Monday, December 23, 2024

విశ్వ నాయకుడిగా మోడీ ఎదిగారు : కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

బిజెపిలో చేరిన ముమ్మారెడ్డి ప్రేమకుమార్, కూకట్ పల్లి నాయకులు

మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బిజెపి ఎదిగింది.. యావత్ ప్రపంచానికి నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోడీ ఎదిగారని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని మెట్రో హుడా ట్రక్‌లో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సభలో కూకట్ పల్లి నియోజకవర్గానికి చెందిన ముమ్మారెడ్డి ప్రేమకుమార్ తో పాటు వివిధ పార్టీలకు సంబంధించిన పలువురు నాయకులు ఆయన సమక్షంలో బిజెపిలో చేరారు.

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ గత కాంగ్రెస్ పాలనలో 12 లక్షల కోట్ల రూపాయలను కుంభకోణాల రూపంలో దోపిడీ జరిగింది… ప్రధాని మోడీ పాలనలో రూపాయి అవినీతి లేని నీతివంతమైన పాలన అందించామని వెల్లడించారు. నేడు మన ప్రధాని ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉన్నారు. మోడీ ప్రధాని అయ్యక పాకిస్తాన్ చర్యలను.. ధీటుగా సర్జికల్ స్ట్రైక్ ద్వారా కేంద్ర ప్రభుత్వం తిప్పికొట్టిందని గుర్తుచేశారు. కరోనతో పనులు లేక పేదలు అల్లాడుతుంటే మూడున్నర సంవత్సరాలుగా ఉచితంగా బియ్యం అందిస్తున్నామని కిషన్‌రెడ్డి వెల్లడించారు.

రానున్న ఎన్నికలలో బిఆర్‌ఎస్‌కు ఇప్పుడున్న ఎంపి స్థానాలు కూడా రావు.. ప్రజలు వారిని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మాత్రం నెరవేర్చని కెసిఆర్‌ను ప్రజలు నమ్మరని వెల్లడించారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ కూకట్‌పల్లి బిజెపికి ఎప్పుడూ అండగా ఉండే ప్రాంతం అన్నారు. జిల్లాలో ఎల్లమ్మబండ సర్వే నంబర్ 57లో ఆక్రమణలు చేసిన దళారులకు ముఖ్యమంత్రి మద్దతు తెలుపుతున్నారని ఆరోపించారు. బిఆర్‌ఎస్‌కు ప్రజా సమస్యల మీద దృష్టి లేదు, వారి దృష్టి అంతా కబ్జాల మీదనే ఉందన్నారు. తెలంగాణ సమస్యల వలయంలో చిక్కుకుని ఉంది.. దానిని కాపాడే బాధ్యత తెలంగాణ ప్రజల చేతిలో ఉందన్నారు. సభలో పార్టీ రాష్ట్ర, జిల్లా నేతలు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News