హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో రుణాల వసూలుకు సంబంధించి బ్యాంకులు కొంత ఉదారంగా వ్యవహరించి తిరిగి గాడిన పడే విధంగా ప్రయత్నం చేయాలని మంత్రి కెటిఆర్ సూచించారు. ప్రగతిభవన్‌లో ప్రేరణ కార్యక్రమాన్ని ఐటి మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎంఎస్‌ఎంఇ రంగం కోసం ఇండియన్ బ్యాంక్ ప్రేరణ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఎంఎస్‌ఎంఇ రంగానికి కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు మరింత సహకారం అందించాలన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, ఆర్‌బిఐ గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. వ్యవస్థలో బలహీనుడి పక్షంగా నిలబడాలని సిఎం కెసిఆర్ పదే పదే గుర్తు చేశారని, ఆ దిశగానే ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, రుణాలు, ఫండింగ్ విషయంలోనూ పారిశ్రామిక రంగానికి వెన్నుదున్నుగా నిలుస్తున్న సూక్ష్మ, మధ్య తరహా పారిశ్రామిక వేత్తలకు బ్యాంకులు అండగా ఉండాలన్నారు. ఎంఎస్‌ఎంఇ రంగం కోసం ప్రేరణ కార్యక్రమాన్ని చేపట్టిన ఇండియన్ బ్యాంకుకు అభినందనలు కెటిఆర్ తెలిపారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాలు గత రెండు దశాబ్దాలుగా తీసుకున్న రుణాలకు అద్భుతమైన రీపేమంట్ శాతాన్ని కలిగి ఉన్నాయని కొనియాడారు.