తెలంగాణలో మార్పు ఖాయం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మార్పు తప్పకుండా వస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. ఈక్రమంలో శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులని, వారు అన్నీ గమనిస్తున్నారన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలు అనుకున్న వారినే గెలిపించారని, ఎన్నికలలో రాజకీయ పార్టీలు వందల కోట్లు ఖర్చు చేసినా సరే ప్రజలు అనుకున్న వారికే ఓట్లు వేస్తారన్నారు. బిజెపిపై ఎంత విషం చిమ్మినా ప్రజలు ఆదరిస్తారని, సిద్ధాంతపరంగా కుటుంబ రాజకీయాలకు బిజెపి వ్యతిరేకమన్నారు. బిజెపిపై ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరని వచ్చే ఎన్నికలలో ప్రజలు బిజెపికే పట్టం కడతారని జోస్యం చెప్పారు. బిజెపిలో అధ్యక్షుడికి రెండు దఫాలుగా మాత్రమే అవకాశం ఉంటుందని, జెపి నడ్డా, ప్రధాని మోదీ తరువాత వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులు ఎవరూ ఉండరన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఏం ఇవ్వకుండానే ఇంత అభివృద్ధి సాధ్యమైందా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఎస్‌సి వర్గీకరణకు కేంద్రం కట్టుబడి ఉందని, సుప్రీంకోర్టులో కేసులతో వర్గీకరణ అలస్యం అవుతోందన్నారు.