Thursday, November 21, 2024

ఆలోచన అదానీది, ఆచరణ మోడీది!

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీలో 28 మార్చి 2023న చేసిన హిందీ ప్రసంగ సారాంశాన్ని సంక్షిప్తంగా నేను ఇక్కడ తెలుగులో ఇస్తున్నాను. కేజ్రీవాల్ బయట ఉండడం తనకు ప్రమాదమని భావించే ఆయనను మోడీ, అక్రమంగా జైల్లోకి తోశారు అనేది ధ్రువపడింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఉపన్యాసం ఇలా సాగింది.  అధ్యక్ష మహోదయా! నేను ఈ మధ్య ఒక బిజెపి అగ్రనేతతో మాట్లాడడం జరిగింది. మా మధ్య చాలా సేపు సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఆ వివరాలు తెలుసుకుంటే ఇప్పుడు మీకూ, సభలోని వారందరికీ రోమాలు నిక్కబొడుస్తాయి. కళ్ళు బైర్లు కమ్ముతాయి… ఆయన నన్ను ఒక ప్రశ్న అడిగాడు “కేజ్రీవాల్ జీ మీకు ఏమనిపిస్తోంది? మోడీజీ అదానీకి ఎందుకింతగా మేలు చేస్తున్నాడూ?” అని!! నేనన్నాను “వాళ్లద్దరు మంచి మిత్రులు కదా? అందుకని మిత్రునికి సహాయపడుతున్నాడు” అని చెప్పాను.

“ఓస్! అంతే అనుకుంటున్నారా?” అని ఆయన చిన్నగా నవ్వుకుంటూ ఇంకా ఇలా అన్నాడు “మోడీజీ ఇంత వరకు ఎవరికీ ఏమీ చేయలేదు. తన భార్యకు ఏమీ చేయలేదు. సొంత తల్లిని ఆదుకోలేదు. గుజరాత్‌లో ఉండే సోదరుడికి, ఇంకా ఇతర కుటుంబ సభ్యులకు, బంధు వర్గానికీ ఎవరికీ ఏమీ చేయలేదు. అంతేకాదు. ఆయనకు రాజకీయ భిక్ష పెట్టిన రాజకీయ గురువుకే ఏమీ చేయలేదు. అలాంటప్పుడు ఒక స్నేహితుడి కోసం నియమ నిబంధనలన్నీ పక్కకు నెట్టి ఇంత పెద్ద మొత్తంలో సహాయం మీద సహాయం మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తున్నాడూ? అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించి చూడండి” అంటూ కొద్ది సేపు ఆగాడు. “సొంత వాళ్ళను కూడా అశ్రద్ధ చేసి ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే ఈ రోజుల్లో ఎవరైనా ఒక స్నేహితుడి కోసం దేశాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి తీసుకొస్తాడా?” అని ఆయన నన్ను మళ్ళీ ప్రశ్నించాడు. “అయితే మరి విషయమేమిటో మీరే చెప్పండి” అని అడిగాను. నాకేమీ అర్థం కాక.. ఆయన చెప్పడం కొనసాగించాడు.

“కొంచెం సీరియస్‌గా ఆలోచించండి. మీకే అర్థమవుతుంది! హిడెన్‌బర్గ్ రిపోర్టు వచ్చింది. నాలుగు వైపులా ఛీత్కారాలు వినిపించాయి. అదానీ గ్రూపు కుప్పకూలింది. ఇది అందరికీ తెలిసిన విషయమే! మోడీజీ ఎంతటి స్వార్థజీవి అంటే వారి మధ్య కేవలం స్నేహ బంధమే ఉంటే ఒక్క నిమిషంలో నాకు అతనితో అంటే అదానీతో అవసరమే లేదని చెప్పి, పక్కన పెట్టేవాడు. కాని , అలా జరగలేదు. కారణం ఏమిటీ? ఇప్పటికీ ఆయనకు వెన్నుదన్నుగా ఉంటున్నాడు. ఒక్కోసారి అదానీకి డబ్బులివ్వండని ఎస్‌బిఐకి చెపుతున్నాడు. ఈ రోజే పత్రికలో వార్త వచ్చింది. పిఎఫ్ వారికి కూడా డబ్బులివ్వమని చెపుతున్నాడు. అంటే అదానీకి డబ్బులిచ్చి కాపాడండని మొత్తం ఏజెన్సీలనన్నింటినీ పురమాయిస్తున్నాడు.

ఎందుకూ ? ఏ రాజకీయ నాయకుడూ అలా చేయడు. తనకు అప్రతిష్ఠ వస్తుందనుకున్న మరుక్షణమే అలాంటి వారిని దూరం పెడతారు. ఎవడో మునిగిపోతున్నాడంటే ఏ రాజకీయ నాయకుడైనా ఎందుకు పనిగట్టుకుని అన్ని వైపుల నుండి అన్ని రకాలుగా సహాయ పడతాడూ? కొద్దిపాటి ఇంగిత జ్ఞానం ఉన్నవారికైనా విషయం అర్థమవుతుంది” అని అన్నాడు ఆ బిజెపి ముఖ్యనేత. అవును అందులో ఇంకా ఏదో విషయం దాగుందని నాకు అనిపించింది. అందుకే నేనన్నాను. “నిజమే కదా? మరి మోడీజీ ఎందుకు అలా చేస్తున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. ఘోరంగా నష్టపోయి, కూలిపోయే వారికి ఏ రాజకీయ నాయకుడైనా ఎందుకు సహాయ పడతాడూ? అసలు విషయమేమిటో చెప్పండి!” అని అడిగాను కొంచెం ఉత్సుకతతో. “అసలు విషయమేమంటే బయటికి చూపించేది అదానీని.. లోపల ఉన్నది మోడీజీనే” అన్నాడు. “అరె! అదెలా?” నా ఉత్సుకత పెరిగింది.

“బయటి ప్రపంచానికి అదానీని చూపిస్తున్నాడు గాని, లోపల ఆ డబ్బులన్నీ మోడీవే. మోడీ నుండి 10/ 15/ 20 శాతం కమీషన్ తీసుకుని పని చేసే ఫైనాన్సియల్ మేనేజర్ అదానీ! అంతే ప్రపంచ ఐశ్వర్యవంతుల జాబితాలో అదానీ పేరు రెండోదిగా ప్రకటించినపుడు మనం అర్థం చేసుకోవాల్సిందేమంటే ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో మోడీ రెండవవాడిగా నిలిచాడు అని! రేప్పొద్దున అధికారం కోల్పోయి జెపిసి, ఇడి, సిబిఐ లతో విచారణ జరిగితే గనక, దొరికిపోయేది అదానీ కాదు మోడీనే! నిండా మునిగేది అదానీ కాదు, మోడీనే! అదానీ దివాలా తీశాడంటే మోడీజీ దివాలా తీశాడనే అర్థం!! ఆయన చెపుతున్న మాటలకు నేనాశ్చర్యపోయాను. నాకు నమ్మశక్యంగా అనిపించలేదు. అందుకే అన్నాను. “మోడీజికి అంతడబ్బు ఎందుకూ? కుటుంబమే లేనోడు. అంత డబ్బు ఏం చేసుకుంటాడు పాపం!!”

“పాపం కాదు, కేజ్రీవాల్‌జీ అది దాహం! ధన దాహం!! అదొక పిచ్చి. అదొక మైకం.. దానికి హద్దే ఉండదు. దానికి అలవాటు పడిన వాడు వెనక్కి తగ్గడు. విచక్షణా శక్తి కోల్పోతాడు. ప్రపంచంలోని ధనవంతులంతా ధన సంపాదనలో ఇంకా ఇంకా ఎందుకు తాపత్రయ పడుతున్నారూ? సామాజిక సేవా కార్యక్రమాలు ఎందుకు చేపట్టడం లేదూ? ఒక్కసారి ఆలోచించండి. ధనదాహం నెత్తికెక్కిన వాడు ఒక పిచ్చివాడిలా ప్రవర్తిసాడు ఎన్ని అనైతిక కార్యక్రమాలకైనా సిద్ధపడతాడు. ఏదిఏమైనా కానీయండి. వ్యక్తిగతంగా తన స్వార్థం తను చూసుకుంటాడు” అని ఆ బిజెపి అగ్ర నాయకుడు చెప్పినపుడు నాకొక కొత్త విషయం తెలిసినట్లయింది. నమ్మక తప్పలేదు. ఆయన చెప్పిన కోణంలో ఆలోచిస్తే నిజమే! మోడీజీ ఈ పదేళ్ళలో అలాంటి అనైతిక కార్యక్రమాలకే ప్రాధాన్యమిచ్చాడని అనిపించింది. అయితే, మోడీ ప్రపంచ ధనవంతుల్లో అక్రమంగా మొదటి వాడిగా నిలవాలని తాపత్రయపడుతున్నాడా? హమ్మా!!

నా పరిస్థితిని గమనించి ఆ బిజెపి అగ్రనేత మరికొంత వివరంగా చెప్పసాగాడు. గుడ్లప్పగింది వినడం నా వంతయ్యింది. అధ్యక్ష మహాదయా! ఆయన ఇలా చెప్పాడు “కేజ్రీవాల్ జీ! ఆ మధ్య మోడీజీ శ్రీలంకకు వెళ్ళారు. మీకు గుర్తుంది కదా? శ్రీలంక రాష్ట్రపతి రాజపక్స. రాజపక్సను కలిసి అక్కడి విండ్ ప్రాజెక్టును బలవంతంగా అదానీ గ్రూపునకు ఇప్పించి వచ్చాడు ఆ స్థాయి నేతలు ఎవరైనా అంతగా దిగజారిమీ ప్రాజెక్టు నేను చెప్పిన వారికే ఇవ్వండని ప్రాధేయపడరు. కానీ, నైతికతను, స్థాయిని, హోదాను మరిచిన మోడీ దేశ ఔన్నత్యాన్ని కూడా లెక్కచేయకుండా రాజపక్స దగ్గర దేబరించి, విండ్ ప్రాజెక్టు అదానీకి ఇప్పించివచ్చాడు. అంటే ఏమిటీ లోపాయకారిగా ఆ ప్రాజెక్టు తనే తీసుకున్నాడు. ఈ విషయం ఎలా బయటికి వచ్చిందీ అంటే శ్రీలంక పార్లమెంటు స్టాండింగ్ కమిటీ, అక్కడి విద్యుత్ బోర్డు చైర్మన్‌ను విచారిస్తున్నప్పుడు అసలు విషయం బయటపడింది. మోడీ బలవంతం మీద రాజపక్స చెపితేనే తాను ఆ ప్రాజెక్టు అదానీ గ్రూపునకు ఇవ్వాల్సి వచ్చిందని ఆయన చెప్పాడు.

ఇక, బంగ్లాదేశ్ వారికి విద్యుత్ కావాల్సి వచ్చింది. 1500 మెగావాట్ విద్యుత్ 25 ఏళ్ళ వరకు! మోడీజీ ఆ ప్రాజెక్టు కూడా అదానీకే ఇప్పించాడు. అంటే తన ఖాతాలో వేసుకున్నాడని అర్థం! మోడీజీ ఇజ్రాయెల్ వెళ్ళాడు. ఇజ్రాయెల్‌తో మన దేశానికి రక్షణ సంబంధమైన కొనుగోళ్ళు వున్నాయి. ఆ వ్యాపారమంతా మోడీ అదానీకి ఇప్పించాడు. అంటే తనకే ఇప్పించుకున్నాడు. రెండు మూడేళ్ల క్రితం దేశంలోని ఆరు విమానాశ్రయాల్ని ప్రైవేటుపరం చేయడానికి వేలం వేశారు. అందులో ఉన్న ముఖ్య నిబంధన ఏమిటంటే‘ ఎయిర్ పోర్ట్ నిర్వహణలో అనుభవమున్నవారే వేలం పాటలో పాల్గొనాలి!’ అని ఉంది. అయితే చివరి క్షణంలో ఆ నిబంధన తొలగించి, ఎయిర్ పోర్ట్ నిర్వహణలో ఏమాత్రం సంబంధం లేని అదానీకి వాటిని అప్పగించారు. అంటే ఏమిటి? ఎయిర్ పోర్ట్ నిర్వహణ ఏ మాత్రం తెలియని మోడీ వాటిని తీసుకున్నాడు. ఏ ప్రభుత్వమైనా ఆయా శాఖల్లో అనుభవమున్న వారినే ఎన్నిక చేసుకుంటుంది కదా? కాని, మోడీ ప్రభుత్వంలో అధికారం ఇలా దుర్వినియోగమైంది.”
కొంచెం ఊపిరి తీసుకుని, ఆ అగ్రనేత మళ్ళీ ప్రారంభించాడు.

నా చెవులను నేను నమ్మలేకుండా వింటూ కూర్చున్నాను. “కేజ్రీవాల్‌జీ మీకు తెలుసా? నవంబర్ 2021 నుండి దేశలోని విమానాశ్రయాలలో జరిగే వ్యాపార లావాదేవీలలో 30% డబ్బు ఎవరికి పోతోంది? అంటే అదానీపేరుతో మోడీ జేబులోకి పోతోంది. ఇడి, సిబిఐ వంటి తుపాకులు గురిపెట్టి, బెదిరించి ఫ్యాక్టరీలు లాక్కుంటున్నది. ఎవరి కోసమో కాదు, మోడీ తన స్వంతానికే! 10అక్టోబర్ 2018న క్రిష్ణపట్నం ఎయిర్ పోర్ట్ మీద ఇన్‌కంటాక్స్ సోదాలు నిర్వహించి అదానీ పేరు చెప్పి, దాన్ని మోడీ సొంతం చేసుకున్నాడు. 10 డిసెంబర్ 2020 ఎసిసి, అంబుజా సిమెంట్ ప్లాంట్స్ మీద ఇడి/ సిబిఐ/ ఐటి సోదాలు నిర్వహించి, క్రమంగా వాటిని అదానీ పేరుతో మోడీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇకపోతే ముంబై విమానాశ్రయం 20 జులై 2020న దాని యజమాని జివికె మీద సోదాలు నిర్వహించారు. ఒక్కటే బెదిరింపు “ఇచ్చేసి వెళ్ళు లేదా జైలు కెళ్ళి కూచో” అని! అలా కంపెనీలు, ఫ్యాక్టరీలు, విమానాశ్రయలు అన్నింటికీ అదే దౌర్జన్యం! తలకు తుపాకి గురిపెట్టి ‘ఇస్తావా? చస్తావా?’ అన్న విధంగా మోడీ దౌర్జన్యం నిరాఘాటంగా సాగుతూ వస్తోంది”.

కేజ్రీవాల్ జీ! అర్థమవుతోంది కదా? ఇంకా చూడండి మోడీ అవినీతికి కొత్తదారులు ఎలా వేశాడో రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వం ఒక చితమైన ఆదేశం జారీ చేసింది. ప్రతి రాష్ట్రం తమ పవర్ ప్లాంట్‌కు అవసరమయ్యే పది శాతం ఇంపోర్టెడ్ కోల్ (విదేశపు బొగ్గు) అదానీ నుండి కొనుగోలు చేయాలని ఆ ఆర్డర్ సారాంశం! అవసరం ఉన్నా లేకున్నా తప్పక కొనాలని ఆదేశించింది. దేశంలో దొరికే బొగ్గు టన్నుకు రూ. 2 వేలు అయితే, విదేశీ బొగ్గు రూ. 20 వేలు. అంటే పది రెట్లు ఎక్కువ ధర పెట్టి తప్పనిసరిగా మోడీ (అదానీ) బొగ్గు కొనాల్సి ఉంటుంది. ఈయన దేశానికి ప్రధానా? నియంతా? దౌర్జన్య వ్యాపారా? దేశాన్ని ఇంతగా వంచించే నేత మనకు అవసరమా? బొగ్గు నిల్వలు ఏ ప్రైవేటు కంపెనీ దగ్గర ఉండకూదనీ, కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోనే ఉండాలని లోగడ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. దానికి విరుగుడు మోడీ కనుక్కున్నాడు. 4 వేల కేలరీల కన్నా తక్కువ ఉన్న బొగ్గు రిజెక్టడ్ (నాణ్యత లేని)ది అని అదానీకి ఉచితంగా అప్పగించాడు.

అంటే తనకే పంపించుకున్నాడు. అసలైతే అదంతా నాణ్యత గల బొగ్గు. అధికార దుర్వినియోగంతో ‘రిజెక్ట్‌డ్’ అని చెప్పి, ఉచితంగా కాజేయడమన్నమాట! ఆ రకంగా ఈ దేశ ఖజానా నుండి రూ. 2800 కోట్లు మోడీ లాగేసుకున్నాడు. 2014లో అదానీ (మోడీ) ఆదాయం రూ. 50 వేల కోట్లయితే ఏడేళ్ళ తర్వాత అది 11.5 లక్షల కోట్లు అయింది’.“మోడీజీకి చదువు లేదు. ఇంగ్లీషురాదు. ఆర్థిక పరిజ్ఞానం లేదు. ప్రపంచ పరిజ్ఞానం శూన్యం. అందుకే అదానీని సలహాదారుగా చేసుకుని, అతనికి కొంత కమీషన్ ఇస్తూ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ.. దేశాన్ని దోచుకుంటున్నాడు. ఇంతటి అవినీతి ప్రధాని మనకు గతంలో ఎవరూ లేరు. విదేశీ నాయకులొస్తే వారితో ఫోటోలు తీయించుకోవడం సరే కాని దేశాన్ని తాకట్టు పెట్టే ప్రమాదకరమైన ఒడంబడికల మీద ఎక్కడెక్కడ సంతకాలు చేస్తున్నాడో ఏమో? దేశ ప్రజలు నిజాలు గ్రహించి, మోడీ బిజెపిల నుంచి అధికారం తక్షణమే లాగేసుకోవాలి! తప్పదు!! దేశాన్ని కాపాడుకోవాలి!!అంటూ కేజ్రీవాల్ ప్రసంగాన్ని ముగించాడు.

డాక్టర్
దేవరాజు మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News