Thursday, January 23, 2025

నాగళ్లు ఎత్తి తిరగబడాలి

- Advertisement -
- Advertisement -

బిజెపిని కూకటివేళ్లతో పెకలించాలి
ఎరువుల ధరలు పెంచి రైతాంగం నడ్డివిరిచే యత్నం, మోడీ వచ్చాక వ్యవసాయానికి అణాపైసా మేలు జరగలేదు
గ్రామీణ ఆర్థిక రంగం ఛిన్నాభిన్నం, వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర
ధరల పెంపును విరమించుకోకపోతే దేశ, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
కేంద్రం కుట్రలను రైతాంగం అర్థం చేసుకోవాలి : సిఎం కెసిఆర్ పిలుపు

మన తెలంగాణ/హైదరాబాద్:  కొంతకాలంగా కేంద్రం పెంచుతూ వస్తున్న ఎరువుల ధరలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తద్వారా రైతాంగం నడ్డి విరిచేందుకు కేం ద్రం యత్నిస్తోందని విమర్శించారు. ఈ నిర్ణయం దేశ వ్యవసాయ రంగాన్ని మరింత కుదేలు చేసే విధంగా ఉందని మండిపడ్డారు. ఈవిధానాలను చూస్తుంటే ముమ్మాటికి మోడీది రైతు వ్యతిరేక ప్రభుత్వమని తేటతెల్లమవుతోందన్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని చూస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించివేయాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. ఎరువుల ధరలను పెంచి కేంద్రం వ్యవసాయ ఖర్చులు రెట్టింపు చేయడం అత్యంత దుర్మార్గమని వ్యాఖ్యానించారు. కేంద్రం తీరును చూస్తుంటే రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నట్లుగా కనిపిస్తోందని ఆరోపించారు.

వ్యవసాయన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. అందుకే ఐదు నల్లచట్టాలను ఇటీవల కేంద్రం తీసుకొచ్చిందన్నారు. రైతులు, వివిధ రాజకీయ పార్టీల ఆగ్రహంతో కేంద్రం వెనక్కు తగ్గిందన్నారు. ప్రస్తుతం మళ్లీ రైతులను గోస పుచ్చుకునేందుకు కేంద్రం ఎరువుల మీద పడిందని ఆయన దుయ్యబట్టారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయరంగానికి అణాపైస మేలు జరగలేదని ధ్వజమెత్తారు. పైగా గత ఐదేండ్లలో ఇన్‌పుట్ కాస్ట్ మరింత రెట్టింపు అయిందన్నారు. ఫలితంగా రైతుల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గుడ్డిగా కేంద్రం ఎరువుల ధరలను పెంచుతూ…. యూరియా, డిఎపి వినియోగం తగ్గించాలని రాష్ట్రాలకు చెబుతుండడం ఎంత వరకు సమంజసమని సిఎం ప్రశ్నించారు. ఎరువుల ధరలు తగ్గించకపోగా…. ఆ భారాన్ని రైతులపై నెట్టడం తగదన్నారు. అందువల్ల ఎరువుల సబ్సిడీ కేంద్రం ఇవ్వాలని సిఎం కెసిఆర్ మరోసారి డిమాండ్ చేశారు. అన్నదాతలను కష్టాల నుంచి కాపాడుకోవాలంటే పెట్టుబడి మొత్తాన్ని తగ్గించాల్సిన అవసరముందన్నారు. కేంద్ర ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోకుండా వ్యవసాయ రంగంపై కత్తికట్టినట్లుగా వ్యవహరిస్తోందన్నారు.

కేంద్రం చర్యలతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. ఎరువుల సబ్సిడి విధానాన్ని వారి ప్రయోజనాలకు విరుద్దంగా మార్చారని సిఎం కెసిఆర్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాల కారణంగా రైతుల ఆదాయం రెట్టింపు అవ్వడమో కానీ….వారు జీవించే పరిస్థితి కనిపించడం లేదని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్టా వ్యవసాయ ఖర్చులు రెట్టింపు చేయడం దుర్మార్గమన్నారు. ఈ విధానాలతో మరోసారి బిజెపి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా నిర్ధారణ అయిందన్నారు. బిజెపి పాలనలో రైతాంగం బతికే పరిస్థితి కనిపించడం లేదన్నారు. కరెంటు మోటార్లు బిగించి బిల్లులు వసూలు చేయడం… రైతులు తాము పండించిన ధాన్యాన్ని కూడా కొనకుండా దుర్మార్గపు చర్యలకు పూనుకోవడం వెనక అతిపెద్ద కుట్ర దాగి ఉందని కెసిఆర్ వ్యాఖ్యానించారు.

ఇదంతా గ్రామీణ ఆర్థిక రంగాన్ని చిన్నాభిన్నం చేసి …వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని సిఎం కెసిఆర్ పలు అనుమానాలు, సందేహాలను వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎరువుల సబ్సిడీలను ఎత్తివేసి రైతులను వ్యవసాయం చేయకుండా చేస్తున్న బిజెపి కేంద్ర ప్రభుత్వంపై దేశ రైతాంగం నాగండ్లు ఎత్తి తిరగబడితే తప్ప …వ్యవసాయాన్ని కాపాడుకోలేని పరిస్థితులు దాపురించాయన్నారు. ఇప్పటికైనా ఎరువుల ధరలను పెంచాలనే నిర్ణయాన్ని తక్షమణమే విరమించుకోవాలన్నారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామని సిఎం కెసిఆర్ హెచ్చరించారు. కేంద్రం చేస్తున్న కుట్రలను రాష్ట్ర రైతాంగం అర్థం చేసుకోవాలన్నారు. ఈ చర్యలకు నిరసనగా బిజెపి ప్రభుత్వంపై సాగేంచే పోరాటంలో తమతో కలిసి రావాలని రైతులకు సిఎం కెసిఆర్ పిలుపు నిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News