Wednesday, January 22, 2025

అవిశ్వాస తీర్మానం ఓడినా గెలిచిందెవరు?

- Advertisement -
- Advertisement -

లోక్‌సభలో ప్రతిపక్షాల బలం ఎంతో అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు ఏమీ దాచుకోకుండా ముందే చెప్పాయి. అధికార, ప్రతిపక్షాల సంఖ్యాపరమైన బలాబలాల లెక్కలు అందరికీ విస్పష్టమైన అవగాహన ఉంది. ఇందులో కొత్త విషయం, దేవ రహస్యం ఏమీ లేదు. ప్రభుత్వంపై ఈ అవిశ్వాస తీర్మానం గెలుపు, ఓటములకు సంబంధించిన విషయం కాదు. తగలబడుతున్న మణిపూర్ మంటలు ఇంకా చల్లారలేదు. రాను రాను విస్తరిస్తున్నది. ఈశాన్య ప్రజలకు దేశం అండగా ఉన్నదని చాటిచెప్పేందుకు, ఒక ఊరట, భరోసా ఇచ్చేందుకు ఈ అవిశ్వాస తీర్మానం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతున్నట్లు కాంగ్రెస్ తోపాటు విపక్షాల కూటమి నాయకులు ముందుగానే చెప్పారు. మణిపూర్ దురాగతంపై ప్రధాన మంత్రి మూడు నెలల పాటు కనీసం స్పందించకపోవడం దుర్మార్గం. తండ్రి లాంటి బాధ్యత గల ఏ దేశాధినేత ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించరు.

దేశాన్ని కలవరపరచిన విషయంపై ఇలా మాట్లాడకుండా మౌనవ్రతం పట్టిన ప్రధానిని నోరు విప్పేటట్లు చేయాలని విపక్షాలు పూనుకున్నాయి. నరేంద్ర మోడీతో కనీసం ‘అవిశ్వాస తీర్మానం’ పేరిట జవాబు ఇచ్చేటట్లు చేయాలన్న ఉద్దేశంతో విపక్షాలు ప్రయత్నించాయి. కొంతమేరకు వారి ఆశయం నెరవేరింది.కావాలని ఇంటర్నెట్‌ను బంద్ చేసి నిజాలు ప్రపంచానికి తెలియకుండా డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రయత్నాలు విఫలమై ఈ భయానికమైన వీడియో ప్రపంచంలో వైరల్ అయిన సందర్భంలోనైనా ప్రధాన మంత్రి హోదాలో కాకపోయినా కనీసం సాధారణ పౌరునిగా కూడా స్పందించ లేదు. ఇక నోరు విప్పాల్సిన సమయంలో కూడా మణిపూర్ ఘాతుకాన్ని నేరుగా ఖండించలేదు. ఓ రెండు కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలను కూడా జత చేసి తన జంట ప్రభుత్వ అసమర్ధతను చెప్పకుండా స్వయంగా తల దించుకోవాల్సిన ప్రధాని దేశం తలదించుకొనే సంఘటనగా పార్లమెంట్ వెలుపల మాట్లాడారు. అలాంటి హృదయ పరివర్తన లేని వ్యక్తి, అవిశ్వాస తీర్మాన సమయంలో మాత్రం నేరుగా విషయానికి పరిమితమై మాట్లాడతారనే భ్రమలు ఎవరికీ లేవు.

కాకపోతే ఇదో మొక్కుబడి తంతు. ఎప్పటి మాదిరి సుమారు రెండు గంటల సుదీర్ఘ ప్రసంగంలో ప్రధాని ఓ పది నిమిషాలు కూడా ఆ తగలబడుతున్న మణిపూర్ గురించి మాట్లాడ లేదు. ఎంత సేపూ పరనింద తప్ప బాధితులకు ఊరట కల్పించే మాటలేదు. కనీసం సగటు మనిషిగానైనా పశ్చాత్తాపం లేదు. పైగా జోకులు, అసందర్భ నవ్వులు, స్వపక్ష బల్లల చరుపుల మోత తప్ప మరేమీ జరగలేదు. ప్రధాని మోడీ ప్రభుత్వానికి సభలో తిరుగులేని మెజారిటీ ఉన్నా అవిశ్వాస తీర్మానం వచ్చే పరిస్థితిని స్వయంగా కొనితెచ్చుకున్నందుకు నిజానికి సిగ్గుపడాలి. మణిపూర్‌లో పరిస్థితుల మీద రాహుల్ సహా విపక్ష నేతలంతా పలు ఆరోపణలు చేస్తూ అంతా ఆందోళనలు వెలిబుచ్చిన తర్వాత కూడా తన సుదీర్ఘ ప్రసంగంలో తొలి తొంభై నిమిషాల్లో ప్రధాని మణిపూర్ పేరు కూడా ఎత్తకపోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అసలు విషయం పక్కకు పెట్టి, విపక్షాలు ఎంత మొత్తుకున్నా ‘మణిపూర్, మణిపూర్’ అంటూ నినాదాలు చేస్తున్నా అసలు విషయం మాట్లాడకుండా, ఏకపక్షంగా ఆయన తన హయాంలో సాధించిన అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడారు.

చివరికి ప్రధాని సభలో 10 నిమిషాలు మణిపూర్ గురించి మాట్లాడారు. కానీ అది కూడా విపక్ష ఎంపిలంతా సహనం కోల్పోయి సభ నుంచి వాకౌట్ చేసిన తర్వాతే.ప్రతిపక్షాలు సభలో మారు మాట్లాడకుండా కూర్చొనిఉంటే ప్రధాని తన ప్రసంగంలో కనీసం ఆ నాలుగు మాటలు అయినా మాట్లాడేవారా లేదా తెలియదు. అయినప్పటికీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన విపక్షాలు సభ ముగిసేంత వరకు సభలోనే కూర్చోవాలి. ఈ విపక్షాలు ‘వాకౌట్’ ను చేయకుండా వుండాల్సింది. దీనిని ఎవరూ సమర్ధించరు. బీరేన్ సింగ్ ఏ తప్పూ చేయలేదని, కేంద్రానికి సహకరిస్తున్నారని ఓ అసమర్ధ ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి వెనకేసుకొచ్చారు. ఈశాన్య రాష్ట్రాలకు నెహ్రూ చేసిన ద్రోహం నుంచి ఇప్పుడు రాహుల్‌ను కించపరచడం వరకు హోం మంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి పోటీపడ్డారు.రాహుల్ గాంధీ ‘ఫ్లయింగ్ కిస్’ ఇచ్చారంటూ స్మృతీ ఇరానీ నేతృత్వంలో చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం జరిగింది. మణిపూర్‌కు అండగా ఉంటామని ఓ నాలుగు మంచి మాటలు చెప్పకుండా విపక్షాలపై నిందలు వేసే ఎన్నికల సభ లాగా ముగిసింది.

మణిపూర్, హర్యానా లాంటి దుస్సంఘటనలు జరగకుండా చూస్తామని కానీ, బాధితులను ఫలానా విధంగా ఆదుకుంటామనే హామీగానీ సభలో ప్రధాని వివరంగా ప్రస్తావించలేదు. ప్రధాని ప్రసంగంలో ఏదో తడబాటు, అస్పష్టమైన గొణుగుడు వినిపించింది. నిజానికి మణిపూర్ విషయంలో మాట్లాడటానికి ఆయన దగ్గర తగిన సమాధానం లేనట్లు, ప్రసంగానికి కావాల్సిన ‘హోం వర్క్’ చేసినట్లు కనపడలేదు. జరిగిన విషం ఒకటైతే మాట్లాడింది మరొకటి. యథాలాపంగా మాట్లాడినట్టు అనిపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News