Wednesday, January 22, 2025

రైతులు శత్రువులా ?

- Advertisement -
- Advertisement -

మోడీ ప్రభుత్వం ‘రైతు వ్యతిరేకి’
హక్కుల డిమాండ్‌కు వారికి ఇచ్చే ప్రతిఫలమా వ్యతిరేకత ?
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే

న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ ప్రభుత్వం ‘రైతు వ్యతిరేకి’ అని, రైతులు తమ హక్కులు డిమాండ్ చేస్తున్నందుకు వారిని ‘శత్రువులు’గా పరిగణిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం ఆరోపించారు. నిరసన ప్రదర్శన కోసం రైతులు దేశం అంతటి నుంచి బుధవారం (6న) ఢిల్లీ చేరుకోవాలని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పాంధర్, జగ్జిత్ సింగ్ దల్లెవాల్ పిలుపు ఇచ్చిన మరునాడు ఖర్గే ఈ ఆరోపణ చేశారు. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కి చట్టబద్ధమైన గ్యారంటీ, రైతు రుణాల మాఫీతో సహా తమ వివిధ డిమాండ్లకు మద్దతుగా ఈ నెల 10న నాలుగు గంటల పాటు దేశవ్యాప్త ‘రైలు రోకో’ ఆందోళనకు కూడా రైతు నాయకులు పిలుపు ఇచ్చారు.

ప్రస్తుత నిరసన ప్రాంతాల వద్ద రైతుల ఉద్యమాన్ని ఉద్ధృతం చేయనున్నట్లు, తమ డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించేంత వరు ఉద్యమాన్ని కొనసాగించనున్నట్లు వారు స్పష్టం చేశారు. ‘ఎంపిక చేసిన ఆశ్రిత సంపన్న మిత్రుల’ ప్రయోజనార్థం మోడీ ప్రభుత్వం రైతుల శ్రేయస్సును పణంగా పెట్టిందనిఖర్గే హిందీ ‘ఎక్స్’ పోస్ట్‌లో ఆరోపించారు. ‘దేశానికి ఆహారం సమకూర్చే రైతు బంపర్ ఉత్పత్తిని కోరుతూ ఎగుమతి చేయాలని వాంఛిస్తున్నప్పుడు మోడీ ప్రభుత్వం గోధుమలు, ధాన్యం, చక్కెర, పప్పు ధాన్యాల ఎగుమతిని నిషేధించింది’ అని ఆయన విమర్శించారు.

బిజెపి తన హయాం పొడుగునా ఇదే పని చేసిందని ఖర్గే ఆరోపించారు. దీని ఫలితంగా కాంగ్రెస్ యుపిఎ పాలనలో 153 శాతం మేర పెరిగిన వ్యవసాయ ఎగుమతులు బిజెపి పాలనలో 64 శాతం మాత్రమే హెచ్చినట్లు ఆయన తెలిపారు. ‘ఎంఎస్‌పికి, రెండింతల ఆదాయానికి మోడీ ప్రభుత్వ గ్యారంటీ బోగస్‌గా తేలడమే కాకుండా రైతు వ్యతిరేక బిజెపి 62 కోట్ల మంది రైతులు వెన్ను విరిచేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు’ అని ఖర్గే ఆరోపించారు. ‘ఇప్పుడు రైతులు తమ హక్కులు కోరుతుండగా మోడీ ప్రభుత్వం వారిని శత్రువులుగా పరిగణిస్తోంది’ అని ఆయన ఆక్షేపించారు. ఉద్యమ రైతులు తమ ‘ఢిల్లీ చలో’ పాదయాత్రను భద్రత దళాలు నిలిపివేసిన తరువాత పంజాబ్, హర్యానా మధ్య శంభు, ఖనౌరి సరిహద్దు కూడళ్లలో మకాం వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News