నిరుద్యోగ యువత కోసం రాజీవ్ యువ వికాసం తెచ్చాం
ఏడాదిలో 69 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం
అభాగ్యుల అభ్యున్నతిలో తెలంగాణ రోల్ మోడల్ –
డెహ్రాడూన్ చింతన్ శివిర్‌లో మంత్రులు పొన్నం, సీతక్క
మన తెలంగాణ / హైదరాబాద్ : బిసి,ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాసం పథకాన్నీ ప్రారంభించిందని బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మొదటి ఏడాది రూ. 6 వేల కోట్లతో 4 లక్షల మందికి ఆర్థిక వృద్ధి సాధించడానికి 50 వేల నుండి 4 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేసి వారికి జీవనోపాధి కల్పిస్తుందని తెలిపారు. సామాజిక న్యాయం, సాధికారత పై కేంద్ర సామాజిక న్యాయ మంత్రి డా. వీరేంద్ర కుమార్ అద్యక్షతన డెహ్రాడూన్ లో రెండు రోజుల చింతన్ శివిర్ కార్యక్రమం సోమవారం ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రం నుండి మంత్రులు పొన్నం ప్రభాకర్ ,సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగిస్తూ రాష్ట్రంలో పారదర్శకంగా కులగణన చేశామని బిసిలు 56 శాతం ఉన్నారని, వారికి రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచడానికి అసెంబ్లీలో చట్టం చేశామని తెలిపారు.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపాలని కోరారు. రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ,యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ లను ప్రభుత్వం స్థాపించిందని, విద్యకు ప్రజా పాలన ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సంవత్సర కాలంలో 69 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని, వివిధ కార్పొరేషన్ ల ద్వారా పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం చేయడానికి కళ్యాణ లక్ష్మి,విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ , గీతా కార్మికుల రక్షణకు సేఫ్టీ కిట్స్ , బిసి స్టడీ సర్కిల్ ల ద్వారా నిరుద్యోగ విద్యార్థులకు గ్రూప్స్ , బ్యాంక్ , డిఎస్‌సి శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. తమ ప్రభుత్వం మహిళలకు రైతులకు పెద్ద పీఠ వేస్తుందన్నారు. మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ఆర్‌టిసి ప్రయాణం అందిస్తున్నామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం మహిళలకు ఎన్నో పథకాలు ప్రారంభించిందన్నారు. రైతులకు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ ,సన్న వడ్ల కు 500 బోనస్, పంట నష్టపరిహారం, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, సన్న బియ్యం పంపిణీ, మహా లక్ష్మి ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కి గ్యాస్ తదితర సంక్షేమ పథకాలు అందించడంతో పాటు పెట్టుబడులకు రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు.
అభాగ్యుల అభ్యున్నతిలో తెలంగాణ రోల్ మోడల్ -: సీతక్క
అభాగ్యుల అభ్యున్నతిలో తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ గా నిలుస్తుందని మంత్రి సీతక్క అన్నారు. సామాజిక న్యాయ సాధన దిశలోనే ప్రజా ప్రభుత్వం ప్రతి పైసా ఖర్చు చేస్తోందని వివరించారు. రాష్ట్రంలో వయోవృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్ల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం చేస్తున్న కృషి, అమలవుతున్న పథకాలను వివరించారు. ఆయా వర్గాల సంక్షేమానికి కేంద్ర సహకారాన్ని మంత్రి అభ్యర్దించారు. తెలంగాణ ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం చేస్తున్న కృషిని గుర్తు చేశారు. సామాజిక, ఆర్దిక, రాజకీయ అవకాశాల్లో అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడమే సామాజిక న్యాయమని అన్నారు. 30 ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న ఎస్‌సి వర్గీకరణ బిల్లును ఆమోదించినట్లు వెల్లడించారు. ఈ రెండు బిల్లులు సామాజిక న్యాయాన్ని అమలు చేసే దిశలో గొప్ప మైలు రాళ్లుగా నిలుస్తాయన్నారు. సంపన్నులు తినే సన్న బియ్యాన్ని ప్రజా పంపిణి వ్యవస్థ ద్వారా కోట్ల మంది ప్రజలకు అందిస్తున్నట్లు తెలిపారు.