Friday, November 22, 2024

అటవీ సంరక్షణ నియమాల బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి

- Advertisement -
- Advertisement -

అడవులను కార్పొరేట్లకు కట్టబెట్టే అటవీ సంరక్షణ నియమాల బిల్లును
కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆదివాసీ, అటవీ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం సుందరయ్య పార్కు వద్ద అటవీ సంరక్షణ నియమాలు2022 బిల్లు కాపీతో కూడిన దిష్టిబొమ్మ ను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్ మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం అడవులను, అటవీ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతూ ఈ ఏడాది జూన్ 28న కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ అటవీ సంరక్షణ నియమాలు2022 పేరుతో నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు.

వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో నియమాల బిల్లు ను ఆమోదించేందుకు ప్రణాళికను సిద్ధం చేసిందని తెలిపారు. బిల్లు ఆమోదం పొందితే దేశంలో శతాబ్దాలుగా అడవులే జీవనాధారంగా జీవిస్తున్న కోట్లాది మంది ఆదివాసీలు,పేదలు అడవుల నుండి బలవంతంగా గెంటివేయబడతారని ఆవేదన వ్యక్తం చేశారు. అడవుల్లో చిన్న చిన్న అటవీ ఉత్పత్తులను సేకరిస్తూ పోడు భూములను ఆధారంగా చేసుకుని బ్రతికే గిరిజనులు , పేదల పరిస్థితి మరింత దయనీయంగా మారే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ భూములను అటవీ యేతర భూములుగా మార్చి పారిశ్రామిక అవసరాల కోసం అంబానీ, ఆదాని వంటి కార్పొరేట్లకు లక్షలాది ఎకరాల అటవీ భూములను, అటవీ సంపదను కట్టబెట్టాలని నియమాలలో కేంద్రం పేర్కొనడం కార్పొరేట్లకు ఊడిగం చేసే చర్య అని అన్నారు.

షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసీ గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు ,చట్టాలను పూర్తిగా కాలరాసే విధంగా ఈ నియమాల్లో పేర్కొన్నారని అన్నారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 ప్రకారం దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ఆదివాసి పేదలకు పోడు భూములపై హక్కులు కల్పించాల్సి ఉండగా కేంద్రం తెస్తున్న నూతన అటవీ సంరక్షణ నియమాల బిల్లులో పోడు భూములకు హక్కులు ఇవ్వకూండా నిరాకరించబడతాయని విమర్శించారు. పెసా చట్టం ప్రకారం షెడ్యూల్ ప్రాంతాల్లో గ్రామసభలలో ఆదివాసీలకు ఉన్న అధికారాలు, హక్కులను పూర్తిగా కాలరాసే విధంగా ఉన్నాయని విమర్శించారు. నూతన అటవీ సంరక్షణ నియమాలు ఆదివాసీలకే కాదు, పర్యావరణ మనుగడకే తీవ్ర ప్రమాదం ఏర్పడబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించబోతున్న అటవీ సంరక్షణ నియమాల బిల్లును తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

రైతు చట్టాలకు వ్యతిరేకంగా దేశంలో అన్ని ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించినట్లుగానే ఈ నియమాలకు వ్యతిరేకంగా కూడా గిరిజన, రైతు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరో దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ. నాయకులు ప్రభు లింగం. గిరిజన సమాఖ్య రాష్ట్ర నాయకురాలు స్వరూప. లత. శంకర్. ఎఐకెఎంఎస్ జాతీయ అధ్యక్షులు వేములపల్లి వెంకట్రామయ్య, రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వర్‌రావు. తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మనాయక్, ఆర్ శ్రీరామ్ నాయక్. ధర్మ నాయక్. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, నాయకులు జంగారెడ్డి, చంద్రారెడ్డి. తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటయ్య. తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉప్పలయ్య, బిక్షపతి. పి ఓ డబ్ల్యు రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ పిడియస్‌యు రాష్ట్ర అధ్యక్షులు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News