స్టాలిన్ ప్రస్తుత కథానాయకుడు అయినప్పటికీ..హీరో రేవంత్ రెడ్డి
డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా జరిగిన సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం మద్దతు
ప్రతి రాష్ట్రానికి పార్లమెంట్ లో బలమైన ప్రాతినిధ్యం ఉండాలి
అమిత్ షా వంటి వ్యక్తులతో సమస్యలు పరిష్కారం కావు
తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు
మన తెలంగాణ / హైదరాబాద్ : అన్ని రాష్ట్రాలతో చర్చించాకే కేంద్రం డీలిమిటేషన్‌పై ముందుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు అన్నారు. ఈ విధానం ద్వారా దక్షిణాదిలో రాష్ట్రాల భాగస్వామ్యం పెరగాలి కానీ తగ్గకూడదని ఆశించారు. పార్లమెంటు ఆమోదంతోనే చట్టం చేయాలి తప్ప మొండిగా ముందుకు వెళ్లకూడదని పేర్కొన్నారు. ఇది సీట్ల గురించి పోరాటం కాదని, పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత ఉండాలన్నదే అభిప్రాయమని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు.
డీలిమిటేషన్ అంశంపై చర్చలు జరుగుతున్నాయన్నారు. పార్లమెటులో చట్టం ఆమోదం పొందాకే కేంద్రం డీలిమిటేషన్ చేయాలన్నారు. పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం ఇంకా పెరగాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. కొన్ని రాష్ట్రాలు కేవలం సీట్లు గురించి మాత్రమే పోరాడటం లేదని, పార్లమెంటులో తమ గళానికి ప్రాధాన్యత ఉండాలని అంటున్నాయని కేకే అన్నారు. ఈ అంశంపై దక్షిణాది నేతలు అంతా ఒక్కటి కావాలని, లేదంటే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని కేకే వెల్లడించారు. జనాభా ప్రకారం నియోజక వర్గాల పునర్విభజన చేయాలని కేంద్రం ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా ఆదాయం ఎక్కువ, జనాభా తక్కువగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలు ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయన్నారు.
స్టాలిన్ ప్రస్తుత కథానాయకుడు అయినప్పటికీ…హీరో రేవంత్ రెడ్డే : డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తూ చెన్నైలో జరిగిన సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతును ప్రకటించిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు తెలిపారు. డీలిమిటేషన్ వ్యవహారంలో ప్రస్తుత కథానాయకుడు స్టాలిన్ అయినప్పటికీ..హీరో మాత్రం రేవంత్ రెడ్డేనని అన్నారు. హైదరాబాద్‌లో సభ పెడతామని చెప్పడం దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కీలక పరిణామమని చెప్పారు. ఈ సభ రాజకీయ అజెండాను మలుపు తిప్పే అవకాశం ఉందని అన్నారు.
డీలిమిటేషన్ అనేది కేవలం పార్లమెంట్ సీట్ల పెంపు గురించి మాత్రమే ఉండకూడదని అన్నారు. జనాభా గణన జరిగిన తర్వాత ప్రతిసారి ఇదే వివాదం తెరపైకి వస్తుందని చెప్పారు. పార్లమెంట్ లో ప్రతి రాష్ట్రానికి బలమైన ప్రాతినిధ్యం ఉండాలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫెడరలిజాన్ని పూర్తిగా మర్చిపోయారని విమర్శించారు. స్టేట్ లిస్ట్ ను తగ్గించి, సెంట్రల్ లిస్ట్ ను పెద్దది చేశారని మండిపడ్డారు. దీని ఫలితంగా రాష్ట్రాల హక్కులు తగ్గిపోతున్నాయని చెప్పారు. జమ్మూ కశ్మీర్, అసోం వంటి ప్రాంతాల్లో సీట్లను పెంచే ప్రయత్నం చేస్తున్నారని, దక్షిణాదికి అన్యాయం జరిగేలా అడుగులు వేస్తున్నారని కేకే మండిపడ్డారు. అమిత్ షా వంటి వ్యక్తుల మైండ్ సెట్ తో సమస్యలు పరిష్కారం కావని చెప్పారు.