం క్రూరమైన అణచివేతకు పాల్పడుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి డా. కె. నారాయణ తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతుల బాధల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రైతుల నిరసనకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వ భారీ పోలీసు-సైనిక అణిచివేతను నిరసిస్తూ హైదరాబాద్, ట్యాంక్ బండ్, అంబేడ్కర్ విగ్రహం వద్ద సోమవారం సిపిఐ భారీ ప్రదర్శన నిర్వహించింది. సిపిఐ శ్రేణులు ఎర్ర జండాలు, ప్లకార్డులు చేతబూని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేస్తూ, ఆందోళనలు చేస్తున్న రైతు సమాజానికి సంఘీభావం తెలిపారు.

ఈ ప్రదర్శనలో డా. కె. నారాయణతో పాటు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్యపద్మ, కలవేణి శంకర్, ఎన్. బాలమల్లేష్, ఈ.టి. నరసింహ, సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎస్. ఛాయా దేవి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాల్మాకుల జంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా డా. కె. నారాయణ మాట్లాడుతూ రైతుల ఆందో ళనను అణిచివేయాలని మోడీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకుసాగుతుందని, పోలీసులతో పాశవికంగా దాడులు చేయిస్తూ హత్యాకాండ ను సృష్టిస్తుందని ఆరోపించారు. పంజాబ్- హర్యానా సరిహద్దులో నిరసన తెలుపుతున్న రైతుపై జరిగిన పోలీస్ కాల్పుల్లో శుభకరన్ సింగ్ అనే రైతు మృతి ఘటనపై కేంద్ర ప్రభుత్వంపై హత్య కేసు నమోదు చేయాలని అయన డిమాండ్ చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న ప్రధాని మోడీ తప్పుడు వాగ్దానాలు చేసి, రైతులను విశ్వాసంలోకి తీసుకోకుండా రైతు వ్యతిరేక చట్టాలను ప్రయోగించి బడా వ్యాపారులకు వ్యవసాయాన్ని అప్పగించే ప్రయత్నాలను కేంద్ర బిజెపి ప్రభుత్వం చేస్తుందని పేర్కొన్నారు. పంటలకు కనీస మద్దతు ధరపై కేంద్రం చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించకుంటే దేశ వ్యాప్తంగా ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని డా. కె. నారాయణ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రైతులను తీవ్రంగా నష్టపరిచే వివాదాస్పద వ్యవసాయ చట్టాలు తీసుకురావడంపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతులు మునుపెన్నడూ లేని విధంగా కష్టాల్లో కూరుకుపోతున్నందున తమ సమస్యల పరిష్కరానికి ఆందోళనలు నిర్వహిస్తున్నారని, రైతుల బాధల పట్ల మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు.

స్వామినాథన్ కమీషన్ సిఫార్సుల అమలు, రైతులు మరియు రైతు కూలీలకు పెన్షన్, పోలీసు కేసుల ఉపసంహరణ మరియు 2021 లఖింపూర్ ఖేరీ హింసాకాండ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రదర్శనలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారి, సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు, ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి బి. వెంకటేశం, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్. అంజయ్య నాయక్, సిపిఐ హైదరాబాద్ జిల్లా సహాయ కార్యదర్శులు కమతం యాదగిరి, బి. స్టాలిన్, కార్యవర్గ సభ్యులు నిర్లేకంటి శ్రీకాంత్, జి. చంద్రమోహన్ గౌడ్, ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, మేడ్చల్ జిల్లా సిపిఐ నేతలు జె.లక్ష్మి, ఉమామహేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News