మొహాలి : గత ఎనిమిదేళ్లుగా దేశంలో సంపూర్ణ ఆరోగ్యభద్రతకే ప్రాధాన్యం ఇవ్వడమౌతోందని, గత డెబ్బయి ఏళ్ల కన్నా ఏడెనిమిదేళ్ల లోనే ఈమేరకు ఎక్కువ పని జరిగిందని ప్రధాని నరేంద్రమోడీ బుధవారం వెల్లడించారు. మొహాలిలో హోమీ భాభా క్యాన్సర్ ఆస్పత్రి , రీసెర్చి సెంటర్‌ను ప్రధాని ప్రారంభించారు. మొహాలి లోని ముల్లన్‌పూర్‌లో కేంద్ర అణువిద్యుత్ విభాగం ఆధ్వర్యంలో టాటా మెమోరియల్ సెంటర్ సహాయంతో రూ. 660 కోట్లతో ఈ 300 పడకల ఆస్పత్రిని నిర్మించారు. ఈ ఆస్పత్రి ప్రారంభ సభలో ప్రధాని ప్రసంగించారు. క్యాన్సర్ గురించి భయపడవలసిన పనిలేదని, చాలామంది దీన్ని ఓడించారని ప్రధాని పేర్కొన్నారు. ఎంఆర్‌ఐ, మమోగ్రఫీ, డిజిటల్ రేడియోగ్రఫీ, బ్రాకీ థెరపీ, తదితర అత్యంత ఆధునిక వైద్య పరికరాలతో అన్ని రకాల క్యాన్సర్ ను నయం చేసే సౌకర్యాలు ఈ ఆస్పత్రిలో కల్పించారు. ఈ ఆస్పత్రి ఒక్క పంజాబ్ లోనే కాక, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, రాజస్థాన్ నుంచి వచ్చే రోగులకు తృతీయ సంరక్షణ కేంద్రంగా ఉంటుంది. చండీగఢ్ శివారు ముల్లన్ పూర్‌లో ఏర్పాటైన ఈ ఆస్పత్రి ప్రారంభ కార్యక్రమానికి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా హాజరయ్యారు. అంతకు ముందు హర్యానా ఫరీదాబాద్‌లో 2600 పడకల అమృతా ఆస్పత్రిని ప్రధాని ప్రారంభించారు.