Thursday, February 6, 2025

పేదల సంక్షేమంపై కేంద్రం నిర్లక్ష్యం

- Advertisement -
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం ఇదివరకు ఎన్నడూ లేని రెట్టింపు ఉత్సాహంతో విడుదల చేసిన బడ్జెట్‌లో మొత్తం మధ్యతరగతికి పన్నురహిత ప్రయోజనం కలిగించి ప్రశంసలు గొంది. అయితే బ్యూరోక్రాటిక్ డాక్యుమెంట్లు బయటపెట్టిన ఆర్థిక చిత్రాన్ని పరిశీలిస్తే దిగువ తరగతుల సంక్షేమానికి అవసరమైన కీలకమైన అంశాలపై ప్రభుత్వం నిర్లక్షం వహించిందని తెలుస్తోంది. మొత్తం ఆర్థిక వ్యవస్థ విధానాల్లోని సూచికల్లో ఒకటి ఆహార ద్రవ్యోల్బణం. విధాన నిర్ణేతలు దీనిపైనే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దేశంలోని ఆహార ద్రవ్యోల్బణాన్ని పరిశీలిస్తే 2024 జులైలో 5.4 శాతం, ఆగస్టులో 5.6 శాతం వరకు ద్రవ్యోల్బణం కనిపించింది. అదే ఏడాది సెప్టెంబర్ నాటికి అమాంతంగా 9.2 శాతానికి పెరిగిపోవడం ఆందోళన కలిగించింది. ఈ అత్యదిక ఆహార ద్రవ్యోల్బణం కొనుగోలుశక్తి అంతగాలేని బలహీన వర్గాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

పప్పు ధాన్యాలు, సంబంధిత ఉత్పత్తుల ధరలు 2022 ఆగస్టు నుంచి రెండేళ్లుగా 7 నుంచి 17 శాతం స్థాయిలో స్థిరంగా ఉన్నప్పటికీ, 2023 జూన్‌లో 10 నుంచి 21 శాతం స్థాయిలో పెరగడం ప్రారంభించాయి. అదే విధంగా 2023 జులై నుంచి కూరగాయల ధరలు 20 శాతం కన్నా ఎక్కువగానే అమాంతంగా పెరుగుతున్నాయి. 2024 సెప్టెంబరు నుంచి ఖాద్యతైలాలు (వంట నూనెలు) కొవ్వుపదార్ధాల ధరలు 2.5 శాతం వరకు పెరిగాయి. ఈ అస్తవ్యస్త పరిస్థితుల్లోనూ పేదలు తమకు వచ్చే ఆదాయంలో 70 శాతం ఆహారానికి ఖర్చు పెడుతున్నారు. అర్బన్ ఏరియాల్లో ఉండేవారు ఆహారం కోసం తమ ఆదాయంలో సరాసరిన 40% ఖర్చుపెడుతున్నారు. అదే గ్రామీణ ప్రాంతాల్లోని వ్యక్తి తన ఆదాయంలో 48% ఆహారం కోసం వెచ్చిస్తున్నాడు. ఇక దిగుమతి అవుతున్న ద్రవ్యోల్బణం ముఖ్యంగా ముడిచమురు, పప్పుదినుసులు, ఖాద్యతైలాలు వంటివి బలహీనమైన రూపాయి మారకం కారణంగా ఆహార ద్రవ్యోల్బణానికి మరింత ఆజ్యం పోస్తున్నాయి.

ఈ మేరకు ధరల స్థిరీకరణ కావాలంటే మార్కెట్‌లోకి ప్రభుత్వం జోక్యం చేసుకోవడం అవసరం. ఇదిలా ఉండగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆహార సబ్సిడీకి నిధుల కేటాయింపు తగ్గించారు. 202425 బడ్జెట్‌లో రూ. 2,05,250 కోట్లు కేటాయించగా, ఈసారి 202526 బడ్జెట్‌లో రూ. 2,03,420 కోట్లు కేటాయించారు. అంటే ఆహార సబ్సిడీకి నిధుల కేటాయింపు 0.89 శాతం తగ్గింది. అదే విధంగా గ్రామీణాభివృద్ధికి కేటాయింపు కేవలం 0.38 శాతం లేదా రూ. 1009 కోట్లు మాత్రమే పెంచింది. 2024 25 లో రూ. 2,65,808 కోట్లు కేటాయించగా, 2025 26లో రూ. 2,66, 817 కోట్లు కేటాయించింది. ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేయడానికి ఈ కీలకమైన రంగానికి కేటాయింపులు కుదించుకుపోయాయి. యువతకు ఉజ్వల భవితవ్యాన్ని చేకూర్చే అత్యంత ముఖ్యమైన రంగాల్లో విద్యకు కూడా కేటాయింపులు కంటితుడుపుగా ఉన్నాయి.

కేవలం 2.4 శాతం మాత్రమే నిధులు పెంచారు. గత ఏడాది బడ్జెట్‌లో రూ. 1,25,638 కోట్లు కేటాయించగా, ఈసారి 2025 26 బడ్జెట్‌లో రూ. 1,28,650 కోట్లు కేటాయించారు. అంటే అదనంగా కేవలం రూ. 3012 కోట్లు మాత్రమే పెంచడమైంది. ఈ చాలీచాలని నిధులతో ద్రవ్యోల్బణం ఏమాత్రం సర్దుబాటు కాదు సరికదా, ప్రతికూల పరిణామాలకు దారితీస్తాయి. ప్రభుత్వం నిర్వహించే విద్యాసంస్థలు నిధుల కొరతతో అల్లాడే పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా చైనా సవాలును ఎదుర్కోవడం అసాధ్యం అవుతుంది. సామాజిక సంక్షేమానికి కేటాయింపులు 6.28 శాతం వరకు భారీగా (రూ. 56,501 కోట్లు నుంచి రూ. 60,052 కోట్లు) పెరిగాయి. ఆరోగ్యానికి 10.11 శాతం పెంచారు. రూ. 89,287 కోట్లు నుంచి రూ.98,311 కోట్లు వరకు పెంచారు. ఇది కాస్త ద్రవ్యోల్బణ ప్రభావాన్ని నియంత్రించ గలుగుతుంది.

ఈశాన్య ప్రాంతాలకు నాయకత్వం వహిస్తున్నామని బిజెపి చెప్పుకొంటున్నప్పటికీ నిధుల కేటాయింపులో మాత్రం నిర్లక్షం వహించడమైంది. ఈ ప్రాంతాల అభివృద్ధికి 202425 లో రూ. 5900 కోట్లు కేటాయించగా, 202526 లో రూ. 5915 కోట్లు మాత్రమే కేటాయించారు. రేఖామాత్రంగా 0.25 శాతం పెంపు కనిపించింది. వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య కార్యక్రమాలుగా ప్రగల్భాలు ప్రచారం చేస్తున్నప్పటికీ, ఆర్థిక మంత్రి సీతారామన్ వ్యవసాయ రంగంలో రైతులకు ప్రయోజనం కలిగించడానికి అనేక పథకాలు వెల్లడించినప్పటికీ, నిధుల కేటాయింపులో పెంపుదల 12.9 శాతం వరకే కనిపిస్తుండటం గమనించదగినది.

ఇవన్నీ ఇలా ఉండగా, సైంటిఫిక్ విభాగాలకు ఈసారి భారీగానే 70.08 శాతం వరకు నిధుల కేటాయింపు జరగడం విశేషం. గత ఏడాది బడ్జెట్‌లో రూ. 32,736 కోట్ల వరకు కేటాయింపులు జరగ్గా, ఈ ఏడాది బడ్జెట్‌లో అమాంతంగా రూ. 55,679 కోట్లు కేటాయించారు. సైన్సు పరిశోధనలకు ప్రభుత్వం ప్రోత్సాహం భారీగా అందించాలన్న లక్షం పెట్టుకోవడం ఎంతైనా ముదావహం. ముఖ్యంగా ప్రపంచంలో అత్యంత ఆధునిక సాంకేతికత ఆవిష్కరణలు విస్తరిస్తున్న సమయంలో దానికి తగ్గట్టు మన దేశంలో కూడా వినూత్న పరిశోధనలు జరగడానికి అవకాశం ఏర్పడుతుంది. అదే విధంగా నగరాభివృద్ధి (అర్బన్ డెవలప్‌మెంట్) కి భారీగా నిధులు కేటాయింపు జరిగింది. గత ఏడాది రూ. 82,577 కోట్లు కేటాయించగా, ఈసారి రూ. 96,777 కోట్లు కేటాయించారు. ఇదే క్రమంలో ఇంధన రంగానికి నిధుల కేటాయింపులో 18 శాతం పెరుగుదల కనిపిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News