కేంద్రం ముందు అఖిలపక్షం డిమాండ్లు
జమ్మూ కశ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలి
వెంటనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి
స్థానికులకు భూమిపై గ్యారంటీ కల్పించాలి
కశ్మీరీ పండిట్లకు పునరావాసం అత్యవసరం
రాజకీయ ఖైదీల విడుదలకు ఆదేశాలు
కశ్మీరీ యువతలో అశాంతి తొలిగించాలి.
తిరిగి రాష్ట్ర హోదాకు సుముఖత
ఎన్నికల ప్రక్రియ వేగవంతం
డిలిమిటేషన్‌పై అందరి సహకారం
ప్రధాని నివాసంలో అఖిలపక్షం
8 పార్టీల నుంచి 14 మంది నేతలు
మాజీ సిఎంలు, డిప్యూటీ సిఎంలు
మోడీతో సీనియర్ అబ్దుల్లా ఇష్టాగోష్టి
ఇంటి చెర తరువాత తొలిసారి
న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌లో ప్రజాస్వామ్యపు మూలపుటేళ్లను బలోపేతం చేయడమే కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతాక్రమం అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఇన్నేళ్ల రాజకీయ స్తబ్థత వీడేదిశలో గురువారం ప్రధాని నివాసంలో జమ్మూ కశ్మీర్ నేతలతో కీలక అఖిలపక్ష భేటీ జరిగింది. మొత్తం 8 పార్టీల నుంచి 14 మంది నేతలు దాదాపు 3 గంటల పాటు జరిగిన సమావేశానికి హాజరయ్యారు. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ అంశం కీలకంగా పలువురు ప్రముఖ నేతలతో ఇప్పుడు జరిపింది కేవలం ఇష్టాగోష్టి అని, ఈ సందర్భంగా పలు ఇతర విషయాలు ప్రస్తావనకు వచ్చాయని అధికారవర్గాలు తెలిపాయి. రాష్ట్ర హోదా తిరిగి కల్పించడానికి ప్రధాని మోడీ సానుకూలమైన రీతిలో స్పందించారని అఖిలపక్ష సమావేశం తరువాత జమ్మూ కశ్మీర్‌కు చెందిన నేతలు తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కశ్మీర్ రాష్ట్రం పోయి యుటిలుగా విభజన జరిగిన తరువాత పలువురు నేతల నిరసనలు, వారి గృహ నిర్బంధాల తరువాతి విడుదల ప్రక్రియల అనంతరం ఇప్పుడు జరిగిన కీలక భేటీకి జమూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు.
జమ్మూ కశ్మీర్ సమగ్రాభివృద్ధికి, సర్వతోముఖ ప్రగతికి ఇప్పటి అఖిలపక్ష భేటీ కీలకమైన ముందడుగు అని ప్రధాని మోడీ ఆ తరువాత విలేకరులకు తెలిపారు. అయితే దీని కన్నా ప్రధానంగా తాము రాష్ట్ర హోదా అంశాన్ని ప్రస్తావించామని, కశ్మీర్ విభజన విషయంలో తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం తమకు బాధ కల్గించిందని ప్రధానికి తాము నిర్మొహమాటంగా తెలిపామని ఆ తరువాత మాజీ సిఎం, పిడిపి అధినేత్రి మెహబూబా ముఫ్తీ విలేకరులకు చెప్పారు. ఈ కీలక భేటీలో ప్రధానికి కేంద్రం తరఫున హోం మంత్రి అమిత్ షా సహకరించారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా హాజరయ్యారు. విభజన ప్రక్రియ ఇకపైజమ్మూ కశ్మీర్‌లో జరిగే ఎన్నికలకు నియోజకవర్గాల పునర్విభజన అత్యంత కీలకమని, ఈ దిశలో అన్ని పార్టీలూ సహకరిస్తే ఏర్పడే ప్రభుత్వం ప్రగతి దిశలో కీలక పాత్రపోషిస్తుందని కేంద్రం తరఫున అమిత్ షా ప్రతిపక్ష నేతలకు తెలిపారు. డిలిమిటేషన్‌గా వ్యవహరించే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో ఏకాభిప్రాయ సాధన కీలకమనే విషయాన్ని ప్రధాని మోడీ ఈ సందర్భంగా నేతలకు తెలిపారు.
ప్రజాస్వామ్యమే మనకుండే బలం
ప్రజాస్వామ్య ప్రక్రియనే మనకున్న బలం అని, దీనిని మరింతగా పెంచుకోవల్సి ఉందని ప్రధాని తెలిపారు. ఇందుకు అన్ని పార్టీలూ ఒకే వేదికపైకి వచ్చి అన్ని విషయాలను కూలంకుషంగా చర్చించుకోవల్సి ఉంది. ఇప్పు డు ఇందులో తొలి అడుగుగా ఈ భేటీ ఏర్పాటు చేశామని ప్రధాని తెలిపారు. జమ్మూ కశ్మీర్ ప్రజలు ప్రత్యేకించి యువత రాజకీయ నాయకత్వాన్ని అందిపుచ్చుకోవల్సి ఉంది. వారి ఆకాంక్షలను మనం పూర్తిగా సాకారం చేయా ల్సి ఉందన్నారు. 2019 ఆగస్టు 5 తరువాత నేతలతో కీల క భేటీ జరగడం ఇదే తొలిసారి కావడంతో దీనికి జాతీయ స్థాయి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. 2019లో కేంద్రం జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసింది. రెండు యుటిలుగా విభజించింది. మాజీ సిఎంలు ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్ నేత) కాంగ్రెస్ ప్రముఖ నాయకులు గులాం నబీ ఆజాద్, పిడిపి చీఫ్ మెహబూబా ముఫ్తీ , నలుగురు మాజీ డిప్యూటీ సిఎంలు, కాంగ్రెస్‌కు చెందిన తారాచంద్, పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత ముజఫర్ హుస్సేన్ బేగ్ హాజరుకాగా, బిజెపి నుంచి నిర్మల్ సింగ్, కవీందర్‌గుప్తా వచ్చా రు. సిపిఎం తరఫున మెహమ్మద్ యూసుఫ్ తరిగామి, జమ్మూ కశ్మీర్ అప్నీ పార్టీ (జెకెఎపి) నేత అల్తాఫ్ బుఖారీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ ప్రతినిధి సజ్జద్‌లోనే, జెకె కాంగ్రెస్ అధ్యక్షులు జిఎ మీర్, బిజెపికి చెందిన రవీందర్ రైనా, పాంథర్స్ పార్టీ నేత భీమ్‌సింగ్ ప్రతిపక్ష బృందంలో ఉన్నారు.
కేంద్రం నిర్దయ : ముఫ్తీ
జమ్మూ కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాను దౌర్జన్యంగా హరించివేశారని తాము ప్రధానికి తెలిపినట్లు పిడిపి అధినేత్రి మెహబూబా ముఫ్తీ తెలిపారు. ప్రజలు కేంద్రం నిర్ణయం పట్ల తీవ్ర నిరాశ, కోపంతోనే ఉన్నారని అన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ పరిస్థితులు దారుణంగానే ఉన్నాయని తాను ప్రధానికి చెప్పానని వివరించారు. రాష్ట్ర హోదాను వెంటనే ఇచ్చేస్తే తిరిగి రాజకీయ గాడి సక్రమం అవుతుందని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ముందు కేంద్రం ప్రజల విశ్వాసాన్ని తిరిగి సంపాదించుకుని తీరాలని తాను ప్రధానికి తేల్చిచెప్పినట్లు సీనియర్ నేత డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. ఆర్టికల్ 370 తిరిగి దక్కించుకుంటామని, ఈ విషయంలో రాజీ లేదని, కశ్మీర్ కోల్పోయిన వాటన్నింటిని తిరిగి దక్కించుకుంటామని ఆయన ఆ తరువాత విలేకరులకు తెలిపారు. ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. వారిలో ఈ పరిస్థితి పోవల్సి ఉంది. జాతీయ జనజీవన స్రవంతిలో వీరు మమేకం కావడానికి ముందు కేంద్రం నుంచి ఈ దిశలో చర్యలు అత్యవసరం. కశ్మీరీల హృదయాలలో అన్ని విషయాలపై నమ్మకాలు కల్పించాల్సి ఉందన్నారు. ఇప్పుడు జరిగిన అఖిలపక్ష భేటీలో రాష్ట్ర హోదాకు కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు వచ్చినట్లు ప్రతిపక్ష నేతలు తెలిపారు. అయితే కేంద్రం నుంచి దీనిపై నిర్థిష్ట ప్రకటన వెలువడలేదు. కేవలం దీనిపై అంతా కలిసి చర్చించుకున్నామని కేంద్రం తరఫున అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర హోదా పునరుద్ధరణకు కేంద్రం కట్టుబడి ఉందని, మోడీ కూడా సానుకూలంగా ఉన్నారని అమిత్ షా చెప్పారని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ వివరించారు. రాష్ట్ర హోదా, ప్రజాస్వామ్య పునరుద్ధరణ, రాజకీయ ఖైదీల విడుదల, కశ్మీరీ పండిట్ల పునరావాసం వంటి అంశాలను ప్రస్తావించానని చెప్పారు.