Sunday, September 22, 2024

ప్రతిపక్ష ఐక్యత!

- Advertisement -
- Advertisement -

ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ (భారత జాతీయ అభివృద్ధి, సమ్మిళిత కూటమి) త్వరగా పుంజుకొంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధాని మోడీ ప్రభుత్వం లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరపాలని చూస్తున్నదనే అంచనాలు వెలువడుతుండడంతో తాము కూడా సర్వసన్నద్ధం కావాలనే దృష్టి ఈ కూటమిలో ఏర్పడింది. అంతేకాదు బిజెపి పాలకులు సిబిఐ, ఇడి, ఐటిలను దుర్వినియోగం చేసి తమపై దాడులు జరిపిస్తుండడం, భారత రాజ్యాంగ సెక్యులర్ సందేశానికి తూట్లు పొడుస్తూ మైనారిటీలను నానా ఇబ్బందులకు గురి చేస్తుండడం ప్రజలను అధిక ధరల మంటల్లోకి గిరాటేసి కార్పొరేట్ల సేవలో తరిస్తూ వుండడం, వారిని జనానికి దూరం ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. దేశంలోని ప్రజాస్వామ్యప్రియులు కూడా ఇలాగే అనుకొంటున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు మంచి స్పందన వచ్చిందనే అభిప్రాయమూ వుంది. ఇనుము బాగా కాలివున్నప్పుడే దెబ్బ వేయాలన్న దృష్టి ప్రతిపక్షంలో చోటు చేసుకొన్నది.

పాట్నా, బెంగళూరులలో తొలి రెండు సమావేశాలు జరుపుకొన్న ‘ఇండియా’ శుక్రవారం నాడు ముంబైలో మూడో సారి భేటీ అయింది. 28 పార్టీల ఈ కూటమికి నిర్ణాయక వ్యవస్థగా వ్యవహరించడానికి 14 మంది సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని ముంబై సమావేశాల్లో తీసుకొన్న నిర్ణయం కీలకమైనది.అలాగే ఎన్నికల వ్యూహ సంఘాన్ని, ప్రచార కమిటీని, సామాజిక మాధ్యమాలకు, మామూలు మీడియాకు, పరిశోధనకు వేర్వేరుగా వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది.కూటమి పార్టీల మధ్య లోక్‌సభ ఎన్నికలకు సీట్ల పంపిణీపై వీలైనంత తొందరలో ఒక అంగీకారానికి రావాలని నిర్ణయం తీసుకోడం గమనించవలసిన విషయం. ఒకటి, రెండు రాష్ట్రాల్లో తమ కూటిమిలోని పార్టీల మధ్యనే పోటీ తప్పనిసరి కానున్నదనే స్పృహ కొట్టొచ్చినట్టు కనిపించింది. తమ ముందున్న దారి చదునైనది కాదని, రాళ్ళూ రప్పలూ, గోతులూ గొప్పులూ వున్నాయనీ అందుచేత జాగ్రత్తగా అడుగులు వేసి గమ్యం చేరుకోవలసి వున్నదని ఈ కూటమి భావిస్తున్నట్టు స్పష్టపడుతున్నది.

కన్వీనర్‌ను ప్రకటించకుండా జాగ్రత్త పడడంలో ఇదే రుజువవుతున్నది. కన్వీనర్‌ను ప్రకటించినట్లయితే ఆ వ్యక్తినే కూటమి తరపు ప్రధానిగా భావించే ప్రమాదమున్నదని, అది ఐక్యతను దెబ్బ తీయగలదని తలంచి ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకొన్నట్టు అర్థమవుతున్నది. బిజెపి దేశంలోని రాజకీయ పార్టీలన్నింటి కంటే సంపన్నమైనది, పైగా అధికారంలో వున్నది. దాని వైఫల్యాలు ఎన్ని వున్నప్పటికీ బలాలు సైతం అంతకు మించి వున్నాయి. కార్పొరేట్ శక్తుల అండదండలు దానికే వున్న సంగతి తెలిసిందే. అలాగే జాతీయ మీడియా దానికి పూర్తిగా దన్నుగా వుందనే అభిప్రాయమూ నెలకొని వుంది. మతం కార్డు సరేసరి. అందుచేత దానిని ఓడించడం అనుకొన్నంత సులభమూ కాదు. అయితే ప్రాంతీయ పార్టీలు సహా మొత్తం ప్రతిపక్షాలన్నింటి మధ్య సఖ్యత దృఢంగా వున్నప్పుడు సాధ్యం కానిది కూడా వుండదు. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు, వామపక్షాలకు మధ్య పచ్చిగడ్డి కూడా భగ్గుమంటున్నది. వామపక్షాలకు కూటమిలో అధిక ప్రాధాన్యం ఇస్తే మమతా బెనర్జీ అసంతృప్తికి గురి కావచ్చు.

అలాగే కేరళలో వామపక్ష కూటమికి, కాంగ్రెస్ కూటమికి మధ్య బొత్తిగా పొసగదు. ఇటువంటి స్వీయ లోపాలను దాటుకొని ఐక్యతను కాపాడుకోవలసిన బాధ్యత ‘ఇండియా’ కూటమిపై వుంటుంది. అలాగే కాంగ్రెస్‌కు, ఆప్‌కు మధ్య అనైక్యత ఢిల్లీ, పంజాబ్ వంటి చోట్ల కూటమి ధర్మాన్ని బలి తీసుకొనే ప్రమాదముంది. సమావేశాలతో కాలం వృథా చేయరాదని బెంగాల్ లో సీట్ల సర్దుబాటు పని త్వరగా పూర్తి చేయాలని మమతా బెనర్జీ అన్నట్టు వార్తలు చెబుతున్నాయి. బిజెపి దేశంలోని హెలికాప్టర్లన్నింటినీ ముందుగానే తన అదుపులోకి తెచ్చుకొంటున్నదని, డిసెంబర్‌లోనే లోక్‌సభ ఎన్నికలు జరిపించడానికి అది పావులు కదుపుతున్నట్టు తెలుస్తున్నదని మమతా బెనర్జీ ఈ మధ్య వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మొత్తానికి ప్రతిపక్షం ఎన్నడూ లేనంత రీతిలో ఐక్యతను సాధించుకొంటున్నట్టు బోధపడుతున్నది. పాలక కూటమి కూడా దీనిని గమనించి అడుగులు వేస్తున్నది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరిపించాలని తీసుకొన్న నిర్ణయం అనేక ఊహాగానాలకు దారి తీసింది.

ముఖ్యంగా ఎన్నికల్లో ప్రజలు తమను ఉపేక్షించడానికి వీల్లేని రీతిలో ఈ ప్రత్యేక సమావేశాల్లో కీలక బిల్లులను ఆమోదింప చేసుకొంటుందనే అంచనా ఎంత వరకు నిజమవుతుందో చూడాలి. తనకు బాగా ఇష్టమైన ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు ఆమోదం పొందవచ్చు.అలాగే జమిలి ఎన్నికల ఊసుకి కూడా విశేష ప్రాధాన్యం కనిపిస్తున్నది. మొత్తానికి శ్రుతి మించుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మణిపూర్ వంటి సమస్యలపై ప్రజలకు బిజెపి ఏ విధంగా సమాధానం చెబుతుందో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News