Tuesday, December 3, 2024

అంతరిక్ష పరిశోధనకు భారీ ప్రోత్సాహం

- Advertisement -
- Advertisement -

కేంద్ర కేబినెట్ గగన్‌యాన్, చంద్రయాన్ మిషన్ల విస్తరణకు అత్యధికంగా నిధులు కేటాయిస్తూ ఆమోదించడం భారత అంతరిక్ష పరిశోధనలో ఒక ముందడుగు. రూ. 2,104 కోట్లతో చేపట్టే చంద్రయాన్ 4 ద్వారా 2040 నాటికి చంద్రుని పైకి భారతీయ వ్యోమగాములను పంపించి అక్కడి మట్టిని, శిలలను పరిశోధన కోసం భూమిపైకి తీసుకురావాలన్నదే ఈ మిషన్ లక్షం. భూమి దిగువ కక్షలో 30 టన్నుల పేలోడ్‌లను ఉంచేలా ‘తదుపరి తరం లాంచ్ వెహికల్ (ఎన్‌జిఎల్‌వి) ‘సూర్య’ అభివృద్ధికి రూ. 8,240 కోట్లు ప్రత్యేకంగా కేటాయిస్తున్నారు. ఇస్రో లాంచ్ వెహికల్ మార్క్ 3 కంటే మూడు రెట్లు అధికంగా పేలోడ్‌ను ఇది మోసుకెళ్లగలదు. మార్క్3 తో పోలిస్తే ఖర్చు మాత్రం కేవలం 50 శాతమే పెరుగుతుంది.

ఇదే విధంగా వీనస్ ఆర్బిటర్ మిషన్ ద్వారా శుక్రగ్రహాన్ని అధ్యయనం చేయనున్నారు. దీని కోసం రూ. 1,236 కోట్లు కేటాయించారు. చంద్రయాన్4 మిషన్‌కు పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీనే ఉపయోగిస్తారు. చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కావడంతో చంద్రయాన్ 4ను ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. అంతరిక్షంలో సొంతంగా ‘భారతీయ అంతరిక్ష కేంద్రం’ నిర్మించుకోవాలన్న ఆసక్తిని చూపిస్తోంది. గగన్‌యాన్‌లో భాగంగా 2028 డిసెంబర్ నాటికి ఎనిమిది మిషన్లు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్షం గా పెట్టుకుంది. గగన్‌యాన్‌కు రూ. 20,193 కోట్లు కేటాయించింది. ఈ కార్యక్రమం విస్తరణ కోసం అదనంగా రూ. 11,170 కోట్లు కేటాయించింది. ఇంత ప్రాధాన్యం ఇవ్వడం భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఇదే మొదటిసారి. అంతరిక్ష పరిశోధనలో మన దేశం అనేక విజయాలు సాధించగలిగింది.

ఒకేసారి అనేక ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టిన ఘనతను కూడా సాధించింది. మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట నిర్మాణం నుంచి ఎన్నో ఉపగ్రహాలను రూపొందించింది. 2014 లో మంగళయాన్ ద్వారా కుజ కక్షలోకి ఉపగ్రహాన్ని పంపించగలిగింది. 2016 లో సెప్టెంబర్‌లో ఒకే రాకెట్ ద్వారా అనేక ఉపగ్రహాలను రెండు వేర్వేరు కక్షల్లో ప్రవేశపెట్టింది. 2017లో ఒకే యాత్రలో 104 ఉపగ్రహాలను భారత్ అంతరిక్షంలోకి ప్రవేశపెట్టగలిగింది. ఈ విధంగా చేసిన మొట్టమొదటి ఆసియా దేశంగా ఖ్యాతి సాధించింది. 2008 అక్టోబర్ 22న ప్రయోగించిన చంద్రయాన్ 1 చంద్రుడి ఉపరితలానికి 100 కిలోమీటర్ల దూరంలోని ఆ గ్రహ కక్షలో పరిభ్రమిస్తూ చేపట్టిన పరిశోధనలో చంద్రునిపై నీరు ఉన్నట్టు వెల్లడించింది. అయితే రెండేళ్ల పాటు చంద్రభ్రమణం చేయడానికి ఆ యాత్ర సంకల్పించినప్పటికీ, ఆ వ్యోమనౌకతో భూమికి సంబంధాలు తెగిపోవడంతో ఏడాదికే దాని చరిత్ర ముగిసిపోయింది.

2019 జులై 22 న చంద్రయాన్ 2 చంద్రుని పైకి దూసుకు వెళ్లినా పాక్షికంగా విఫలమైంది. ఆ ఏడాది సెప్టెంబరు 7 న చంద్రుడిపైకి దిగే సమయంలో దాని ల్యాండర్ భూమితో సంబంధాలను కోల్పోయింది. అయితే చంద్రయాన్ 3 మాత్రం విజయవంతమై దీనిని సాధించిన నాల్గవ దేశంగా భారత్ విశేష ఖ్యాతిని సాధించుకుంది. భారత్ కన్నా ముందు అమెరికా, రష్యాలు చంద్రుడి మీదకు విజయవంతంగా వెళ్లగలిగాయి. మొట్టమొదటిసారిగా అమెరికా నుంచి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ 1969లో చంద్రుడిపై కాలు మోపగలిగారు. చంద్రుని ఉపరితలంపై కొన్ని గంటలు ఆయన నడవగలిగారు. ఆయనే కాకుండా మరికొంతమంది అమెరికన్ వ్యోమగాములు చంద్రుడిపై వెళ్లగలిగారు. చైనా, రష్యాలు భారీగా వెచ్చించి చంద్రయాత్రలను చేపట్టగా, భారత్ మాత్రం పరిమిత వ్యయంతోనే చంద్రయాన్ 3 యాత్రను విజయవంతం చేయడం ప్రత్యేకించి చెప్పుకోదగిన విశేషం.

ఎంతో పటిష్టంగా నిర్మించిన ఎల్‌విఎం 3 ఎం4 రాకెట్ చంద్రయాన్ 3 ని భూకక్షలో విజయవంతంగా చేర్చగలిగింది. చిమ్మచీకటిలో ఉండే చంద్రగ్రహ దక్షిణ ధ్రువంలోని ప్రత్యేక లక్షణాలపై పరిశోధనలు చేపట్టింది. ఇదే స్ఫూర్తితో ఇప్పుడు చంద్రయాన్ 4 మిషన్‌కు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. చంద్రుడిపై అత్యంత విలువైన ఖనిజ వనరులు ఉన్నాయని అమెరికా, చైనా దేశాలు చెబుతున్నాయి. చంద్రుని అవతలి వైపు పరిశోధనలు సజావుగా చేపట్టిన చైనా 2030 నాటికి మనుషులతో కూడిన అంతరిక్ష నౌకను చంద్రుడిపైకి పంపిస్తానని ప్రకటించింది. భారత్ దేశం కూడా అంతరిక్ష పరిశోధనల్లో తన సామర్ధాలు ఏమాత్రం తక్కువ కావని ఇస్రో అనేక సార్లు నిరూపించింది. ఇప్పుడు చంద్రయాన్ 4 విజయవంతమైతే ప్రపంచ అంతరిక్ష పరిశోధనల దేశాల సరసన భారత్ నిలబడగలుగుతుంది. అందుకనే ఈసారి కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష పరిశోధనలకు భారీగా నిధులు కేటాయించింది. నిధులు కేటాయించడమే కాదు కొన్ని లక్షాలను నిర్దేశించింది. స్వయం సామర్ధంతో ఈ మిషన్లు చేపట్టడం మన దేశానికి గర్వకారణం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News