Friday, December 20, 2024

ఎన్నికల్లో ఓపెన్ రిగ్గింగ్ కు మోడీ సర్కారు కుట్ర

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి

హైదరాబాద్ : కేంద్రంలోని బిజెపి సర్కారు రాబోయే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఓపెన్ రిగ్గింగ్ కు ప్రయత్నాలు చేస్తోందని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి ఆరోపించారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన కేంద్ర ఎన్నికల కమిషన్ ను నరేంద్రమోడీ సర్కారు పూర్తిగా తమ జేబు సంస్థగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర కమిషనర్ల నియామక విధివిధానాలకు సంబంధించిన బిల్లులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరు లేకపోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న తాత్కాలిక కమిటీలో భారత ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్నారని.. కానీ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లులో మాత్రం.. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రస్తావన లేకుండా కేంద్రమంత్రి ఉంటారని చెప్పడం.. ఎన్నికల వ్యవస్థను కబ్జా పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నమేనని దుయ్యబట్టారు.ముగ్గురు సభ్యుల కమిటీలో ఇద్దరు ప్రభుత్వంలోని వ్యక్తులే ఉంటే.. తమకు అనుయాయులైన వాళ్లను చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా, స్టేట్ ఎలక్షన్ కమిషనర్లుగా నియమించుకునే అవకాశం ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు.

వాళ్ల మనుషులే అధికారులుగా ఉంటే.. రిగ్గింగ్ చేసినా, ఈవీఎంలలో డేటా మార్చినా, చివరకు ఫలితాలను తారుమారు చేసి ప్రకటించినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. తద్వారా నరేంద్రమోడీ శాశ్వతంగా ప్రధానమంత్రిగా ఉండాలని, బిజెపినే అధికారంలో ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. గతంలో సుప్రీంకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్య్రంగా పనిచేయాలంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకం కోసం ఏర్పాటు చేసే కమిటీలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఉండాలనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు గతంలో చెప్పిందన్నారు. ఇప్పటికే స్వతంత్రంగా పనిచేయాల్సి సిబిఐ,ఈడి ,ఐటి వంటి విచారణ సంస్థలు.. కేంద్రంలోని మోడీ సర్కారు పెంపుడు జంతువులుగా మారిపోయాయనే అపవాదును మూటగట్టుకున్నాయన్నారు. ప్రజాస్వామ్య పునాదులపై ఏర్పడిన భారతదేశాన్ని నరేంద్రమోడీ సర్కారు నియంతృత్వం వైపు నడిపిస్తోందని.. ఇది ఎంతమాత్రం సబబు కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే బిల్లును సవరించి.. సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి పేరును కూడా కమిటీలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News