పాట్నా: ప్రధాని నరేంద్ర మోడీ బూటకపు మాటలను దేశ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ఎర్రకోట నుంచి త్రివర్ణ పతాకాన్ని ప్రధాని మోడీ ఎగురవేయడం ఇదే చివరిసారని ఆర్‌జెడి అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు.
దేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం తన నివాసం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన లాలూ ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం ఎంతోమంది ప్రజలు తమ ప్రాణాలను త్యాగం చేశారని చెప్పారు. చరిత్రను యథాతథంగా ఉంచడం మన బాధ్యతని, అయితే బిజెపి మాత్రం చరిత్రను మార్చడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. మహనీయులైన స్వాతంత్య్ర యోదుల వల్లే మనకు స్వాతంత్య్రం దక్కిందని, ఈరోజు వారి త్యాగాలను స్మరించుకోవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఎర్రకోట నుంచి ప్రధాని మోడీ జాతీయ జెండాను ఎగురవేయడం ఇదే చివరిసారని, కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని తాము ఏర్పాటు చేయనున్నామని ఆయన చెప్పారు. ఎర్రకోట నుంచి తన చివరి ప్రసంగంలో మోడీ మంచి విషయాలు ప్రస్తావిస్తారని ఆశిస్తున్నామని, ఆయన మాయమాటలతో ప్రజలు విసుగెత్తిపోయారని లాలూ చెప్పారు.