Wednesday, February 26, 2025

మూసీ ప్రక్షాళనలో మొదటి తట్ట నేనే ఎత్తుతా

- Advertisement -
- Advertisement -

రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నానన్నది
పూర్తిగా అవాస్తవం మెట్రోకు
నిధులు, ప్రణాళికలు ఇచ్చిందే నేను
రీజినల్ రింగ్‌రోడ్డు తెచ్చిందే నేను
అధిష్ఠానం మెప్పుకోసమే నాపై రేవంత్
ఆరోపణలు : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అభివృద్ధిని తాను అడ్డుకుంటున్నానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణ పూర్తిగా అవాస్తవమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఖండించారు. హైదరాబాద్‌లో మెట్రోకు నిధులు, ప్రణాళికలు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మెట్రో నిర్మాణం చేయదలిస్తే కేంద్రం, తాను ఎందుకు అడ్డుకుంటామని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్టు నిర్మాణం చేస్తే తమకు అడ్డుకోవాల్సిన అవసరం ఏముంటుందని అన్నారు. రాష్ట్రానికి అవసరమైన కేంద్ర సహాయం, సహకారం ఎప్పుడూ అందిస్తున్నామని, తాము అడ్డుకోవాల్సిన అవసరమే లేదని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మంగళవారం రాష్ట్ర బిజెపి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ధ్వజమెత్తారు.

మూసీ ప్రక్షాళనకు తాను వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తాను అడ్డుకుంటున్నానన్నది పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. సిఎం స్థాయి వ్యక్తి బీజేపీని, తనను విమర్శిస్తూ కాంగ్రెస్ అధిష్టానం మెప్పుకోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ ఆరోపణలు, విమర్శలు దానిలో భాగమేనని పేర్కొన్నారు. ఒక్క సీటులోనే పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 14 నెలలుగా మాట్లాడిన మాటలే ఈ ప్రచారంలోనూ ప్రసంగించారని అన్నారు. సిఎం మాటలను విద్యావంతులు పట్టించుకోరని అన్నారు. తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఆయన అసమర్థతను తమపై రుద్దుతున్నారని అన్నారు. కేంద్రం ఆధ్వర్యంలో రీజినల్ రింగ్ రోడ్డును తీసుకువచ్చామని గుర్తు చేశారు. నీటి వివాదాలపై సమిష్టిగా నిర్ణయం తీసుకోవాలని ఆ దిశగా సమస్యను పరిష్కరించుకోవాలని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా విమర్శలు చేయడం వల్లనే తాను ఇంత గట్టిగా జవాబివ్వాల్సి వస్తోందని అన్నారు. కేంద్రమంత్రి హోదాలో ఉన్న తనను పట్టుకొని తెలంగాణకు అడ్డుపడ్డ వ్యక్తి అంటూ మాట్లాడటం రేవంత్ దిగజారుడు తనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫోన్ ట్యాపింగ్ మీరు విచారిస్తారా.? సీబీఐకి అప్పజెపుతారా.?

ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వాలని బీజేపీ కోరిందని కిషన్‌రెడ్డి తెలిపారు. అలాంటప్పుడు తాము ఎందుకు అడ్డుకుంటున్నామని నిలదీశారు. నిందితులు ఎవరి హయాంలో విదేశాలకు వెళ్లారో చెప్పాలని నిలదీశారు. ఇతరదేశాల నుంచి నిందితులను తీసుకురావాలంటే ఎన్నో నియమ నిబంధనలు ఉంటాయని అన్నారు. 1996 నుంచి పోరాటం చేస్తుంటే అనేక సంవత్సరాల తర్వాత బాంబు పేలుళ్ల నిందితులను అమెరికా కోర్టు ఇప్పటికి అనుమతించిందని తెలిపారు. ఒక సీఎం స్థాయి వ్యక్తి పరిపాలనపై అవగాహన లేకుండా ఈ రకమైన మాటలతో నవ్వుల పాలు కావొద్దని కిషన్‌రెడ్డి హితవు పలికారు. ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగిస్తే తేల్చే బాధ్యత తమదేనని అన్నారు. కాళేశ్వరం, ఔటర్ రింగ్ రోడ్డు, ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోలు, భూముల కొనుగోలు, మేడిగడ్డల మీద అధికారంలో రాకముందు విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ, వచ్చాక మాట మార్చి తప్పుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి విధానాలను కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి విమర్శించారు. చేతనైతే దర్యాప్తు చేసి శిక్షించాలని, లేదంటే సీబీఐకి అప్పజెప్పాలని అన్నారు.

యూరియాకు కొరతే లేదు

తెలంగాణలో ఎరువుల కొరత ఉందని పత్రికల్లో వచ్చిన వార్తలపై కిషన్‌రెడ్డి స్పందిస్తూ దీనిపై వెంటనే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి జేపీ నడ్డాతో మాట్లాడానని అన్నారు. కేంద్రం స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దాని కంటే ఎక్కువ కోటా విడుదల చేసినట్లు తెలిపిందని అన్నారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత కారణంగానే కొంతమంది వ్యాపారస్థులు కృత్రిమ కొరత సృష్టించే చర్యలకు పాల్పడుతున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఎరువుల కొరతనే లేదని అధికారులు చెబుతున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా యూపీఏ హయాంలో యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలించేవారని అన్నారు. కానీ మోదీ ప్రభుత్వంలో ఇలాంటి వ్యవస్థలపై ఉక్కుపాదం మోపారని తెలిపారు. రాష్ట్రానికి 9.5 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమైతే 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా పంపామని కేంద్రం పేర్కొందని తెలిపారు. దేశీయంగా 90 శాతం యూరియాను ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకున్నామని అన్నారు.

రామగుండంలో కూడా ఉత్పత్తిని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. పదేళ్లుగా దేశంలో ఎక్కడా ఎరువుల కొరత లేకుండా కేంద్రం చర్యలు తీసుకుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంకా 1.22 లక్షల టన్నుల యూరియా లెక్కల్లో ఉందని అన్నారు. ఇదిగాక ఆరు వేల టన్నులు కృష్ణపట్నం పోర్టు నుంచి ఆదిలాబాద్‌కు, కాకినాడ నుంచి తెలంగాణకు తీసుకువచ్చేందుకు ప్రణాళిక చేశామన్నారు. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే అత్యధికంగా తెలంగాణకు కేంద్రం ఎరువుల సరఫరా చేస్తుందన్నారు. యూరియాను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అందుబాటులో ఉంచామన్నారు. వీటిని సరఫరా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉన్న ఎరువులను సమర్థవంతంగా రైతులకు ఇబ్బంది లేకుండా పంపిణి చేయాలన్నారు.

31 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ పథకం లబ్ది

అనేక అడ్డంకులు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు ఉన్నా ఠంఛన్ గా పీఎం కిసాన్ నిధులు కేంద్రం మంజూరు చేస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు. దేశంలో రైతాంగానికి అండగా నిలబడ్డ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వమని అన్నారు. సోమవారమే పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాల్లో వేశారని పేర్కొన్నారు. సంవత్సరానికి మూడుసార్లు ఒక్కరోజు ఆలస్యం గాకుండా ప్రతీ రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు. వందకు వందశాతం రైతుల పంట ఉత్పత్తులు పెంపుదలకు, ఎరువులు, విత్తనాలు, సాగు ఖర్చుకు బ్యాంకుల చుట్టూ వెళ్లకుండా ఈ నిధులు ఉపయోగపడుతున్నాయని ఆయన తెలిపారు. 19వ విడత డబ్బులు 9.08 కోట్ల మంది అకౌంట్లలో రూ. 22 కోట్లు జమ చేశామని అన్నారు. దీనిద్వారా తెలంగాణలో 31 లక్షల మంది రైతులు లబ్ధి పొందారన్నారు. డైరెక్టర్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ కింద పీఎం కిసాన్ సన్మాన్ నిధి డబ్బులు అందజేస్తున్నామని వివరించారు.

మేధావులు, విద్యావంతుల గొంతుక బిజెపి

పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించిన ప్రచారం కొద్దిసేపట్లో ముగియనుందని అన్నారు. ఎన్నికల్లో బీజేపీ ఓటర్లను వ్యక్తిగతంగా కలిసేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. ఆ విధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, కింది స్థాయిలోని ఓటర్లను కలిసే కార్యక్రమాలను చేపట్టామన్నారు. చట్టసభల్లో ఉపాధ్యాయులు, పట్టభద్రల సమస్యలు వినిపించే వారికే ఓటు వేసి గెలిపించాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శాసనమండలిలో వారి గుండెచప్పుడుగా మారి వారి గొంతుకను బీజేపీ వినిపిస్తుందన్నారు. మూడు సీట్లలో ఒక్క సీటులోనే కాంగ్రెస్ పోటీ చేస్తుందన్నారు. మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు ఎవరినో ఒకరిని ఎన్నుకుంటే లాభం లేదన్నారు. శాసనమండలిలో ప్రశ్నించే గొంతుకలు, ప్రభుత్వాలను నిలదీసే సత్తా ఉన్న ఏకైక పార్టీ బీజేపీ పార్టీ అని అన్నారు. మూడు స్థానాల్లోనూ బీజేపీ పోటీ చేస్తుందని ఆశీర్వదించి అండగా నిలవాలని కేంద్రమంత్రి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News